వైకాపాకే జడ్పీ పీఠం
eenadu telugu news
Published : 20/09/2021 05:33 IST

వైకాపాకే జడ్పీ పీఠం

జడ్పీటీసీ స్థానాల్లో జయకేతనం

 ఛైర్‌పర్సన్‌ రేసులో కత్తెర హెన్రీక్రిస్టినా 

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే, జిల్లా పరిషత్తు

గుంటూరు ఆంధ్రాలూథరన్‌ కౌంటింగ్‌ కేంద్రంలో ఫలితాల కోసం వేచిచూస్తున్న అభ్యర్థినులు

జిల్లాలో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అన్ని స్థానాలు ఆ పార్టీ అభ్యర్థులే గెలుచుకోవడంతో జిల్లా పరిషత్‌ పీఠం వారికే దక్కనుంది. చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్షం తరఫున ఒక్క సభ్యుడు కూడా లేకుండా పాలకవర్గం కొలువుదీరనుంది. జిల్లాలో 57 జడ్పీటీసీ స్థానాలు ఉండగా తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఉండడంతో వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. శావల్యాపురం జడ్పీటీసీ తెదేపా అభ్యర్థి పోలింగ్‌కు ముందు మరణించడంతో అక్కడ ఎన్నిక ఆగిపోయింది. 8 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 45 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అన్ని స్థానాల్లో వైకాపా అభ్యర్థులే విజయదుందుభి మోగించారు. మొత్తం 53 మంది వైకాపా అభ్యర్థులు ఎన్నికయ్యారు. ప్రధాన ప్రతిపక్షం తెదేపా పోటీ నుంచి మధ్యలోనే బహిష్కరించడంతో అధికార పార్టీకి కలిసొచ్చింది. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు పోలింగ్‌కు దూరంగా ఉండడం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల వారు పోటీలో ఉన్నా ప్రభావం చూపకపోవడంతో అధికార పార్టీకి ఎదురులేకుండా పోయింది. దీంతో జడ్పీపీఠం సునాయాసంగా వైకాపా కైవసం చేసుకుంది. రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు జిల్లాలో ప్రతిపక్షం తరఫున సభ్యుడు లేకుండా జడ్పీ కొలువుదీరడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

జడ్పీఛైర్‌పర్సన్‌గా క్రిస్టినా!

జిల్లాలో జడ్పీటీసీ స్థానాలన్నీ వైకాపాకు దక్కడంతో ఛైర్‌పర్సన్‌ పదవి ఆ పార్టీ వారికే దక్కనుంది. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ఆ సామాజికవర్గాల నుంచి గెలిచిన అభ్యర్థులు జడ్పీ పీఠం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కొల్లిపర నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి గెలుపొందిన కత్తెర హెన్రీ క్రిస్టినా ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రచారం పొందారు. ఆమె 2014 ఎన్నికల్లో తాడికొండ అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల ముందు వరకు తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆమె స్థానంలో ఉండవల్లి శ్రీదేవికి సీటు ఇవ్వడంతో అవకాశం కోల్పోయారు. దీంతో పార్టీ నుంచి తొలి నుంచి పనిచేసినందున క్రిస్టినాను తొలుత డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌గా నామినేటేడ్‌ పదవిని ఇచ్చింది. అనంతరం పరిషత్‌ ఎన్నికలు రావడంతో ఛైర్‌పర్సన్‌గా అవకాశం ఇస్తామని చెప్పి వైకాపాకు గట్టి పట్టున్న కొల్లిపర నుంచి పోటీ చేయించారు. అక్కడి నుంచి ఆమె 17,616 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దాదాపు ఆమె పేరు ఖరారయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈమె జడ్పీ కిరీటాన్ని అందుకుంటే కొల్లిపర నుంచి జడ్పీ ఛైర్మన్‌గా పదవి పొందిన ద్వితీయ మహిళగా గుర్తింపు పొందుతారు. ఇక్కడి నుంచి 2006లో జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందిన కూచిపూడి విజయ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే ఇద్దరూ స్థానికేతరులు కావడం గమనార్హం. అయితే క్రిస్టినా సంతానం విషయం, ఎస్సీ సామాజిక ధ్రువీకరణ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిగింది. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఇద్దరికి మించి సంతానం ఉన్నట్లయితే పోటీకి వారు అనర్హులు. క్రిస్టినా దంపతులకు నలుగురు సంతానం ఉన్నారని ఫిర్యాదు చేయడంతో విచారణ జరుగుతోంది. ఈ అంశాన్ని పార్టీలోని ఒక వర్గం ప్రస్తావించి తమకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుతోంది. విచారణ కొనసాగుతున్నందున నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మరో వర్గం వారు తమకు జడ్పీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించాలని పార్టీ నేతలను అంతర్గతంగా కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్ష పదవికి ఎవరికి దక్కనుందన్న అంశమై ఆసక్తి నెలకొంది. ఛైర్‌పర్సన్‌ పదవి మహిళ కావడంతో తప్పనిసరిగా పురుషులకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. ఉపాధ్యక్ష పదవికి రిజర్వేషన్‌ లేకపోవడంతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేను కలిసి పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.


24న ఎంపీపీలు.... 25 జడ్పీఛైర్మన్‌ ఎన్నిక

పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌, ఉపాధ్యక్షుల పదవులకు పరోక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటన ఇవ్వనున్నారు. ఈ నెల 24న ఎంపీపీలు, ఉప ఎంపీపీలు, 25న జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌, ఉపాధ్యక్షుల ఎంపిక నిర్వహిస్తారు. ఎంపీటీసీ సభ్యులు వారిలో ఒకరిని ఎంపీపీగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇదేవిధంగా జడ్పీటీసీ సభ్యులు ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. పదవుల కోసం మాత్రం పోటీ నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని