సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Updated : 21/09/2021 04:01 IST

సంక్షిప్త వార్తలు

కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధంపై ఫిర్యాదు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఓ కానిస్టేబుల్‌ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను చంపుతానని బెదిరిస్తున్నాడని అతని బారినుంచి రక్షించాలని ఓ బాధితుడు సోమవారం అర్బన్‌ ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. కాకానికి చెందిన అతనికి రెండేళ్ల కిందట వివాహమయ్యింది. ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల తల్లిదండ్రులతో ఇంట్లో గొడవ జరగడంతో వారు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుస్టేషన్‌కు పిలిపించిన ఓ కానిస్టేబుల్‌ అతన్ని వదిలిపెడతానని జామిన్‌ ఇవ్వటానికి అతని భార్యను స్టేషన్‌కు పిలిపించాలని ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. అనంతరం ఆమెకు ఫోన్‌ చేసి మాయమాటలు చెప్ఫి. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని అని సదరు వ్యక్తి కోరారు.


చోదకులకు చలానాల విధింపు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: కర్ఫ్యూ ఆంక్షలు, 144 సెక్షన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న నలుగురిపై విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు. సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుతూ కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన 1,650 మంది వాహన చోదకులకు చలానాలు వేశారు. వారికి రూ.4,86,495 జరిమానా విధించి, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మాస్క్‌లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న 128 మందిపై కేసులు నమోదు చేసి రూ.15,360లు జరిమానా విధించారు. మద్యం తాగుతూ పట్టుబడిన అయిదుగురిపై కేసులు నమోదు చేశారు.


‘కార్మిక సమస్యలు విస్మరించిన ప్రభుత్వం’

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని ఏపీ బిల్డింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సోమవారం నగరంలోని ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న క్లైయిమ్‌లను పరిష్కరించాలని, క్లైయిమ్‌లను ఆపివేస్తూ ఇచ్చిన జీవో నెం:1214ను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ద్వారానే పథకాలు అమలు చేయాలని కోరారు. ఇతర పథకాలకు మళ్లించిన నిధులను తిరిగి బోర్డు ఖాతాలో జమచేయాలని, క్వారీలన్నింటినీ తెరిచి, ఇసుకను ఉచితంగా సరఫరా చేసి కార్మికులకు పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కార్మికులను విస్మరిస్తే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తమకు న్యాయం చేయాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు, గవర్నమెంట్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ శివకుమార్‌, నగర ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్‌.డి.ప్రసాద్‌, సీఐటీయూ పశ్చిమ కృష్ణా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.వెంకటేశ్వరరావు, ఎన్‌.సి.హెచ్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


‘ఒప్పంద కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి’

అలంకార్‌కూడలి (విజయవాడ), న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా ఏపీ ట్రాన్స్‌కో, ఆత్మకూరు, వింజమూరు, కేవీ చందర్లపాడు సబ్‌-స్టేషన్‌ల పరిధిలో 26మంది ఒప్పంద కార్మికులను తొలగించారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సోమవారం నగరంలోని ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ట్రాన్స్‌కో విద్యుత్‌ సబ్‌-స్టేషన్‌లలో పని చేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. దీనిపై పలు మార్లు విద్యుత్తు శాఖా మంత్రికి, ఉన్నతాధికారులకు విన్నవించినట్లు చెప్పారు. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని, కార్మికులకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించినప్పటికీ.. అమలు కాలేదన్నారు. కాలయాపన చేయడం తగదన్నారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ జేఏసీ ఛైర్మన్‌ ఎ.వి.నాగేశ్వరరావు, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డి.సూరిబాబు, పబ్లిక్‌ సెక్టార్‌ కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.నూర్‌బాషా తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.


‘దారిద్య్ర రేఖకు దిగువనున్న క్రీడాకారుల సమాచారమివ్వండి’

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా నుంచి రాష్ట్ర క్రీడా జట్లకు ప్రాతినిధ్యం వహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించి, దారిద్య్ర రేఖకు దిగువనున్న క్రీడాకారుల సమాచారాన్ని అందించాలని డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి, అర్హతగల క్రీడాకారులు తమ వివరాలతో పాటు తెల్ల రేషన్‌కార్డు కాపీని జతచేసి స్థానిక ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలోగల జిల్లా క్రీడాప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) కార్యాలయంలో ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు వ్యక్తిగతంగా గానీ మెయిల్‌ dsak-rishna1-@gma-il.-com కు పంపాలన్నారు. మరిన్ని ఇతర వివరాలకు ఫోన్‌ 91211 06836 నంబరుపై సంప్రదించాలని ఆయన కోరారు.


24న కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక

కృష్ణలంక, న్యూస్‌డుడే: ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ఆదేశాల మేరకు మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కో-ఆప్టెడ్‌ మెంబర్ల ఎన్నిక ప్రత్యేక సమావేశాలు ఈనెల 24న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మండల పరిషత్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు కలెక్టర్‌ జె.నివాస్‌ సూచించారు. ఆరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మండల ప్రజాపరిషత్‌ సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. ఉదయం 10 గంటల్లోపు సంబంధిత వ్యక్తులు తమ నామినేషన్‌ పత్రాలను అభ్యర్థి లేదా ఆయన ప్రతిపాదించిన వ్యక్తి ప్రిసైడింగ్‌ అధికారులకు అందించాల్సి ఉంటుంది. అదేరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నామినేషన్‌ పత్రాల పరిశీలన చేపడతారు. చెల్లుబాటు అయ్యే నామినేషన్‌ పత్రాలకు సంబంధించిన వ్యక్తుల పేర్లను మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీపీ కార్యాలయ నోటీస్‌ బోర్డులో ప్రచురించడం జరుగుతుంది. కో-ఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నికల నుంచి ఎవరైనా అభ్యర్థి ఉపసంహరించుకుంటున్న సందర్భంలో ఆమేరకు ఒక నోటీసును అభ్యర్థి లేదా ఆయన ప్రతిపాదించిన వ్యక్తి ఎంపీపీ కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంట లోపు ప్రిసైడింగ్‌ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. మండల ప్రజాపరిషత్‌ సభ్యుల ప్రత్యేక సమావేశం ప్రమాణ స్వీకారం, కో-ఆప్టెడ్‌ ఎన్నికల నిర్వహణ మధ్యాహ్నం ఒంటి గంటకు జరుగుతుంది. అనంతరం వెంటనే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. అలాగే మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు.


సహకార సంఘాల బలోపేతానికి కృషి

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: సహకార సంఘాల బలోపేతానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. బ్యాంకు మహాజన సభను మచిలీపట్నంలోని రెవెన్యూ అసోసియేషన్‌ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. జీఎం చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన సభలో సభ్యులు నల్లమోతు కోటి సూర్యప్రకాశరావు, కొమ్మినేని రవిశంకర్‌, వేములకొండ రాంబాబు, భూక్యారాణి, గడిదేశి పెదవెంకయ్య, పడమట సుజాత, బ్యాంకు సీిఈవో శ్యామ్‌మనోహర్‌, జిల్లా సహకార అధికారి రవికుమార్‌ తదితరులు ప్రసంగించారు.


మహిళా పోలీసు పరీక్ష కేంద్రాల పరిశీలన

గంగూరు (పెనమలూరు), న్యూస్‌టుడే : ఈ నెల 22, 23 తేదీల్లో మహిళా పోలీస్‌ ప్రొబెషన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గంగూరు ధనేకుల ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదుల్లో చేయాల్సిన ఏర్పాట్లపై కళాశాల ప్రిన్సిపల్‌ కడియాల రవి, పోలీస్‌ అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెనమలూరు మండలంతో పాటు నగరం నుంచి దాదాపు 500 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకావాల్సి ఉందన్నారు. రెండ్రోజుల పాటు ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. డీసీపీ మేరి ప్రశాంతి, ఏసీపీ రమేష్‌బాబు, సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు విక్రమ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


క్రీడాభివృద్ధికి సహకరించండి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర క్రీడా యువజన సర్వీసుల శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర క్రీడల, యువజన సర్వీసుల శాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వీడియా కాన్ఫెరెన్స్‌లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖపట్నం నుంచి పాల్గొన్నారని శాప్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. నగరంలోని శాప్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ క్రీడాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ రజిత్‌ భార్గవ్‌.. రాష్ట్రంలో క్రీడా కార్యకలాపాలు క్లుప్తంగా వివరిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అట్టడుగు క్రీడాకారుల నుంచి సీనియర్‌ క్రీడాకారుల వరకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. శాప్‌ సహాయ సంచాలకురాలు (సాంకేతిక) ఎస్‌వీ రమణ, క్రీడాధికారి జూన్‌ గాల్యోట్‌, ఇతర శాప్‌ సిబ్బంది సమావేశానికి హాజరు కాగా.. శాప్‌ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి కర్నూలు నుంచి సమావేశానికి హాజరయ్యారని పేర్కొన్నారు.


జూనియర్‌ సహాయకులు దరఖాస్తు చేసుకోండి

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్‌ సహాయకులుగా పని చేస్తున్న వారిలో అర్హులైనవారిని సహాయ గణాంకాధికారిగా నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు విజయగౌరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబరు 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.


27న విద్యార్థి వైద్యులకు కౌన్సెలింగ్‌

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: గుంటూరు వైద్య కళాశాలలో సీనియర్‌ రెసిడెంట్లుగా నియమించేందుకు ఈ నెల 27న కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేస్తూ ప్రిన్సిపల్‌ పద్మావతిదేవి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపికైన వారు ఏడాది పాటు సీనియర్‌ రెసిడెంటుగా పనిచేయాల్సి ఉంటుంది. అర్హులైన వారు ఈ నెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు gunturmedicalcollege.edu.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.


ఉద్యోగుల తొలగింపులో నిబంధనల అమలు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: సర్వజనాసుపత్రిలో ఒప్పంద విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల తొలగింపులో అధికారులు నిబంధనలు పాటించారని జేసీ రాజకుమారి తెలిపారు. జీజీహెచ్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి హాజరైన రాజకుమారిని పలువురు కలిసి తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని విన్నవించారు. అనంతరం జేసీ రాజకుమారి వారితో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తూ సూపరింటెండెంట్‌ ఆదేశాలిచ్చారని తెలిపారు. కేంద్ర ఔషధ భాండాగారం నుంచి అవసరమైన ఔషధాలు సకాలంలో ఆసుపత్రికి వచ్చేలా చూడాలన్నారు. ప్రసూతి విభాగంలో అదనంగా పది పడకలు ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు వైద్యుల నియామకానికి సరైన ప్రతిపాదనలతో దస్త్రాన్ని పంపించాల్సిందిగా కోరారు. ప్రయోగశాలల్లో అవసరమైన రసాయనాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌లు వినియోగంలోకి తేవాలన్నారు. నిలిచిపోయిన సర్వీస్‌బ్లాక్‌ పనులు ప్రారంభించేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. జేసీతో పాటు సూపరింటెండెంట్‌ ప్రభావతి, సీఎస్‌ఆర్‌ఎంవో సతీష్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.


బాపట్లలో 76 మి.మీ వర్షపాతం

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 11.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్ల మండలంలో 76, పిడుగురాళ్ల 52.4, కారంపూడి 49.4, దుర్గి 46.8, బెల్లంకొండ 42.4, చుండూరు 42.2 మి.మీ వర్షం కురిసింది. కొల్లిపర 25.8, సత్తెనపల్లి 24.2, క్రోసూరు 23.8, రెంటచింతల 23, గురజాల 21.2, మాచర్ల 21, నకరికల్లు 19.4, వెల్దుర్తి 18.2, పెదకూరపాడు 17.6, దాచేపల్లి 17.2, మాచవరం 14.8, తెనాలి 12.4, నిజాంపట్నం 11.6, మంగళగిరి 9, కొల్లూరు 8.2, అచ్చంపేట 4, ముప్పాళ్ల 3.6, రొంపిచర్ల 2, బొల్లాపల్లి 1.4, వేమూరు 1.4, మేడికొండూరు 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.


వచ్చే ఎన్నికల్లో జగన్‌కు పరాజయం తప్పదు: జీవీ

పట్టాభిపురం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించామని జబ్బలు చరచుకోవడం వైకాపా నేతలకే చెల్లిందని నరసరావుపేట పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘స్థానిక ఎన్నికల్లో వైకాపా ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా అపహాస్యం చేసింది. తెదేపా అభ్యర్థులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. అందుకే నామినేషన్ల తర్వాత తెదేపా ఎన్నికలను బహిష్కరించింది. ప్రజలు అసహ్యించుకుంటున్నా గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి రెండేళ్లకు ముందే పీకే బృందం వస్తోందని చెబుతున్నారు. మంత్రివర్గ సమావేశంలో ప్రజల సమస్యలు, రాష్ట్రాభివృద్ధి గురించి చర్చించకుండా రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి జగన్‌ తాపత్రయపడుతున్నారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకే ప్రజలు తప్పు చేశామని బాధపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పటికే మార్పు వచ్చింది. పోలీసులు కూడా మనసు చంపుకుని వైకాపా నేతలు చెప్పింది చేస్తున్నామని వాపోతున్నారు. అన్ని వర్గాల వారిని దగా చేసినందుకు వచ్చే ఎన్నికల తర్వాత జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ ఖాళీ చేసి లోటస్‌పాండ్‌కో, బెంగళూరుకో వెళ్లక తప్పదు’.. అని వ్యాఖ్యానించారు.


అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్‌ అభినందనలు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా కృషి చేసిన జేసీలు, జిల్లా అధికారులు, కౌంటింగ్‌ కేంద్రాల పర్యవేక్షకులు, ఓట్ల లెక్కింపు సూపర్‌వైజర్లు, లెక్కింపు సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులను సమన్వయం చేసుకుంటూ పటిష్ఠ బందోబస్తు చేపట్టిన అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు ఆరీఫ్‌ హఫీజ్‌, విశాల్‌ గున్నీలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. యంత్రాంగానికి సహకరించిన పోటీలోని వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు, కౌంటింగ్‌ ఏజెంట్లకు కలెక్టర్‌ ధన్యవాదాలు తెలిపారు.


పట్టణ పీహెచ్‌సీలకు పోస్టుల మంజూరు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: గుంటూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని ఇతర మున్సిపల్‌ పట్టణాల్లో ఏర్పాటు చేసిన 84 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ రాష్ట్ర నోడల్‌ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 137 మంది స్టాఫ్‌ నర్సులు, 47 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 69 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు 71 పోస్టులను కేటాయించారు. వీటిని జిల్లా పాలనాధికారి అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ భర్తీ చేయాలని సూచించారు. స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల పోస్టులను ఒప్పంద విధానంలో, మిగిలిన వాటిని ఔట్‌సోర్సు విధానంలో నియమించాలని కోరారు. వెంటనే ఉద్యోగ ప్రకటన విడుదల చేసి ఎంపికైన వారికి నియామకపత్రాలను అక్టోబరు 11న జారీ చేయాలని గడువు విధించారు.


ఇంటర్‌ పరీక్షలకు 0.41 శాతం హాజరు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సోమవారం భౌతికశాస్త్రం, ఆర్థికశాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు ద్వితీయ ఏడాదిలో 50,603 మంది విద్యార్థులకుగాను 0.41 శాతంతో 207 మంది విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు ఆర్‌ఐవో జెడ్‌.ఎస్‌.రామచంద్రరావు తెలిపారు. మొదటి ఏడాది 46,858 మంది విద్యార్థులకు 69.9 శాతంతో 33,422 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.


‘రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం’

ఉయ్యూరు, న్యూస్‌టుడే: రైతులు, కార్మికుల ఉసురుపోసుకుంటూ, కార్పొరేట్‌ వ్యవస్థకు పట్టం కడుతున్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యల్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక శ్రీ శ్రీనివాస విద్యాసంస్థ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగించారు. ఈ నెల 27న రైతులకు మద్దతుగా జరుగుతున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, చెరకు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఉమావరప్రసాద్‌, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, జిల్లా కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి హరిబాబు, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు అజాద్‌ తదితరులు ప్రసంగించారు.


జీవో 217 రద్దుకు డిమాండ్‌

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బ తీసేలా ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం.217ను తక్షణం రద్దు చేయాలని మత్స్యకార జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. జేఏసీ ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ ధర్నాచౌక్‌లో వివిధ పక్షాల జేఏసీ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, జనసేన నాయకుడు బండిరామకృష్ణ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సైకం భాస్కరరావు, సంఘ నాయకులు లంకె నారాయణప్రసాద్‌, లకనం నాగాంజనేయులు తదితరులు మాట్లాడారు.


ఈసీ అనుమతి లేకుండా అతిథి అధ్యాపకులను ఎలా చేర్చుకుంటారు?

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసీ సమావేశానికి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర పాల్గొన్నారు. ఎఫ్‌ఏసీ వీసీ ఆచార్య రాజశేఖర్‌ అవినీతిపై ఇటీవల ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ తుది నివేదికను ఉన్నత విద్యామండలికి సమర్పించింది. దీనిపై చర్చించినట్లు తెలిసింది. కీలకాంశాలను మళ్లీ పరిశీలిద్దామని చెప్పినట్లు తెలిసింది. విశ్వవిద్యాలయంలో ఈసీ అనుమతి లేకుండా అతిథి అధ్యాపకులను ఎలా చేర్చుకుంటారనే అంశాన్ని సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది.


సిబ్బందికి విశ్రాంతి కల్పించాలని వినతి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జేసీ జి.రాజకుమారికి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. వారంలో రెండు రోజులు మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, మరో రెండు రోజులు వ్యాక్సినేషన్‌ జరపాలని కోరారు. ఆదివారం సిబ్బందికి విశ్రాంతి కల్పించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.వి.రామిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరావు, కార్యవకర్గ సభ్యులు వెంకటరెడ్డి, సతీష్‌కుమార్‌, జానీబాషా, ఎం.ఎన్‌.మూర్తి, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని