పానకం విక్రయ హక్కు రద్దు
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

పానకం విక్రయ హక్కు రద్దు

న్యూస్‌టుడే, మంగళగిరి


కొండపై ఆలయంలో తయారుచేసిన పానకం బిందెలు

మంగళగిరి కొండపై పానకాల స్వామి ఆలయంలో పానకం తయారీ, విక్రయ హక్కును రద్దు చేస్తూ గుత్తేదారుడికి అధికారులు శుక్రవారం నోటీసు జారీ చేశారు. దాన్ని రిజిష్టర్‌ పోస్ట్‌లో ఆయనకు పంపినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి తెలిపారు. ఏడాది కాల వ్యవధికి పానకం, పూజాద్రవ్యాల విక్రయానికి గత నెల 13న దేవస్థానం అధికారులు వేలం నిర్వహించారు. గుత్తేదారుడు రూ.1.35 కోట్లకు హక్కు పొంది, పాట సమయంలో రూ.35 లక్షలు చెల్లించారు. నిబంధనల మేరకు హక్కు పొందిన వెంటనే మిగిలిన రూ.కోటి చెల్లించాల్సి ఉంది. అమ్మకాలు ప్రారంభించే రోజు మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తానని గుత్తేదారుడు కోరగా అధికారులు అంగీకరించారు. ఈ నేపథ్యంలో గత నెల 27న పాత గుత్తేదారుడి నుంచి పానకం, పూజాద్రవ్యాల విక్రయ బాధ్యతలను కొత్త పాటదారుడికి దేవస్థానం అప్పగించింది. రూ.కోటి చెల్లించాలని అధికారులు అతడిని అడుగుతుంటే, ఎప్పటిప్పుడు వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరికి గుత్తేదారుడు దీనిపై కోర్టుకు వెళ్లారు. వాదనలు విన్న కోర్టు ఈ అంశం ఈవో నిర్ణయానికే వదిలి వేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈక్రమంలో వేలం పాట రద్దు చేస్తూ, గుత్తేదారుడు చెల్లించిన రూ.35 లక్షలు దేవస్థానం ఖాతాలో డిపాజిట్‌ చేస్తున్నట్లు తెలుపుతూ అతడికి నోటీసు పంపామని ఈవో రామకోటిరెడ్డి వెల్లడించారు. పానకం, పూజా ద్రవ్యాల విక్రయాలకు మళ్లీ బహిరంగ వేలం వేస్తామని, అప్పటివరకు దేవస్థానమే అమ్ముతుందని ఆయన వివరించారు.

లక్ష్మీనృసింహుడి  ఆలయ ఆదాయానికి గండి

మంగళగిరి, న్యూస్‌టుడే: అవసరానికి మించి పొరుగు సేవల ఉద్యోగులను నియమించి దేవుడి ఆదాయాన్ని దుబారా చేస్తున్న వైనం ఇది. మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహ దేవస్థానంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం ప్రహసనంగా మారింది. 2014-2019 మధ్య కాలంలో 13 మంది ఉద్యోగులను నియమించారు. ఒక్కొక్కరికి నెలకు రూ.12,500 వంతున వేతనాలు చెల్లిస్తున్నారు. ఇందుకు ఏటా సుమారు రూ.20 లక్షలు ఖర్చవుతోంది. ఈ ఉద్యోగుల్లో అయిదుగురు దేవస్థానంలో కాకుండా కొందరు రాష్ట్రస్థాయి, ఇతర ఉన్నతాధికారుల ఇళ్లలో పనిచేస్తున్నట్లు బయటపడింది. వారి జీతాలను దేవస్థానం ఖాతా నుంచే చెల్లిస్తున్నారు. అవసరానికి మించి అదనంగా ఉద్యోగులను నియమించారనే విమర్శలున్నాయి. వీరి నియామకంలో భారీగా సొమ్ము చేతులు మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రూ.30 లక్షల వరకు ముట్టినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోసం ఎవరెవరు ఎంత మొత్తంలో ఎవరికి చెల్లించారో అధికారులు వెలికితీస్తున్నారు. తాను కొత్తగా బాధ్యతలు చేపట్టానని, ఈ వ్యవహారం తనకు తెలియదని ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి అన్నారు. 13 మంది పొరుగు సేవల ఉద్యోగుల నియామకం నిజమేనని, అధికారుల వద్ద పనిచేస్తున్న వారిని వెనక్కి పిలిపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగిలిన విషయాలు తనకు తెలియవని, ఆలయ పాలకమండలిలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని