వైకాపా జయకేతనం
eenadu telugu news
Published : 20/09/2021 05:57 IST

వైకాపా జయకేతనం

40 జడ్పీటీసీలు, 43 ఎంపీపీలు కైవసం
568 ఎంపీటీసీ స్థానాల్లో విజయం
మోపిదేవి, చల్లపల్లిలో తెదేపా సత్తా
ఈనాడు, అమరావతి

జిల్లాలో ఊహించినట్లే పరిషత్తు ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా మారాయి. జిల్లాలో అధికార పక్షం వైకాపా క్లీన్‌ స్వీప్‌ సాధించింది. ఎన్నికలు జరిగిన 41 స్థానాలకు 40 స్థానాలను వైకాపా కైవసం చేసుకుంది. మోపిదేవి స్థానం తెదేపా దక్కించుకుంది. అక్కడ తెదేపా నుంచి మల్లిఖార్జునరావు గెలుపొందారు. జిల్లాలో అన్ని మండలాలను సైతం అధికార పక్షం సొంతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థులే ఆధిక్యం సాధించడంతో ఎంపీపీలను దక్కించుకోనున్నారు. జిల్లా పరిషత్తులో ప్రతిపక్షం లేకుండా పోయింది. జడ్పీ చరిత్రలో ఇదే తొలిసారి. ఇది ఓ రికార్డుగా చెబుతున్నారు. ప్రాదేశిక ఎన్నికలను ప్రతిపక్ష పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీలో అసంతృప్తితో పాటు.. బలవంతపు ఏకగ్రీవాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాల్గొనబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేసినా ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఎన్నికలు ఏకపక్షంగానే సాగాయి. జిల్లాలో 63.99 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రతిపక్షం ఎన్నికల్లో పాల్గొని ఉంటే ఈ పోలింగ్‌ శాతం కనీసం 85శాతం దాటేదని అధికారుల విశ్లేషణ. అంచనా వేసినట్లే జిల్లా క్లీన్‌స్వీప్‌ అయింది. జడ్పీటీసీలతో పాటు, ఎంపీపీలను వైకాపా సొంతం చేసుకోబోతోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తెదేపా అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు. పలు ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నారు. ఆరు స్థానాల్లో 10లోపు ఓట్లతో తెదేపా అభ్యర్ధులు విజయం సాధించారు. కేవలం అంకెలతో గెలిచిన స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు పదేపదే రీకౌంటింగ్‌ డిమాండ్‌ చేయడం విశేషం. కొన్ని చోట్ల రెండు సార్లు.. మరికొన్ని చోట్ల మూడుసార్లు రీకౌంటింగ్‌ చేశారు. అయినప్పటికి ఆయా స్థానాల్లో తెదేపా విజయం సాధించింది. అన్ని మండలాల్లోనూ వైకాపా తిరుగులేని ఆధిపత్యం సాధించడం విశేషం. డీజేలు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహించారు. ప్రాదేశిక ఎన్నికలు జరిగిన 12 నియోజకవర్గాల్లో అధికారపార్టీదే పూర్తి ఆధిపత్యం కావడం విశేషం. జిల్లాలో జనసేన, భాజపా, బీఎస్‌పీ కూడా బోణీ కొట్టాయి. 648 స్థానాలకు గాను 568 వైకాపా, తెదేపా 63, భాజపా 01, సీపీఐ 01, జనసేన 09, బీఎస్‌పీ 02, ఇతరులు 04 స్థానాలను దక్కించుకున్నారు.

* చల్లపల్లి మండల పరిషత్‌లో తెదేపా 8 స్థానాలతో ఆధిక్యం సాధించింది. వైకాపాకు ఇక్కడ 7 స్థానాలు వచ్చాయి.

ఎంపీపీల కోసం పోటీ..!

జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లోనూ మండల పరిషత్తు అధ్యక్షుల పదవులను వైకాపా దిక్కంచుకోనేలా ఆధిక్యం సాధించాయి.49 మండలాల్లో మూడు వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆగిపోగా మరోమూడు ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో 43 మండలాలకు అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది. జిల్లా పరిషత్తు అధ్యక్ష పదవికి ఉప్పాల హారిక పేరు దాదాపు ఖరారైనట్లే. గుడ్లవల్లేరు నుంచి 12వేల ఓట్ల ఆధిక్యంతో ఆమెను మంత్రి కొడాలి నాని గెలిపించడం విశేషం. మండల పరిషత్తు అధ్యక్ష పదవులకు పోటీ ఏర్పడింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జుల ఆధ్వర్యంలో ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. జనరల్‌, జనరల్‌ మహిళ రిజర్వు స్థానాలకు పోటీ నెలకొంది. రిజర్వు పదవులకు ముందే పేర్లు ఖరారయ్యాయి. ఎన్నికల్లో ఖర్చు భరించిన వారికి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నట్లు వైకాపా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని