పరిషత్‌ ఫలితాలు ఏకపక్షం
eenadu telugu news
Published : 20/09/2021 05:33 IST

పరిషత్‌ ఫలితాలు ఏకపక్షం

ఈనాడు-గుంటూరు, న్యూస్‌టుడే-జిల్లాపరిషత్తు

మేడికొండూరులో ఓట్ల లెక్కింపు...

డ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జిల్లాలో అధికార పార్టీ వైకాపా జయకేతనం ఎగురవేసింది. ఫలితాలు ఏకపక్షంగా రావడంతో సింహభాగం స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దుగ్గిరాల మండలం మినహా అన్ని మండలాల్లో వైకాపాకు మెజారిటీ స్థానాలు రావడంతో ఆ పార్టీ అభ్యర్థులకే ఎంపీపీ, ఇతర పదవులు దక్కనున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా ఎన్నికలను బహిష్కరించడంతో మెజారిటీ స్థానాల్లో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ పార్టీల తరఫున అభ్యర్థులు పోటీ చేసినా ఒక్క స్థానమూ దక్కకపోవడం గమనార్హం. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైకాపా అభ్యర్థులు ఆధిక్యం కనబరిచారు.

తెదేపా బహిష్కరణతో ఏకపక్షం

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలై ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. ఆయా స్థానాలకు తెదేపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడంతోపాటు దాడులకు తెగబడి ఏకగ్రీవం చేసుకున్నందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించింది. అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో తెదేపా అభ్యర్థులు సైతం సాంకేతికంగా పోటీలో ఉన్నట్లయింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొందరు తెదేపా అభ్యర్థులు పార్టీ నిర్ణయాన్ని కాదని ముందుకెళ్లారు. మెజారిటీ అభ్యర్థులు మాత్రం పార్టీ నిర్ణయానుసారం పోటీకి దూరంగా ఉండిపోయారు. తెదేపా అభ్యర్థులు పోటీచేసిన కొన్నిచోట్ల అధికార పార్టీ అభ్యర్థులను ఓడించి విజయం సాధించారు. అయితే జిల్లావ్యాప్తంగా ఒక్క దుగ్గిరాల మండలం మినహా ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆ పార్టీకి స్థానాలు రాలేదు. జనసేన, భాజపా కలిసి పోటీ చేసినా ఫలితాలు సాధించలేకపోయాయి. వామపక్షాలు ఒక్క ఎంపీటీసీ స్థానంతో సరిపెట్టుకున్నాయి. దీంతో అధికారపార్టీ అభ్యర్థులకు దీటైన పోటీ లేకపోవడంతో వారి విజయం నల్లేరు మీద నడకలా మారింది. మండలాల వ్యవస్థ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని మండలాల్లో తెదేపా ఆధ్వర్యంలోనే ఉన్న ఎంపీపీ పదవులు తొలిసారిగా వైకాపా వశమయ్యాయి. తెదేపా పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ మద్దతుదారులు ఓటింగ్‌కు దూరంగా ఉండడం వైకాపాకు కలిసొచ్చింది.

ఎంపీటీసీ విజేతల చిత్రాలు https://epaper.eenadu.net లో చూడొచ్ఛు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని