ఆగని అక్రమ తవ్వకాలు
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

ఆగని అక్రమ తవ్వకాలు

యథేచ్ఛగా కొనసాగుతున్న మట్టి రవాణా

ఈనాడు-అమరావతి

లాం- తాతిరెడ్డిపాలెం వద్ద మట్టి తవ్వకాలు

అధికారులు తనిఖీలు చేసి జరిమానాలు వేసినా తాడికొండ మండలం తాతిరెడ్డిపాలెం కొండ వద్ద అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. పగటివేళ కొండను తవ్వి మట్టి తరలిస్తున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కొందరు అధికారుల అండ... ముఖ్యనేత ప్రోద్బలంతో అడ్డగోలుగా మట్టి తవ్వి తరలిస్తూనే ఉన్నారు. దామరపల్లి, లాం, తాడికొండ అడ్డరోడ్డులో వేసిన ప్రైవేటు వెంచర్లకు ఇక్కడి నుంచి టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యనేత ఒకరు అధికారులెవరూ అటువైపు వెళ్లవద్దని ఒత్తిడి తీసుకురావడంతో క్షేత్రస్థాయిలో యంత్రాంగానికి తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పగటివేళ దర్జాగా తరలిస్తున్నా యంత్రాంగం అడ్డుకట్ట వేయకపోవడం గమనార్హం. రెవెన్యూ యంత్రాంగానికి గ్రామస్థాయి నుంచి సిబ్బంది ఉన్నా అక్రమ తవ్వకాలను అరికట్టడంలో విఫలమవుతోంది. దీంతో అక్రమార్కులు దర్జాగా మట్టి తరలించి జేబులు నింపుకుంటుండగా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. కొండపై మట్టి తవ్వుతున్న ప్రాంతానికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కిందికి పోసి మరో పొక్లయిన్‌తో వాహనాలకు లోడింగ్‌ చేస్తున్నారు.


(అంతర చిత్రంలో జేసీబీ)

నేత ఒత్తిడితో వెనుకడుగు

లాం నుంచి జొన్నలగడ్డకు వెళ్లే దారిలో తాతిరెడ్డిపాలెం వద్ద కొండను తవ్వి మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. అనుమతులు లేకపోయినా పగటివేళ భారీ యంత్రాలు పెట్టి మట్టి తవ్వుతున్నారు. కొండపైకి పొక్లయిన్‌ ఎక్కించి తవ్వకాలు చేస్తుండటంతో గుంటూరు-అమరావతి మార్గంలో వెళ్లేవారికి తవ్వకాలు జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తాడికొండ మండలంలో పనిచేసే యంత్రాంగం గుంటూరు నుంచి విధులకు రాకపోకలు సాగించే క్రమంలో సైతం మట్టి తరలింపు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు వాహనాలను స్వాధీనం చేసుకుని రూ.30,091 జరిమానా విధించారు. అయితే అక్కడ ఇప్పటివరకు తవ్విన మట్టి ఎంత? కొండను కొల్లగొట్టి ఎన్ని వేల క్యూబిక్‌ మీటర్లు మట్టి తరలించారు? అందుకు వసూలు చేయాల్సిన జరిమానా ఎంత? అని లెక్కించి అక్రమార్కులపై కొరడా ఝలిపించాల్సి ఉంది. అనుమతులు తీసుకుని తవ్వకాలు జరిపితే క్యూబిక్‌ మీటరుకు రాయల్టీ రూ.105 రాయల్టీ చెల్లించాలి. ఇక్కడ అనుమతులు తీసుకోకుండా తవ్వినందున రాయల్టీకి ఐదురెట్లు జరిమానా విధించాల్సి ఉంది. ఈ లెక్కన ఇక్కడ 500 క్యూబిక్‌ మీటర్లు మాత్రమే తవ్వకాలు చేశారా? కొండ చుట్టూ, కొండపైన వేల క్యూబిక్‌మీటర్లు మట్టి తవ్వి తరలించారు. నేత ఒత్తిడితో నామమాత్రపు జరిమానాతో సరిపెట్టారు. అక్కడితో అయినా తవ్వకాలు ఆగలేదు. రెండు రోజులు తవ్వకాలు ఆపిన మట్టి మాఫియా గురువారం నుంచి అదే ప్రాంతంలో మళ్లీ తవ్వకాలు మొదలెట్టి శుక్రవారం కూడా కొనసాగించింది. మట్టి మాఫియాతో చేతులు కలిపిన ముఖ్యనేతకు ప్రతి ట్రిప్పునకు వసూలు చేస్తున్న సొమ్ములో 50 శాతం వాటా ఇస్తుండడంతో అక్రమ తవ్వకాలకు అండగా నిలిచినట్లు సమాచారం. ముఖ్యనేత భరోసాతో అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. గుంటూరు నగరానికి సమీపంలో తవ్వకాలు జరిపి తరలిస్తున్నా చర్యలు శూన్యం. సామాన్యులు సొంత అవసరాలకు మట్టి తవ్వి తరలిస్తుంటే వాహనాలు స్వాధీనం చేసుకుని జరిమానా వసూలు చేసే యంత్రాంగం అనుమతులు లేకుండా వందల ట్రిప్పులు మట్టి తరలిస్తున్నా అటువైపు వెళ్లకుండా చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాల విషయమై భూగర్భ గనులశాఖ సహాయ సంచాలకులు ఫణిభూషణ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తాతిరెడ్డిపాలెంలో మట్టి తవ్వకాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయికి సిబ్బందిని పంపి మట్టి తవ్వకాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని