ఇంటింటికీ చెత్త బుట్ట.. విభజించి ఇవ్వకుంటే తంటా
eenadu telugu news
Published : 19/09/2021 04:21 IST

ఇంటింటికీ చెత్త బుట్ట.. విభజించి ఇవ్వకుంటే తంటా

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నూరు శాతం ఇంటింటా చెత్తసేకరణకు కార్యాచరణ ప్రారంభించారు. నగరంలోని 3,09,702 ఇళ్లకు మూడు రంగుల బుట్టలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. అందుకు రూ.6,30,60,000 వ్యయం చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని 6 మోడల్‌ డివిజన్లలో బుట్టల పంపిణీ దాదాపు పూర్తిచేయగా, ప్రస్తుతం మిగిలిన ప్రాంతాల్లో చేస్తున్నారు.

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్‌) కింద నగరాన్ని గార్బేజ్‌ ఫ్రీ, లిట్టర్‌ ఫ్రీ, బిన్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. బహిరంగంగా ఎటువంటి వ్యర్థాలు కనిపించకుండా చేయడానికి రహదార్లపై బిన్నులు(చెత్త డబ్బాలు) తీసేస్తున్నారు. కేవలం ఇళ్ల నుంచి నేరుగా వ్యర్థాలను మూడు వేర్వేరు బుట్టల సాయంతో సేకరించి ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు తరలించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016 ప్రకారం తడి, పొడి, హానికర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించేందుకు ప్రస్తుతం మూడు రంగుల బుట్టలను గృహ యజమానులకు పంపిణీ చేస్తున్నారు.

12 లీటర్ల సామర్ధ్యపు బుట్టలు..

ప్రతి ఇంటా నిత్యం సగటున 5.50 కిలోల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఈ నేపథ్యంలో 12 లీటర్ల సామర్ధ్యం కలిగిన బుట్టలను అందిస్తున్నారు. అందులో పచ్చని బుట్టలో కూరగాయలు, ఇతర తడి వ్యర్థాలు, నీలం బుట్టలో పొడి చెత్త,

ఎరుపు దానిలో హానికరమైన వ్యర్థాలను విభజించి సిబ్బందికి అందించాలి. అందుకు భిన్నంగా వ్యవహరించిన పక్షంలో ఇళ్ల యజమానులపై చర్యలు తీసుకుంటారు. ఇందుకు ముందుగా వారిలో తగిన అవగాహన కల్పించనున్నారు.

నగరం.. నాలుగు విభాగాలు

నగరాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు. ఒక్కొక్క సహాయ వైద్యాధికారి పరిధిలో దాదాపు 16 డివిజన్లు ఉంచి, వారినే పర్యవేక్షక అధికారులుగా నియమించారు. వారి ఆధ్వర్యంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కార్యదర్శులు, మేస్త్రిలు ఉంటారు. ఇప్పటికే మోడల్‌ డివిజన్లలో ఇంటింటా చెత్తసేకరణకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.

నగరంలోని అన్ని డివిజన్లలో ప్రతి ఇంటికీ మూడు రంగుల బుట్టలను అందజేసి, వ్యర్థాలను విభజించి మాత్రమే ఇకపై సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు భిన్నంగా సిబ్బంది వ్యవహరించినా, వ్యర్థాలను ఒకే బుట్టద్వారా కలిపి సేకరించినా, వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటారు. అందుకు ముందుగా తగిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరవాసుల కూడా చెత్తను ముందుగా విభజించి ఇవ్వని పక్షంలో వారి నుంచి సేకరించొద్దనే ఆదేశాలు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని