‘మోదీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యం’
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

‘మోదీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యం’


సభలో మాట్లాడుతున్న సీపీఐ (ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పీజే జేమ్స్‌, చిత్రంలో వివిధ పార్టీల నాయకులు

లింగాయపాలెం (గ్రామీణ గుంటూరు), న్యూస్‌టుడే: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ను గద్దె దింపడమే ప్రతి భారతీయుడి లక్ష్యం కావాలని కేరళ యూనివర్సిటీ మాజీ ఆచార్యుడు, సీపీఐ (ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పీజే జేమ్స్‌ అన్నారు. రూరల్‌ మండలంలోని లింగాయపాలెంలో శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ హరిప్రసాద్‌ అధ్యక్షతన మాజీ శాసనసభ్యుడు కొల్లా వెంకయ్య వర్థంతి సభ జరిగింది. దీనికి ముఖ్య వక్తగా హాజరైన జేమ్స్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంతో దేశంలో ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులను సంప్రదించకుండా అభివృద్ధి పేరిట కేంద్రం అన్ని సంస్థల ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను అప్రజాస్వామికంగా ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీల కనుసన్నల్లో వ్యవసాయాన్ని ఉంచేందుకే కేంద్రం నల్ల చట్టాలను తెచ్చిందని ఆరోపించారు. నిజానికి దేశాన్ని పాలిస్తోంది భాజపా కాదని, దాని అనుబంధ సంస్థ ఆరెస్సెస్‌ అని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో భాజపా సర్కార్‌కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ నెల 27న జరగబోయే భారత్‌ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయపద్రం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ రాష్ట్ర కార్యదర్శి కొల్లిపర వెంకటేశ్వరరావు, ఓపీడీఆర్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.భాస్కరరావు, ఎంసీపీఐ జిల్లా సహకార్యదర్శి శ్రీధర్‌, సీపీఐ (ఎంఎల్‌) రాష్ట్ర నాయకుడు జె.కిశోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని