ముందు జాగ్రత్తే.. మందు
eenadu telugu news
Published : 20/09/2021 05:57 IST

ముందు జాగ్రత్తే.. మందు

వర్షాకాలంలోనే విష జ్వరాల భయం అధికం
డెంగీ బారినపడకుండా అప్రమత్తత అవసరం
ఈనాడు, అమరావతి

ర్షాకాలం వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంటుంది. కానీ.. సీజనల్‌ విషజ్వరాల భయం అధికంగా ఉంటుంది. గతంలో జ్వరమొచ్చినా మందులు వేసుకుంటే తగ్గిపోతుందిలే అనే భానవ ఉండేది.. కానీ.. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో జ్వరం వస్తే ముందుగా కొవిడ్‌ నిర్థరణ పరీక్ష చేయాల్సి వస్తోంది. ఆ తర్వాతే డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందస్తుగానే అప్రమత్తంగా ఉండి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విషజ్వరాల బారినపడకుండా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చల్లని పదార్ధాలకు దూరంగా..

వర్షాకాలంలో చల్లగా ఉండే ఆహార పదార్థాలు, పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ప్రధానంగా బయట హోటళ్లు, రోడ్డు పక్కన ఉండే బండ్ల దగ్గర దొరికే ఆహారం వీలైనంత వరకు తినకుండా ఉండడం మంచిది. ఒకవేళ తినాల్సి వచ్చినా వేడిగా ఉన్నదే తీసుకోవాలి. చల్లగా ఉండి, ఎటువంటి మూతలు లేకుండా ఉంచే ఆహారపదార్థాలన్నింటికీ దూరంగా ఉండాలి. పానీయాలు, పండ్ల రసాలు తాగేటప్పుడు ఐస్‌ వేసుకోకూడదు.

ఇంటి చుట్టూ ఓ కన్నేయండి..

చాలామంది ఇళ్లలో ఉండే పాత్రల్లో నీటిని నిలువ ఉంచేస్తుంటారు. ఇలా ఓ వారం పది రోజులు ఉండిపోతే..చాలు వాటిలో దోమలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే.. ఇంటిలోపల, బయట, చుట్టుపక్కల ఎక్కడా పాత్రలు, పాతటైర్లు, కొబ్బరి బొండాలు లాంటి వాటిలో నీరునిలువ ఉండకుండా చూడాలి. పాడైపోయినా ఏసీలు, కూలర్లు కూడా చాలామంది ఇంటి పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో పడేసి ఉంచేస్తుంటారు. అవికూడా దోమల ఆవాసాలుగా మారుతుంటాయి. అందుకే.. వర్షాకాలంలో రెండు రోజులకు ఒకసారైనా.. ఇంటి పరిసరాలన్నింటినీ పరిశీలిస్తూ.. నీటిని పారబోస్తూ ఉండాలి.

ఆహారం విషయంలో అప్రమత్తం..

ఆహారం వీలైనంత వరకు ఇంటి దగ్గరే తినాలి. అదికూడా వేడి వేడిగా తినడానికి ప్రయత్నం చేయాలి. ఫ్రిడ్జ్‌లలో దాచి ఉంచిన ఆహారం ఈ సీజన్‌లో తినకపోవడమే మంచిది. ఈ సీజన్‌లో వేడి వేడిగా పకోడీ, మిరపకాయ బజ్జీలు, సమోసాలు తినాలనిపిస్తుంది. చాలామంది రోడ్డు పక్కన దొరికే బండ్ల దగ్గర తినేస్తూ ఉంటారు. అందుకే ఈ సీజన్‌లో అత్యధిక మంది కలుషిత ఆహార సమస్య బారినపడి.. కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు లాంటి వాటితో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వర్షాకాలంలో వేడి వేడిగా ఉండే.. పోషకాహారాన్ని మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఏ జ్వరమో నిర్ధరించాలి..

ప్రస్తుతం డెంగీ, కొవిడ్‌ లక్షణాలు ఒకేరకంగా ఉంటుండడంతో.. వైద్యం అందించే విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులుచెబుతున్నారు. తాజాగా విజయవాడకు చెందిన ఓ మహిళ ఇలాగే ఒక జ్వరం వస్తే.. మరోదానికి మందులు వాడి ప్రమాదం బారినపడ్డారు. శరీరంలో ఉండే రక్తాన్ని చిక్కబరిచే లక్షణం కొవిడ్‌కు ఉంది. అందుకే కొవిడ్‌ బారినపడే వారు రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతుంటారు. డెంగీ బారినపడితే శరీరంలోని రక్తం బాగా పలుచబడిపోతుంది. అందుకే.. రక్తం చిక్కబరిచే మందులు వాడాలి.

దోమ తెరలు, మెష్‌లు తప్పనిసరి..

వర్షాకాలంలో దోమల బారినపడకుండా ఉండేందుకు అవసరమైన తెరలు, మెష్‌లు తప్పనిసరిగా వినియోగించాలి. దోమల నిరోధక క్రీములు, స్ప్రేలను వినియోగించాలి. ప్రధానంగా నిద్రించే మంచాల కింది భాగంలో, ఇంటిలోని కిటికీలు, తలుపులకు ఉండే కర్టెన్లు, పాత దుస్తులు ఉంచే ప్రాంతాల్లో దోమల నివారణ స్ప్రేలు కొడుతుండాలి. పిల్లల్ని ఒకవేళ బయటకు పంపించినా.. చేతులు, కాళ్లు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేయాలి. వారికి ఇచ్చే ఆహారం విషయంలోనూ నిర్లక్ష్యం వద్ధు చివరికి ఉదయం బ్రష్‌ చేసేటప్పుడు కూడా గోరు వెచ్చని నీటితోనే చేయించాలి. తెల్లవారుజామున, సాయంత్రం తర్వాత ఇంటి తలుపులు తెరిచి ఉంచకూడదు.

వర్షంలో అస్సలు తడవొద్ధు.

ఎంత అత్యవసరమైన పని ఉన్నా వర్షం పడుతున్నప్పుడు తడుస్తూ బయటకు వెళ్లొద్ధు ఒకవేళ తడిచినా వెంటనే తుడుచుకుని, వేడినీటితో స్నానం చేయడం మంచిది. పిల్లలను వర్షంలో తడవకుండా చూడాలి. నిలువ ఉండే వర్షం నీటిలో పిల్లలు ఎక్కువగా ఆడుతుంటారు. ఇలాంటి సమయంలోనే వారు విషజ్వరాల బారినపడేందుకు అవకాశం ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని