కౌలురైతు బలవన్మరణం
eenadu telugu news
Updated : 20/09/2021 05:56 IST

కౌలురైతు బలవన్మరణం

పట్నంబజారు, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. పాతగుంటూరు పోలీసుల కథనం ప్రకారం..ప్రత్తిపాడుకు చెందిన కాకుమాను శ్రీనివాసరావు(40) రెండేళ్లుగా 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. పత్తి, మిర్చి పంటలను సాగు చేశారు. వ్యవసాయంలో నష్టం రావడంతోపాటు కరోనా కారణంగా పనులు లేక ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. మరోవైపు వ్యవసాయం కోసం బయట వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు ఇటీవల తన బాధను భార్య రజనితో చెప్పుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈనెల 16న శ్రీనివాసరావు గుంటూరు బస్టాండుకు వచ్చి ఆర్థిక సమస్యల కారణంగా తాను గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకొంటున్నానని భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే ఆమె తన తమ్ముడు రామును గుంటూరు బస్టాండు వద్దకు పంపించింది. రాము బస్టాండు వద్దకు చేరుకొని శ్రీనివాసరావును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ శ్రీనివాసరావు ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాత గుంటూరు సీఐ వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

కోదాడ రూరల్‌, న్యూస్‌టుడే: భార్య కాపురానికి రావడంలేదన్న మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరులో ఆదివారం జరిగింది. కోదాడ ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం గోపినేనిపాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ అశోక్‌(40)కు అడ్లూరుకు చెందిన లక్ష్మీతో 13ఏళ్లక్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. మద్యానికి బానిసైన అశోక్‌ ఇంటికివచ్చి భార్యతో గొడవపడుతుండటంతో విసిగిన భార్య లక్ష్మి మూడురోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అడ్లూరుకు వచ్చిన అశోక్‌ తన భార్యను పంపాలని అత్తింటివారితో వారించగా వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురై గ్రామశివారులో ఉన్న మామిడితోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.


ఆటవిడుపుగా వెళ్లి..అసువులు బాసి

గ్రామీణ సత్తెనపల్లి, న్యూస్‌టుడే: బంధువుల పొలంలో మిరప మొక్కలు నాటుతుండగా అక్కడికి వెళ్లిన బాలుడు బావిలో పడి మృతి చెందిన ఘటన సత్తెనపల్లి మండలం భీమవరంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లపు తిన్నారావు, విజయకుమారి దంపతుల కుమారుడు జయమిత్ర (14) సత్తెనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సమీప బంధువు పొలంలో మిరప మొక్కలు నాటుతుండటంతో కొద్దిసేపు వారితో అక్కడే గడిపాడు. మధ్యాహ్నం అందరితో కలిసి భోజనం చేశాడు. తాగునీటి కోసం సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. గంట గడిచినా తిరిగి రాకపోవడంతో బంధువులు వెతకగా బావిలో శవమై కనిపించాడు. మృతదేహాన్ని బయటకు తీసి ఇంటికి తరలించారు. తిన్నారావు దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. చదువులో రాణిస్తున్న కుమారుడు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదుగుతాడని ఆశించామని, ఆకస్మికంగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


కొడుకు విజయం చూడకుండానే తండ్రి మృతి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఉత్కంఠగా సాగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కొడుకు విజయం చూడకుండానే తండ్రి మరణించిన సంఘటన గన్నవరం మండలం కట్టుబడిపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొవ్వలి రాజు కొండపావులూరు ఎంపీటీసీ సిగ్మెంట్‌ నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచి 395 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కౌంటింగ్‌ నేపథ్యంలో ఉదయం 8 గంటల సమయంలో కేంద్రంలోకి అడుగు పెడుతుండగానే తన తండ్రి ఏసుపాదం మరణించినట్లు ఫోన్‌ వచ్చింది. 65 ఏళ్ల వయసు కలిగిన ఏసుపాదం ప్రస్తుతం స్వల్ప అనారోగ్య కారణాలతో బాధపడుతున్నాడు. కొడుకు విజయం సాధించాడన్న వార్తను సాయంత్రానికి తండ్రికి చెప్పాలనుకున్న రాజు.. తన విజయం చూడకుండానే మృతి చెందడంపై కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సంఘటన చూపరులను కంటతడి పెట్టించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని