సామూహిక అత్యాచారం కేసులో మరికొందరు అనుమానితులు!
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

సామూహిక అత్యాచారం కేసులో మరికొందరు అనుమానితులు!

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, మేడికొండూరు

జిల్లాలో ఈనెల 8న పాలడుగు వద్ద ఓ వివాహితపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో శుక్రవారం మరికొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సమీప గ్రామాలకు చెందినవారే. ఇంతకు ముందే 50 మందికి పైగా అనుమానితులను పిలిచి విచారించినా కేసులో పురోగతి సాధ్యపడలేదు. తాజాగా అదుపులోకి తీసుకున్న వారు ఆ రోజున మద్యం తాగి ఘటనా ప్రదేశంలో బాటిళ్లు వదిలి వెళ్లామని చెప్పారు. దీంతో ఆ మద్యం బాటిళ్లు ఎక్కడ కొనుగోలు చేశారో వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. వీరు మద్యం కొనుగోలు చేసిన ప్రదేశంలో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉంటే వాటి ఆధారంగా వీరిని గుర్తించాలని భావిస్తున్నారు. ఇంతకుముందు అదుపులోకి తీసుకుని విచారించిన వారిలో కొందరు తామే అత్యాచారానికి పాల్పడ్డామని, ఆ దంపతుల నుంచి దోచుకెళ్లిన సొత్తును సత్తెనపల్లిలో విక్రయించామని చెప్పడంతో వారినే నిందితులుగా భావించారు. తీరా ఆ ఆభరణాలు బాధిత మహిళకు చూపిస్తే అవి తనవికాదని చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. అయితే పోలీసులు మాత్రం వారిని అనుమానిస్తూనే ఉన్నారు. వీరు చెప్పే సమాచారం తప్పా? బాధిత మహిళ అభరణాలను గుర్తించడంలో ఏమైనా పొరపాటు పడుతున్నారా అనే కోణంలోనూ పోలీసులు తిరగి విచారణ ప్రారంభించారు. సత్తెనపల్లిలో ఎవరికైతే బంగారు ఆభరణాలు విక్రయించారో ఆ వ్యాపారిని కూడా వీరికి సంబంధించి తెలిసిన సమాచారం చెప్పాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. తాజాగా అదుపులో తీసుకున్న వారి వయస్సు సగటున 22 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిసింది. వీరిని మేడికొండూరు, నల్లపాడు స్టేషన్లలో ఉంచి డీఎస్పీ, సీఐలు వేర్వేరుగా విచారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఈ కేసును సాధ్యమైనంత త్వరగా నిగ్గు తేల్చేందుకు అదనంగా మరో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. గతంలో మేడికొండూరులో పనిచేసిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లను సైతం పిలిపించి ఈ తరహా నేరాలకు పాల్పడేవారు మండలంలో ఏయే గ్రామాల్లో ఉన్నారో వారి వివరాలను సేకరించి పిలిచి మాట్లాడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని