చివరి భూములకు సాగునీరందేలా చర్యలు
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

చివరి భూములకు సాగునీరందేలా చర్యలు


వెబ్‌ఎక్స్‌ ద్వారా మాట్లాడుతున్న మంత్రి శ్రీరంగనాథరాజు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని పంట కాల్వల చివరి భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి వ్యవసాయ సలహా సంఘం సమావేశం వెబ్‌ఎక్స్‌ ద్వారా శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ జిల్లాలో రైతులకు నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రైతులు సాగు చేస్తున్న ప్రతి ఎకరం పంట వివరాలను ఆర్బీకేలో తప్పక నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ పురుగుమందులు విక్రయాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన పురుగుమందులు కొనుగోలు చేసేలా రైతులను ప్రొత్సహించాలన్నారు. జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు కౌలు రైతులకు రూ.100 కోట్ల వరకు పంట రుణాలు అందించామన్నారు. సాగు చేస్తున్న పంటలకు అనుగుణంగా అవసరమైన ఎరువులను మండలాల వారీగా వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలకు ఎరువులను సకాలంలో సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి, డీడీలు మురళీ, రామాంజనేయులు, వ్యవసాయ సలహా సంఘం సభ్యులు, ఉద్యానశాఖ, మార్క్‌ఫెడ్‌, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని