ఆ బైక్‌లే కొంప ముంచుతున్నయ్‌!
eenadu telugu news
Published : 21/09/2021 02:55 IST

ఆ బైక్‌లే కొంప ముంచుతున్నయ్‌!

ట్రాఫిక్‌ రద్దీలోనూ ప్రాణాలతో చెలగాటం

‘250 నుంచి 350 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాల వినియోగం విజయవాడ నగరంలో బాగా పెరిగింది. యువత ఎక్కువగా ఈ హైస్పీడ్‌ బైక్‌లపై దూసుకెళ్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీలోనూ వీరి గోల చాలా ఎక్కువైపోతోంది. రేసు గుర్రాల్లా వాహనాల మధ్యలో నుంచి అత్యంత వేగంగా దూసుకెళ్తున్నారు. విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో 30-40 కి.మీ వేగం దాటి వెళ్లకూడదనే నిబంధన ఉన్నా వీరికి పట్టడం లేదు. వీరు దూసుకెళ్లడమే కాకుండా పక్కనున్న వాహనదారులు ప్రమాదాల బారినపడేలా చేస్తున్నారు. పెద్దగా శబ్దం చేసే హారన్లను బిగిస్తున్నారు. వెనుక నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చి దగ్గరికి రాగానే.. పెద్ద శబ్దంతో హారన్‌ కొట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వెనుక ఏదో పెద్ద వాహనం వస్తోందనే ఆందోళనతో కొంత మంది పక్కకు తప్పుకునే క్రమంలో పడిపోతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి.’

ఈనాడు, అమరావతి

విజయవాడలోని బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్‌టీఎస్‌, జాతీయ రహదారిపై.. బెంజిసర్కిల్‌ నుంచి రామరప్పాడు వరకు, కొత్తగా కట్టిన కనకదుర్గ వంతెన, బెంజిసర్కిల్‌ వంతెన ఇలాంటి విశాలమైన రహదారులపై అదుపులేని వేగంతో దూసుకెళుతున్న ఆకతాయిలు పెరిగిపోతున్నారు. జిల్లాలో 250 సీసీ కంటే అధికంగా సీసీ పవర్‌ ఉన్న ద్విచక్ర వాహనాలు 1.5లక్షలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా విజయవాడ నగరంలోనే ఉన్నాయి. వీటికితోడు బుల్లెట్‌ వాహనాలు సైతం మరో 18వేలకు పైగా ఉన్నాయి. ఇవన్నీ 350 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్నవే. అత్యంత రద్దీగా ఉండే.. బెంజిసర్కిల్‌ నుంచి కానూరు వరకు ఉన్న రహదారిపైనా వీళ్లు దూసుకెళ్తున్నారు. కళాశాలల్లో చదివే యువత కూడా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. వీరికి వేగం తప్ప తోటి ప్రయాణికులతో సంబంధం ఉండదు. చివరికి తమ ప్రాణానికి లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తూ దూకుడుగా వెళ్తున్నారు. అత్యంత వేగంగా పరుగులు తీసే ద్విచక్ర వాహనాలను విక్రయించే షోరూంలు విజయవాడలో గత నాలుగైదేళ్లలో విపరీతంగా పెరిగిపోయాయి. రూ.2 లక్షల నుంచి రూ.15లక్షల విలువైన ద్విచక్ర వాహనాలను విక్రయించే షోరూంలు వచ్చేశాయి. ధర పెరుగుతున్న కొద్దీ వేగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేలా.. సీసీ పవర్‌ పెరుగుతూ వెళుతోంది. ఈ వాహనాలను కొనుగోలు చేసే యువత వాటిని పట్టుకుని నగర రహదారులపైకి వస్తున్నారు. కానీ ఎప్పుడు రద్దీగా ఉండే రహదారులపై వీటికి తగ్గ వేగంతో వెళ్లడం కుదరదు. అందుకే వాటికి తగ్గ వేగంతో ఎలాగైనా దూసుకెళ్లాలని.. ట్రాఫిక్‌ రద్దీలోనూ వాహనాలను తప్పించుకుంటూ హారన్‌ పెద్దగా మోగిస్తూ దూసుకెళుతున్నారు.

వీరి వల్ల ప్రమాదాలు జరిగినా..

రహదారులపై అత్యంత వేగంగా హారన్‌ మోగిస్తూ వెళ్లే ఇలాంటి వారి వల్ల పక్కనుండే ద్విచక్రవాహనదారులు కూడా ప్రమాదాల బారినపడుతున్నారు. బుల్లెట్లపై దూసుకెళ్లేవారు వాహనదారులను ఢీకొట్టి ఏ సంబంధం లేనట్టు వెళ్లిపోతున్నారు. విజయవాడలోని బందరు, ఏలూరు రోడ్లపై ఓ గంట సమయం గమనిస్తే చాలు.. ఇలా వేగంగా దూసుకెళ్లే ఆకతాయిలు చాలా మందే దొరకుతారు. ఇలాంటి వాళ్లు చాలా తెలివిగా ట్రాఫిక్‌ సిగ్నళ్ల దగ్గరకు వచ్చేసరికి సీసీ కెమెరాల కంట్లో పడకుండా ఉండేందుకు నెమ్మదిగా వెళుతున్నారు. ఆ తర్వాత మాత్రం దూసుకెళ్లిపోతున్నారు.

తల్లిదండ్రులదే తప్పు..

ప్రస్తుతం ఈ స్పీడ్‌ బైక్‌లను పదిహేడేళ్ల లోపుండే మైనర్లు కూడా తీసుకుని రోడ్లపైకి వచ్చేస్తున్నారు. కాలనీల్లో ఉండే రోడ్లపైనా చాలా వేగంగా దూసుకెళుతున్నారు. వీరికి అడిగిన వెంటనే ఇలాంటి వాహనాలను కొనిచ్చే తల్లిదండ్రులదే అసలు తప్ఫు ఆ బండికి ఉన్న వేగాన్ని పరీక్షించడం కోసం తాము ప్రమాదంలో పడడమే కాకుండా, ఇతరులకూ ముప్పు వాటిల్లేలా చేస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న చాలా ప్రమాదాల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటున్నారు. కొంత మంది కనీసం లైసెన్స్‌ కూడా లేకుండా వాహనాలను తీసుకుని రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో తల్లిదండ్రులు ముందుగానే స్పందించి జాగ్రత్తలు చేపట్టకపోతే తర్వాత జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి తప్పదు.

మరణాల్లో ఎక్కువ ఇవే..

విజయవాడ నగరంలోనే ఏటా 250 నుంచి 300 మధ్యలో తీవ్రమైన ప్రమాదాలు జరుగుతుండగా.. కనీసం 250 మందికి పైగా మరణిస్తున్నారు. వీరిలో ద్విచక్ర వాహనదారులే అత్యధికంగా ఉంటున్నారు. ప్రాణాలకు ప్రమాదం లేకపోయినా.. తీవ్రంగా గాయపడేంత స్థాయిలో ప్రమాదాలు కూడా మరో వెయ్యికి పైగా ఏటా జరుగుతున్నాయి. పెద్దసంఖ్యలోనే గాయపడే వారుంటున్నారు. ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ సంఖ్యలో అత్యధిక సీసీ సామర్థ్యం ఉన్నవే ఉంటున్నాయి. 2018లో విజయవాడ నగరంలో 1494 ప్రమాదాలు జరిగితే 365 మంది చనిపోయారు. మరో 1472 మంది గాయపడ్డారు. 2019లో 1371 ప్రమాదాలు జరగ్గా 357 మంది మృత్యువాతపడ్డారు. 1384 మంది గాయపడ్డారు. 2020లో 967 ప్రమాదాలు జరిగాయి. 264 మంది మరణించగా, 948 మంది గాయపడ్డారు. 2020లో కొవిడ్‌ ప్రభావం, లాక్‌డౌన్‌ వంటి కారణాల వల్ల రహదారులపై జరిగే ప్రమాదాలు, మరణాలు అంతకుముందు ఏడాది కంటే కొద్దిగా తగ్గాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని