మాట నిలబెట్టుకునేలా..?
eenadu telugu news
Published : 21/09/2021 02:55 IST

మాట నిలబెట్టుకునేలా..?

ఎంపీపీ అభ్యర్థుల్లో పోటా పోటీ

సామాజిక వర్గ సమీకరణాలతో సతమతం

గన్నవరంలో రెండున్నరేళ్లు సూత్రం

ఈనాడు, అమరావతి

జిల్లాలో ఏకపక్షంగా సాగిన ప్రాదేశిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైకాపాలో అంతర్గత పోరు ప్రారంభమైంది. పదవుల కోసం లాబీయింగ్‌ ప్రారంభమైంది. సామాజిక వర్గాల సమీకరణాలపై తర్జన భర్జనలు పడుతున్నారు. గతంలోనే ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు ఇప్పుడు నెరవేరతాయా లేదా అనే అనుమానంతో ఆశావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా తిరుగులేని ఆధిపత్యం సాధించిన విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఎన్నికలను బహిష్కరించడంతో గెలుపు ఏకపక్షంగానే సాగింది. జిల్లాలో 41 జడ్పీటీసీలకు గాను 40 వైకాపా దక్కించుకుంది. ఒకటి తెదేపా సాధించుకుంది. 43 ఎంపీపీలలో 41 ఎంపీపీలు వైకాపాకే దక్కే అవకాశం ఉంది. రెండు మండలాల్లో తెదేపాకు ఆధిక్యం వచ్చింది. మోపిదేవి, చల్లపల్లిలో తెదేపా అభ్యర్థులు ఎంపీపీని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల నాటికి సమీకరణాలు మారకుంటే తెదేపాకు ఈ రెండు మండలాల ఎంపీపీలు దక్కనున్నాయి. మిగిలిన వాటిలో వైకాపా ఆధిపత్యం ఉంది. అయితే ఆశావాదులు ఎక్కువ కావడం, పార్టీ నిర్ణయాల ప్రకారం అభ్యర్థుల ఎంపిక క్లిష్టతరంగా మారింది. వర్గపోరులు కూడా ఉన్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేదే తుది నిర్ణయం అయినా గత సర్పంచి ఎన్నికల్లో కొన్నిచోట్ల చెల్లుబాటు కాలేదు. దీంతో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కొన్ని చోట్ల వైకాపా నేతలే రెండున్నరేళ్లు పదవులు పంచుకోవాలనే ప్రతిపాదనలతో ఉన్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఎంపీపీలుగా ఎన్నిక చేయవద్దని వైకాపా నిర్ణయం తీసుకున్నట్లు కార్యకర్తల్లో ప్రచారం జరగడంతో ఆశావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎంపీటీసీల సమావేశం ఈనెల 24న జరగనుంది. ప్రత్యేక సమావేశానికి నోటిఫికేషన్‌ జారీ అయింది. అదే రోజు పరోక్ష పద్ధతిలో ఎంపీపీ, ఉపాధ్యక్షులను ఎన్నుకొంటారు. అయితే ఉపాధ్యక్షులుగా ఒక్కరే ఉంటారా.. లేక మున్సిపల్‌ ఎన్నికల తరహాలో ఇద్దరిని నియమిస్తారా అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం అయితే ఉపాధ్యక్షులు ఒక్కరే ఉంటారు. ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఎన్నిక జరుగుతుంది. చేతులు ఎత్తే పద్ధతిలోనే బహిరంగంగా జరుగుతుంది. దీనికి సన్నాహాలు చేస్తున్నారు.

* అవనిగడ్డ నియోజకవర్గంలో చల్లపల్లి మండలంలో తెదేపాకు 8 స్థానాలు, వైకాపాకు 7 స్థానాలు వచ్చాయి. ఇక్కడ తెదేపా విజయం సాధించనుంది. మోపిదేవి మండలంలో తెదేపాకు 6, వైకాపాకు 3, జనసేనకు ఒకటి వచ్చింది. దీన్ని తెదేపా దక్కించుకోనుంది. జిల్లాలో రెండు స్థానాల్లో తెదేపా ఎంపీపీలు ఎన్నిక కానున్నారు. ఈ నియోజకవర్గంలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరులలో ముందుగానే ఎమ్మెల్యే నిర్ణయం ప్రకారం ఎంపీపీలను ఎన్నుకోనున్నారు. ఇక్కడ పోటీ కనిపించడం లేదు.

* జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలుకు గాంధీని ఎంపిక చేశారు. వత్సవాయికి అక్కడి సొసైటీ అధ్యక్షుడుగా ఉన్న వెంటకేశ్వర్లును ఎంపీపీగా ఎన్నుకోనున్నారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కావడం విశేషం. నందిగామ నియోజకవర్గంలో నందిగామ ఎంపీపీకి ఇద్దరు పోటీపడుతున్నారు. అరిగెల సుందరమ్మ, రమాదేవి ఆశిస్తున్నారు. చందర్లపాడుకు ఇద్దరు పోటీ పడుతున్నారు. నాగమల్లేశ్వరి, వేల్పుల ఈసమ్మలు రంగంలో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు కీలకంగా వ్యవహరించనున్నారు. కంచికచర్లకు బషీర్‌ను ఎంపిక చేశారు. వీరులపాడుకు జనరల్‌ మహిళ రిజర్వేషన్‌కు లక్ష్మిని ఎంపిక చేశారు.

* మైలవరం నియోజకవర్గంలో జనరల్‌ మహిళకు కేటాయించిన రెడ్డిగూడెం ఎంపీపీ విషయంలో పోటీ ఉంది. రెండు సామాజిక వర్గాలకు చెందినవారు తమకు కావాలంటే.. తమకు కావాలని పోటీ పడుతున్నారు. మిగిలిన ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం పోటీ లేకుండానే ముందుగానే ఎమ్మెల్యే ప్రకటించినట్లు తెలిసింది.

* పామర్రులో కూడా రసకందాయంలో పడింది. తోట్లవల్లూరు జనరల్‌ రిజర్వు కాగా.. ఆశావాదిగా ఉన్న రాజేందర్‌ ఓడిపోయారు. దీంతో రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారు తమకే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచుతున్నారు. పామర్రులోనూ ఇద్దరు ఆశావాదులు ఉండగా ఒకరు ఓటమి చెందడంతో రెండో వ్యక్తికి ఖరారైనట్లేనని భావిస్తున్నారు. జనరల్‌ రిజర్వు అయిన పెదపారుపూడిలో బీసీకి ఇవ్వాలని, పమిడిముక్కలలో బీసీ మహిళకు ఇవ్వాలని నిర్నయించారు. మొవ్వలో ఎస్సీ మహిళ ఒక్కరే ఉండడంతో ఆమెకు ఖరారు కానుంది.

* కైకలూరు నియోజకవర్గంలోనూ విచిత్ర పరిస్థితి ఉంది. పార్టీ నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలా వద్దా అనేది ఇప్పుడు సమస్యగా మారింది. మండవల్లి, కలిదిండి, ముదినేపల్లిలో ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వారని ఎంపీపీగా ముందుగానే ప్రకటించుకున్నారు. దీంతో ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేయించుకున్నారు. ఖర్చు చేశారు. ప్రస్తుతం పార్టీ నిర్ణయం వేరుగా ఉండడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈనెల 23నే ఎంపీపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

* గన్నవరం నియోజకవర్గంలో కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఎంపికయ్యేవారు రెండున్నరేళ్లు అధికారంలో ఉంటారు. తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే వంశీమోహన్‌ ప్రతిపాదన మేరకు అంగీకరించినట్లు చెబుతున్నారు. విజయవాడ గ్రామీణం మండలానికి ఈ సారి గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ ఎంపీపీ కావాలని ప్రతిపాదించారు. గతంలో మైలవరం నియోజకవర్గానికి చెందినవారు ఉన్నారు. ప్రసాదంపాడుకు చెందిన ప్రసన్నలక్ష్మికి మొదట అవకాశం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైలవరం ఎమ్మెల్యేతో సంప్రదించి నిర్ణయించినట్లు చెబుతున్నారు. బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాల్లో ప్రస్తుతం రెండున్నరేళ్లకే పదవికి ఎంపిక చేశారు. తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వనున్నారు.

* తిరువూరు నియోజకవర్గంలో కొంత అస్పష్టత ఉంది. గతంలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రకటించిన అభ్యర్థిని కాకుండా సీల్డు కవర్‌లో పేరు వచ్చింది. దీంతో ఈ సారి ఆయన ప్రకటించిన వారికి దక్కుతుందా లేదా అనే అనుమానం అనుచరుల్లో ఉంది. విస్సన్నపేటలో మాత్రం తిరుపతిరావు, మల్లయ్యలు పోటీ పడుతున్నారు. మిగిలిన వాటికి సీల్డు కవర్‌లో పేరు మారితే ఎలా అనే సందేహం కలుగుతోంది. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలకు పోటీ ఏర్పడింది. కంకిపాడులో రెండు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు ఆశిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముందుగా ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం మరో సామాజిక వర్గానికి ఇవ్వాలనే డిమాండ్‌ వస్తోంది. బిందు మాధవి, రాజ్యలక్ష్మిలు రేసులో ఉన్నారు. ఉయ్యూరులో జనరల్‌ మహిళ రిజర్వు కాగా.. ఎమ్మెల్యే మాత్రం దీనిలో ఎస్సీ మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని