ఆన్‌లైన్‌లో భూమాయ నిజమే
eenadu telugu news
Published : 21/09/2021 03:17 IST

ఆన్‌లైన్‌లో భూమాయ నిజమే

జిల్లా కలెక్టర్‌కు తహసీల్దారు ప్రాథమిక నివేదిక

‘ఈనాడు’ కథనంతో కదిలిన యంత్రాంగం

ఈనాడు, గుంటూరు

మాచవరం మండలంలో ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ ఆన్‌లైన్‌లో అక్రమాలకు పాల్పడిన వైనంపై తహసీల్దారు ప్రాథమిక విచారణ చేసి అక్రమాలు వాస్తవమేనని జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపారు. రెవెన్యూ రికార్డుల్లో అక్రమాలపై ఆధారాలతో సహా ‘ఆన్‌లైన్‌లో భూమాయ’ శీర్షికన ఈనెల 14న ‘ఈనాడు’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తహసీల్దారు కథనంలో వచ్చిన వివరాల ఆధారంగా ఆయా గ్రామరెవెన్యూ అధికారుల నుంచి వివరాలు తీసుకుని నివేదిక పంపారు. కథనంలో వచ్చిన అంశాలు వాస్తవమేనని, తమకు తెలియకుండా వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేశారని, ఇందులో తమ ప్రమేయం లేదని, అక్రమంగా నమోదైనట్లు గ్రామరెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు. ఈమేరకు తహసీల్దారు నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపారు. సర్వేనంబర్ల వారీగా ప్రభుత్వ భూములు, చుక్కల భూములు, సొసైటీ భూములన్నీ ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదయ్యాయని, వాటిని అక్రమంగా ప్రైవేటు వ్యకులకు కట్టబెట్టినట్లు తేలింది. ఈమేరకు మోర్జంపాడు, ఆకురాజుపల్లి, వేమవరం, తాడుట్ల, పిల్లుట్లకు చెందిన గ్రామ రెవెన్యూ అధికారులు పరిశీలనలో గుర్తించారు. ఆయా సర్వేనంబర్ల వివరాలు ఆర్‌ఎస్‌ఆర్‌, వెబ్‌ల్యాండ్‌లో పరిశీలిస్తే అక్రమాలు బహిర్గతమయ్యాయి. వెబ్‌ల్యాండ్‌లో నమోదైన అనుభవదారులు గతంలో ఎలాంటి దరఖాస్తులు చేసుకోలేదని, గ్రామ రెవెన్యూ అధికారులకు తెలియకుండా నమోదు చేసుకున్నారని తహసీల్దారు కలెక్టర్‌కు పంపిన నివేదికలో వివరించారు. ఇవన్నీ కూడా గతంలో ఇక్కడ కార్యాలయంలో పని చేసిన రెవెన్యూ అధికారి ఆన్‌లైన్‌లో అక్రమంగా నమోదుచేసుకున్నారని ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు నివేదిక పంపారు. అక్రమంగా పేర్లు నమోదు చేసుకున్న అనుభవదారులను పూర్తిస్థాయిలో విచారించి తదుపరి చర్యలకు సమగ్ర నివేదికను పంపుతామని నివేదికలో పేర్కొన్నారు.

గ్రామ రెవెన్యూ అధికారులు గుర్తించిన అంశాలివే.. : మాచవరం మండలం ఆకురాజుపల్లి గ్రామంలో సర్వేనంబరు 464/15-1లో పూర్తి విస్తీర్ణం 60.70 ఎకరాలు పట్టాభూమి ఉండగా అందులో మార్కంపూడి భాగ్యమ్మ పేరుతో 4.88 ఎకరాలు, చౌకల ఏడుకొండలు పేరుతో 4.34 ఎకరాలు తప్పుగా నమోదయ్యాయని, వెబ్‌ల్యాండ్‌లో డిజిటల్‌ సిగ్నేచర్‌ పెండింగ్‌లో ఉందని, ఆయా వ్యక్తులను విచారించి ఆన్‌లైన్‌ నందు పేర్లు తొలగించాల్సిందిగా గ్రామరెవెన్యూ అధికారి తహశీల్దారుకు ఇచ్చిన వివరణలో కోరారు.

* పిల్లుట్ల గ్రామంలో సర్వేనంబర్లు 864-2డీ, 336-బీ1, 524-3, 625-బీ, 896/ఏ, 1255/18-38లో చుక్కల భూమి ఉండగా ప్రైవేటు వ్యక్తుల పేర్లు నమోదయ్యాయని వారి వివరాలు, ఆర్‌ఎస్‌ఆర్‌లో భూమి స్వభావం వివరాలు నివేదికలో పొందుపరిచారు.

* తాడుట్ల గ్రామంలో పట్టాభూమి, సొసైటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఖాతానంబర్లు, సర్వేనంబర్లు, అనుభవదారులు, ఆర్‌ఎస్‌ఆర్‌లో భూమి స్వభావం వివరాలను పొందుపరిచి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు.

* వేమవరం గ్రామంలో సర్వేనంబరు 404-30లో చుక్కల భూమి 3.12 ఎకరాలు ఉండగా ఖాతానంబర్లు 799, 3577 ద్వారా ఇద్దరు వ్యక్తుల పేర్లు అక్రమంగా నమోదు చేసినట్లు గుర్తించారు. ఈ విషయాలను వివరంగా నివేదికలో సంబంధిత దస్త్రాలతో పొందుపరిచారు. తమ ప్రమేయం లేకుండా వెబ్‌ల్యాండ్‌లో మార్పులు జరిగాయని ఆయా గ్రామ రెవెన్యూ అధికారులు తహశీల్దారుకు ఇచ్చిన వివరణలో తెలియజేశారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సరెండర్‌ : మాచవరం తహసీల్దారు కార్యాలయంలో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కె.అన్వేష్‌ను గురజాల ఆర్డీవో కార్యాలయానికి తహశీల్దారు సరెండర్‌ చేశారు. ‘ఆన్‌లైన్‌లో భూమాయ’ శీర్షికన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దస్త్రాలు లేకుండా వెబ్‌ల్యాండ్‌, అడంగల్‌లో ప్రభుత్వ భూముల సర్వే నంబర్లలో అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల పేర్లు నమోదుచేయడంలో అన్వేష్‌ పాత్ర ఉందని గుర్తించి ఆర్డీవో కార్యాలయానికి సరెండర్‌ చేశారు. ఆన్‌లైన్‌లో అక్రమాలకు పాల్పడిన అధికారులు తమను రక్షించాలని స్థానిక నేతలతో కలిసి ముఖ్యనేత వద్దకు వెళ్లారు. రెవెన్యూ రికార్డుల్లో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడి రూ.లక్షలు ఆర్జించిన ఉద్యోగి ఒకరు ఎలాగైనా అక్రమాల గండం నుంచి గట్టెక్కించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని