పోస్టల్‌ బ్యాలెట్‌.. ఒక్కరూ వినియోగించుకోలేదాయె!
eenadu telugu news
Updated : 20/09/2021 10:56 IST

పోస్టల్‌ బ్యాలెట్‌.. ఒక్కరూ వినియోగించుకోలేదాయె!

జిల్లాపరిషత్తు(గుంటూరు), కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘంతో పాటు ఉన్నతాధికారులు, ఉద్యోగులు సాధారణ ప్రజలను చైతన్యపర్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు ఈసీ అవకాశం కల్పించింది. ఆదివారం గుంటూరు ఆంధ్రా లూథరన్‌ బీఈడీ కళాశాలలో మేడికొండూరు జడ్పీటీసీ స్థానానికి సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించేందుకు బాక్సును తెరిచారు. అధికారులు, సిబ్బందితో పాటు అభ్యర్థులను విస్మయానికి గురి చేసేలా ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ లేకపోవడంతో విస్తుపోయారు.

* ఓ ఎంపీటీసీ స్థానం పరిధిలో పోలైన ఓట్లకు బ్యాలెట్‌ బాక్సులు తెరచిన తర్వాత ఒక ఓటు తేడా ఉండడంతో అభ్యర్థులు సిబ్బందిని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా అనుక్షణం పర్యవేక్షణ

జిల్లా పాలనాధికారి వివేక్‌యాదవ్‌ ఆదివారం ఉదయాన్నే పుల్లడిగుంటలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంకు వచ్చారు. జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను కంట్రోల్‌ రూం నుంచి వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూంను జిల్లా ఎన్నికల పరిశీలకులు డాక్టర్‌ లక్ష్మీనరసింహం సందర్శించారు. అనంతరం కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌తో ఏర్పాట్లపై చర్చించారు. కొల్లూరులో బ్యాలెట్‌ పత్రాలు తడిసిపోయాయని ఈటీవీలో ప్రసారమైన కథనంపై యంత్రాంగం అప్రమత్తమై సంబంధిత లెక్కింపు కేంద్రం అధికారులతో చర్చించి సూచనలు చేశారు. జేసీ శ్రీధర్‌రెడ్డి, డీఆర్వో కొండయ్య, జడ్పీ సీఈవో చైతన్య, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌ పర్యవేక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని