అవినీతి, కుటుంబ పాలన అంతం చేస్తాం
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

అవినీతి, కుటుంబ పాలన అంతం చేస్తాం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

చీరలు పంపిణీ చేస్తున్న సోము వీర్రాజు

గుడివాడ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, రాజధాని అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. ఆ మేరకు చెప్పినట్లు చేసి చూపించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక అవినీతిలో కూరుకుపోయిన కుటుంబ పాలనకు చరమగీతం పాడే లక్ష్యంతో భాజపా ముందుకు సాగుతోందన్నారు. భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఆంధ్రప్రదేశ్‌ ముందుకెళ్తోందని.. కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయలేని దుస్థితిలో ఉందన్నారు. ప్రకటనలతో ప్రచారం ఊదరగొడుతోందని ధ్వజమెత్తారు. శనివారం ఆయన గుడివాడలో విలేకరులతో మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకు రూ. 2 వేల కోట్లను కేంద్రం ఇస్తే టెండర్లు పిలిచి ఎవరూ రావడం లేదంటోందని దుయ్యబట్టారు. ఏడేళ్ల పాలనలో ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారన్నారు. కేంద్రం రూ. 31 వేల కోట్లతో రాష్ట్రంలో పేదలకు 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. 30 వేలు చొప్పున అప్పు ఇస్తోందని ఎద్దేవా చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలకు, పురపాలక సంఘాలకు నిధులిస్తున్నామని, కేంద్రం ఇచ్చే ఉపాధి నిధులతోనే రైతుభరోసా కేంద్రాలు, వైద్యశాలలు, సచివాలయాలు నిర్మిస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై స్పందిస్తూ మోదీ కొత్తగా దీన్ని అమలు చేయడం లేదని, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ ప్రవేశపెట్టిన వాటినే ఆయన కొనసాగిస్తున్నారన్నారు. బస్టాండ్‌ కన్నా హీనంగా ఉండే గన్నవరం ఎయిర్‌పోర్టును నేడు అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దామని, నిమ్మకూరులో బెల్‌ కంపెని, అవనిగడ్డలో డిఫెన్స్‌ లాంచింగ్‌ ప్యాడ్‌, మచిలీపట్నం వరకూ నాలుగు లైన్ల రహదారి, నల్లచర్ల వరకూ 6 వరుసల రహదారి, విజయవాడలో దుర్గమ్మ పైవంతెనను ఎంపీ కేశినేని నాని అడగడంతో పూర్తి చేశాం. బెంజిసర్కిల్‌పై వంతన రెండో వరుస నిర్మాణం, రూ.1800 కోట్లతో ఎయిమ్స్‌, రూ.1000 కోట్లతో అగ్రికల్చర్‌, మరో రూ.1000 కోట్లతో డిజైన్‌ యూనివర్శిటీ, రూ.10 వేల కోట్లతో అనంతపురంలో ఎక్స్‌ప్రెస్‌హైవే టెండర్లు ఖరారు చేశామన్నారు. గుంటూరుకు చేరేలా కృష్ణనదిపై ప్రస్తుత వంతెనకు సమాంతరంగా మరో వంతెన నిర్మాణం చేయనున్నాం. విజయవాడలో నేచర్‌కేర్‌ ఆస్పత్రికి అనుతిస్తే నిర్మించలేని పరిస్థితి రాష్ట్రానిదన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని