ఫలితాల తర్వాత బందోబస్తు కొనసాగిస్తాం
eenadu telugu news
Published : 20/09/2021 05:33 IST

ఫలితాల తర్వాత బందోబస్తు కొనసాగిస్తాం

ఈనాడు, అమరావతి
మాట్లాడుతున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

జిల్లాలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ తర్వాత కొన్ని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో కొన్నిరోజుల పాటు బందోబస్తు కొనసాగించాలని నిర్ణయించామని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో ఫలితాల వెల్లడి తర్వాత కూడా రెండు, మూడు రోజుల పాటు ఎస్సైల పర్యవేక్షణలో పోలీసు బృందాలు గ్రామాల్లోనే ఉంటాయని చెప్పారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో రూరల్‌ జిల్లా పోలీసుల పరిధిలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని చెప్పారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన అనంతరం నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల విధానంలో ఏర్పాటు చేసిన భద్రత సత్ఫలితాన్నిచ్చిందన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సుల వద్ద, లెక్కింపు కేంద్రంలో, కేంద్రానికి వంద మీటర్ల దూరంలో మొత్తం మూడంచెల్లో బందోబస్తును నియమించుకుని భద్రతను పర్యవేక్షించినట్లు తెలిపారు. ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అనుసరనీయమని ఉన్నతాధికారుల నుంచి ప్రసంశలు వచ్చాయని చెప్పారు. సమర్థంగా విధులు నిర్వహించడం ద్వారానే సాధ్యమైనంత వరకు గొడవలు, అల్లర్లను నివారించగలమని ఎస్సై నుంచి ఏఎస్పీల దాకా ప్రతి ఒక్కరికీ దిశా నిర్దేశం చేశామని, ఆచరణలో యంత్రాంగం అమలు చేయడం వల్లే జిల్లాలో హింసాత్మక ఘటనలకు తావు లేకుండా పోయిందన్నారు. మున్ముందు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తామని, ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యేవరకు పోలీసు బందోబస్తు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కొనసాగిస్తామని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని