మొరాయించిన సర్వర్‌
eenadu telugu news
Published : 21/09/2021 02:55 IST

మొరాయించిన సర్వర్‌

ఉచిత బియ్యం కోసం పేదల అవస్థ

గుడివాడ, న్యూస్‌టుడే: కేంద్రం ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాన్‌ యోజన (పీఎంజీకేవై) కింద రేషన్‌ దుకాణాల ద్వారా ఇస్తున్న ఉచిత బియ్యం కోసం పేదలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఈ బియ్యం పంపిణీ మూడు రోజులపాటు ఆలస్యం కాగా ప్రారంభమైన రెండో రోజే సర్వర్‌ పని చేయక జిల్లా వ్యాప్తంగా బియ్యం పంపిణీ నత్తనడకన సాగింది. చాలా చోట్ల రెండెంకల సంఖ్యలో లబ్ధిదారులకు కూడా దుకాణదారులు అందజేయలేకపోయారు. ఉచిత బియ్యం కోసం సోమవారం పేదలు 2, 3 సార్లు రేషన్‌దుకాణాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయినా చాలా మంది ఉత్తి చేతులతోనే నిరాశగా వెనుదిరిగారు. నిన్నటి దాకా సంచార వాహనాల ద్వారా ఇస్తున్న రూ.1 బియ్యానికి మాత్రం ఇలాంటి సర్వర్‌ సమస్య రాకపోవడం గమనార్హం.

జిల్లాలో ఇంతవరకూ ఇచ్చింది 15 శాతమే

కరోనా నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడుతున్నారని భావించి కేంద్రం పీఎంజీకేవై ద్వారా ఉచిత రేషన్‌ను అందిస్తోంది. మనిషికి 5 కిలోలు వంతున పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 1-15 వరకూ సంచార వాహనాల ద్వారా నగదుకు రేషన్‌ బియ్యాన్ని, 16 నుంచి నెలాఖరు వరకూ ఉచిత బియ్యాన్ని అందిస్తున్నారు. అయితే ఈ నెల ఉచిత బియ్యాన్ని 19న చేపట్టారు. బియ్యం దుకాణాలకు చేరినా ఈపోస్‌ యంత్రాలకు మెసేజ్‌ లాగిన్‌ కాలేదు. దీంతో డీలర్లు 19 నుంచి పంపిణీ చేపట్టారు. విచిత్రంగా ఈ నెల 18న గుడివాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఈ ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం గమనార్హం.

* జిల్లాలో కేవలం 13 లక్షల కార్డుదారులకుగానూ 2 లక్షల మందికే పంపిణీ చేశారు

* మచిలీపట్నం డివిజన్‌లో 12 మండలాల్లోని 2,40,154 మంది కార్డుదారుల్లో 32,815 మందికి(13.66 శాతం) అందజేశారు.

* నూజివీడు డివిజన్‌లోని 14 మండలాల్లోని 3,06,596 మంది కార్డుదారుల్లో 45,554 మందికి(14.86 శాతం) అందజేశారు

* గుడివాడ డివిజన్‌లోని 9 మండలాల్లోని 1,78,035 మంది కార్డుదారుల్లో 24,500 మందికి(13.76 శాతం) పంపిణీ చేశారు.

* విజయవాడ డివిజన్‌లోని 16 మండలాల్లోని 5,87,343 మంది కార్డుదారుల్లో 1,02,126 మందికి(17.39 శాతం) అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని