పకడ్బందీగా బందోబస్తు
eenadu telugu news
Published : 20/09/2021 05:57 IST

పకడ్బందీగా బందోబస్తు


పెడన లెక్కింపు కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

మచిలీపట్నం క్రైం, గూడూరు, న్యూస్‌టుడే: జిల్లాలో మండల, జిల్లా పరిషత్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశాల మేరకు ముందస్తుగా గుర్తించిన సమస్యాత్మక, అంత్యంత సమస్యాత్మక ప్రాంతాలో అవసరం మేరకు పోలీస్‌ పికెట్‌లు ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా దూరంగా ఉన్నట్టు ప్రకటించడం, వ్యక్తిగతంగా పట్టున్న ప్రాంతాల్లోనే కొందరు బరిలో నిలబడటంతో సహజంగా స్థానిక ఎన్నికల లెక్కింపు సమయంలో ఉండే సందడి కనిపించలేదు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అన్ని కేంద్రాల వద్ద పోలీస్‌ అధికారులు తగు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ స్వయంగా పెడనలోని లెక్కింపు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి నుంచి జిల్లాలోని ఇతర లెక్కింపు కేంద్రాల వద్ద పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. లెక్కింపు పూర్తయ్యాక ఎటువంటి ఊరేగింపులకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియకు సంబంధించినంత వరకూ అధికారికంగా ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఊరేగింపుల విషయంలో నిషేధాజ్ఞలున్నా కొన్ని మండలాల పరిధిలో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు చేసుకున్నారు. మైలవరంతో పాటు మరికొన్ని మండల పరిధిలో ఊరేగింపు నిర్వహించాలని చూడగా పోలీసులు అడ్డుకుని నివారించారు.

సమస్యాత్మక గ్రామాల సందర్శన

గూడూరు మండల పరిధిలో సమస్యాత్మకమైన పోసినవారిపాలెం గ్రామాన్ని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ సందర్శించారు. గ్రామంలోని రచ్చబండ వద్ద గ్రామపెద్దలు, గ్రామస్థులతో సమావేశమై గ్రామంలోని పరిస్థితులపై ఆరా తీశారు. గెలుపు ఓటములు సహజమని వాటిని ఆసరా చేసుకుని అనవసరపు వివాదాలకు ఆస్కారం కల్పిస్తే అందరూ ఇబ్బందులు కొనితెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రజలు అందరూ పోలీస్‌శాఖకు సహకరించాలన్నారు. గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏవైనా ఇబ్బందులుంటే తామే పరిష్కరించుకుంటామని, ఎటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా సహకరిస్తామని గ్రామస్థులు ఎస్పీకి మాట ఇచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని