దుగ్గిరాలలో తెదేపాకు ఆధిక్యం
eenadu telugu news
Published : 20/09/2021 05:33 IST

దుగ్గిరాలలో తెదేపాకు ఆధిక్యం

ఈనాడు-అమరావతి

జిల్లాలో ప్రాదేశిక నియోజకవర్గాలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా హవా కొనసాగింది. తెదేపా ఎన్నికలను బహిష్కరించడంతో వైకాపాకు ఎదురే లేకుండా పోయింది. తెదేపా అధిష్ఠానం ఎన్నికలను బహిష్కరించినప్పటికీ దుగ్గిరాల మండలంలో తెదేపా అభ్యర్థులు పోటీలో నిలిచారు. అక్కడ అధికార పార్టీకి దీటైన పోటీ ఇవ్వడంతో పాటు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నారు. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా తెదేపా 9, వైకాపా 8, జనసేన 1 స్థానం గెలుపొందాయి. తెదేపాకు మెజారిటీ స్థానాలు రావడంతో ఎంపీపీ పదవి ఆ పార్టీకి దక్కనుంది. జనసేన మద్దతు కూడా ఇక్కడ కీలకం కానుంది. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలు ఉన్నాయి. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలు మున్సిపాలిటీలో విలీనం చేయడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. దుగ్గిరాల మండలంలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. స్థానికంగా చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా తెదేపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు దీటుగా నిలవడంతో పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడంతో పోరు ఆసక్తికరంగా సాగింది. మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019 సాధారణ ఎన్నికల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచి వైకాపా తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోరు కూడా నువ్వానేనా అన్నట్లు సాగింది. రాష్ట్రంలో తెదేపా ఎన్నికలను బహిష్కరించినా ఇక్కడ తెదేపా పోటీలో ఉండడంతో పోరు రసవత్తరంగా మారింది. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు ఎక్కువ పంచాయతీల్లో విజయం సాధించారు. దీంతో తెదేపా స్థానిక నాయకులు పట్టుదలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పనిచేశారు. స్థానిక అధికార పార్టీ నేతల హవా, వారి నడుమ విబేధాలు ఆపార్టీ అభ్యర్థుల పరాజయానికి కారణమయ్యాయి. తెదేపా స్థానిక నేతల్లో కొందరు పోలింగ్‌కు ముందురోజు పార్టీ ఫిరాయించినప్పటికీ ఆపార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. జిల్లాలో దుగ్గిరాల మండలంలో మాత్రమే తెదేపాకు ఆధిక్యం రావడం, అక్కడి నుంచి గత ఎన్నికల్లో నారాలోకేష్‌ పోటీ చేయడంతో ఆపార్టీ శ్రేణులు ఫలితాలపై ఆసక్తి ప్రదర్శించాయి. గట్టి పోటీ ఇవ్వడం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మిగిలినచోట్ల కూడా పోటీలో ఉన్నట్లయితే మెరుగైన ఫలితాలు వచ్చేవని విశ్లేషణలు చేస్తున్నారు. ఈవిజయం మంగళగిరి తెదేపాలో ఆత్మస్థైర్యాన్ని నింపినట్లయింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని