సజావుగా ఓట్ల లెక్కింపు
eenadu telugu news
Published : 20/09/2021 05:57 IST

సజావుగా ఓట్ల లెక్కింపు

జిల్లాలో మూడు చోట్ల రీకౌంటింగ్‌
నిబంధనలు మీరి అవనిగడ్డలో విజయోత్సవాలు
ఈనాడు, అమరావతి

కృష్ణా జిల్లాలోని 17 కేంద్రాల్లో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం నుంచి ఆరంభమైంది. ఒకటి రెండు చోట్ల మినహా మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ఆరంభమైంది. చాలాచోట్ల సాయంత్రానికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా అన్ని దారుల్లో అర కి.మీ దూరం నుంచి బారికేడ్లను ఏర్పాటు చేశారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసు అధికారులు పదేపదే సూచించినా ఒకటి రెండు చోట్ల నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియ సజావుగా పూర్తయింది.

తడిసిపోయిన ఓట్లు..

విజయవాడ గ్రామీణ మండలంలోని నిడమానూరు వన్‌ ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన ఓ బ్యాలెట్‌ బాక్సులో ఉన్న ఓట్లన్నీ తడిసిపోయాయి. దీంతో అధికారులు ఆందోళన చెందారు. చివరికి ఆ తడిసిన ఓట్లను జాగ్రత్తగా బయటకు తీసి లెక్కించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.

మళ్లీ లెక్కింపు..

నందిగామ మండలంలోని రామిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి నాగమణి రెండు ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో రీకౌంటింగ్‌ నిర్వహించగా ఒక్క ఓటు ఆధిక్యం కనిపించింది. మళ్లీ మూడోసారి కూడా రీకౌంటింగ్‌ చేయగా ఈసారి మూడు ఓట తేడా కనిపించింది. కృత్తివెన్ను మండలం నిడమర్రు2 ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి పది ఓట్లతో గెలుపొందగా రీకౌంటింగ్‌ చేశారు. మళ్లీ తెదేపా అభ్యర్థే ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బాపులపాడు మండలం ఓగిరాలలో తెదేపా అభ్యర్థి రెండు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రీకౌంటింగ్‌ పెట్టగా వైకాపా అభ్యర్థికి ఒక ఓటు ఆధిక్యం వచ్చింది. దీంతో మూడోసారి మళ్లీ లెక్కించారు. చివరికి తెదేపా అభ్యర్థి సుబ్బారావు రెండు ఓట్ల తేడాతో గెలిచారు.

విజయోత్సవాలు వద్దన్నా..

గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా అధికార పార్టీ శ్రేణులు కొన్నిచోట్ల ఉల్లంఘించాయి. అవనిగడ్డలో వైకాపా శ్రేణులు బాణసంచా కాల్చి, వందల మందితో ప్రదర్శన చేపట్టారు. అనంతరం పార్టీ జెండాలు పట్టుకుని బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మైలవరంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద నుంచి డీజే బాక్సులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం సెయింట్‌జాన్స్‌ పాఠశాలలో నిర్వహించిన కౌంటింగ్‌ గంటకు పైగా ఆలస్యమైంది. ఉదయం 8గంటలకు ప్రారంభించాల్సి ఉండగా ఆలస్యమైంది. మరికొన్నిచోట్ల పోస్టల్‌ బ్యాలెట్లను సమయానికి తెరిచినా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగింది. గొట్టిముక్కల కౌంటింగ్‌ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా ఏజెంట్ల మధ్య వాగ్వాదం. పోలీసులు వచ్చి ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు..

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కొన్ని కేంద్రాల్లో పూర్తిగా చెల్లలేదు. గెజిటెడ్‌ సంతకం చేసిన డిక్లరేషన్‌ జత చేయకపోవడంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లలేదు. ఇబ్రహీంపట్నం నోవా కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో నాలుగు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు రాగా.. దేనికీ డిక్లరేషన్‌ లేకపోవడంతో పక్కన పెట్టేశారు. ముదినేపల్లి మండలంలోనూ మూడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వస్తే.. మూడు చెల్లలేదు. మొవ్వలోనూ 16 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. ఇలాగే మరికొన్ని కేంద్రాల్లోనూ డిక్లరేషన్‌ జత చేయకపోవడంతో వాటిని పక్కన పెట్టేశారు. ఆదివారం ఎండ ఎక్కువగా ఉండడంతో చాలా కౌంటింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. నందిగామలో జరిగిన చందర్లపాడు మండల కౌంటింగ్‌ కేంద్రంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. కౌంటింగ్‌ కేంద్రంలో ఉక్కపోత, చీకటిగా ఉండడంతో ఏజెంట్లు, సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. చివరికి జనరేటర్‌ ఏర్పాటు చేశారు.

కేంద్రాల వద్ద కొవిడ్‌ పరీక్షలు..

ఎన్నికల కౌంటింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందికి కేంద్రాల వద్ద కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. దీనికోసం వైద్యారోగ్యశాఖ సిబ్బంది అన్ని కేంద్రాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బంది వాక్సినేషన్‌ చేసుకున్న, కొవిడ్‌ పరీక్షకు సంబంధించిన పత్రాలను చూపించాకే లోపలికి అనుమతించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని