ఫలితం ఈ రోజు... ఎవరో మారాజు
eenadu telugu news
Updated : 19/09/2021 04:20 IST

ఫలితం ఈ రోజు... ఎవరో మారాజు

వైకాపా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉప్పాల హారిక..?

ఈనాడు, అమరావతి

ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఏకపక్షంగా జిల్లా, మండల పరిషత్తు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగనుంది. అధికార పార్టీ వైకాపాతో పాటు భాజపా, జనసేన అభ్యర్థులు రంగంలో ఉన్నారు. తెదేపా తరఫున వ్యక్తిగత ప్రాబల్యం ఉన్న చోట కొంతమంది అభ్యర్ధులు ప్రచారం చేసి గట్టిపోటీ ఇచ్చారు. జిల్లా పరిషత్తు ఎన్నికలు కీలక మలుపుల మధ్య జరిగాయి. జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి ఈ సారి జనరల్‌ మహిళకు రిజర్వు చేశారు. జిల్లాలో మొత్తం 49 మండలాలు ఉండగా.. 41 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు స్థానాలను ఇప్పటికే వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. మూడు మండలాలలో అభ్యర్ధులు మృతిచెందడంవల్ల వల్ల ఎన్నికలను నిలిపివేశారు. మూడు మండలాలు అర్బన్‌లో విలీనం వల్ల ఎన్నికలను జరపడం లేదు. జిల్లాలో మొత్తం 812 ఎంపీటీసీలకు గాను 648 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 69 స్థానాల్లో ఏకగ్రీవం జరిగాయి. 89 స్థానాలకు ఎన్నికలను నిలిపివేశారు. ఆరు స్థానాల్లో అభ్యర్ధులు మరణించడం వల్ల నిలిచిపోయాయి.

ఏర్పాట్లు పూర్తి..!

ఈ ఎన్నికల్లో మొత్తం 19,64,105 మంది ఓటర్లుకు గాను 12,56,898 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 63.99శాతం నమోదైంది. దాదాపు 20శాతం పైగా పోలింగ్‌కు దూరంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలపై ఆసక్తి చూపకపోవడంతో ఆపార్టీ అభిమానులు కార్యకర్తలు పోలింగ్‌కు రాలేదని చెబుతున్నారు. కొన్ని మండలాల్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చారు. జిల్లాలో అత్యధికంగా ఆగిరిపల్లి మండలంలో 77.71శాతం ఓట్లు పోలయ్యాయి. అతితక్కువగా విజయవాడ గ్రామీణంలో 51.76 శాతం నమోదైంది. విజయవాడలోని ప్రసాదంపాడు ఎంపీటీసీ స్థానానికి మరీ తక్కువగా 19.7శాతమే ఓట్లు పోలయ్యాయి. ఆదివారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.

ముందుగానే నిర్ణయం..!

పెడన నియోజకవర్గానికి చెందిన ఉప్పాల రాంప్రసాద్‌ తనయుడు రమేష్‌ భార్య హారిక జడ్పీ ఛైర్‌పర్సన్‌ అయ్యే అవకాశం ఉంది.. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు స్థానం నుంచి ఆమె పోటీలోకి దిగారు. బలహీన వర్గాలకు చెందిన ఈమెకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. ఆఖరి నిమిషంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆమెకే మార్గం స్పష్టంగా కనిపిస్తోంది.. ఉప్పాల రాంప్రసాద్‌కు గతంలో డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. ఇటీవల ఆయనకు మరోసారి ఇవ్వలేదు. హారిక అభ్యర్థిత్వాన్ని ఓ మంత్రి, ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే బలపర్చడంలేదనే వాదన వైకాపా వర్గాల్లో వినిపిస్తోంది. సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు కుమార్తె, ఉంగుటూరు నుంచి ఏకగ్రీవంగా గెలిచిన దుట్టా సీతా రామలక్ష్మి కూడా ఆశిస్తున్నారు.

జడ్పీటీసీ స్థానాలు: 41

పోటీలో అభ్యర్ధులు: 159

ఎంపీటీసీ స్థానాలు: 648

పోటీలో అభ్యర్థులు: 1631

పోలింగ్‌ శాతం: 63.99


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని