తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో రాజకీయం
eenadu telugu news
Published : 21/09/2021 03:17 IST

తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో రాజకీయం

గుంటూరులో వైకాపాకార్పొరేటర్ల హడావుడి

ఈనాడు, అమరావతి

పాఠశాల తల్లిదండ్రుల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికల్లోనూ రాజకీయం రంగప్రవేశం చేసింది. అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ప్రధానోపాద్యాయులను తాము సూచించిన వారినే కమిటీ ఛైర్మన్లుగా, సభ్యులుగా ఎన్నికయ్యేలా సహకరించాలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గుంటూరు మున్సిపల్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యా సంస్థలు సుమారు 150 దాకా ఉన్నాయి. పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులు ఈ కమిటీల ఆధ్వర్యంలోనే నిర్వహించడం, వాటికి రూ.లక్షల్లో నిధులు మంజూరు కావడం వంటివి కొందరు కార్పొరేటర్లు తెలుసుకుని స్కూళ్లపైనా ఆధిపత్యం చెలాయించడానికి సన్నద్ధమవుతున్నారు. మరోవైపు నగరపాలక ఉన్నతాధికారులు కార్పొరేటర్లను కలిసి తల్లిదండ్రుల ఎన్నికకు సంబంధించిన ఓటర్ల జాబితాను వారికి అందజేయాలని, వారు కూడా కోఆప్షన్‌ సభ్యులేనని ఏకంగా డిప్యూటీ కమిషనర్‌-2 పేరుతో ఆదేశాలు ఇప్పించడం చూసి హెచ్‌ఎంలు ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై అవసరమైతే నగరపాలక అధికారులపై ఎస్‌పీడీ, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని, ఇప్పటికైనా వారిచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సంఘాల నేతలు హెచ్చరించారు. కొరదరు కార్పొరేటర్లు వచ్చి మాట్లాడుతున్నారని, పలానా వారిని తరగతుల వారీగా సభ్యులుగా నిలబెట్టి ఎంపిక చేయాలని కోరుతున్నారని నగర హెచ్‌ఎం ఒకరు తెలిపారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన మరో కార్పొరేటర్‌ ఒకరు తనకు తెలియకుండా ఎన్నిక నిర్వహించరాదని, తానే సభ్యుల పేర్లు చెబుతానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడు, పొన్నూరు, నరసరావుపేట వంటిచోట్ల కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు వచ్చి ఓటర్ల జాబితాలు అడిగి పట్టుకుపోతున్నారని చెబుతున్నారు. ఈ నెల 22న బుధవారం పోలింగ్‌ జరగనుంది. ఆ రోజున ఏదైనా ఎన్నిక వాయిదా వేయాల్సి వస్తే కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలని తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 3560 పాఠశాలల్లో ఓటర్ల జాబితాను ఈ నెల 16న ప్రదర్శించారు. రెండేళ్ల కాల పరిమితికి జరిగే ఎన్నికలకు జిల్లా సమగ్రశిక్ష అభియాన్‌, జిల్లా విద్యాశాఖ యంత్రాంగం సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి పాఠశాలలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? వారి వివరాలతో కూడిన జాబితాను పాఠశాలతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ ప్రదర్శించారు. ఇప్పటికే అభ్యంతరాల స్వీకరణ ముగిసింది.. 22న పోలింగ్‌ జరుగుతుంది. చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా ఎన్నికలు జరుపుతారు. ప్రతి తరగతికి ముగ్గురేసి సభ్యుల చొప్పున గరిష్ఠంగా 23 మంది సభ్యులను ఎంపిక చేస్తారు. మరో ఐదుగురు కోఆప్షన్‌ సభ్యులను నియమిస్తారు. కోఆప్షన్‌ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఈనెల 15 వరకు స్కూల్‌ అడ్మిషన్‌ రిజిస్టర్‌ లేదా ఛైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదైన ప్రతి ఒక్క విద్యార్థి తల్లీదండ్రి లేదా సంరక్షకుడికి ఒకరికే ఓటు హక్కు కల్పించాలని తాజాగా ఎస్‌పీడీ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఉద్యోగులైన తల్లిదండ్రులు కూడా పాల్గొనవచ్చని సూచించారు. సభ్యుల్లో ఒకరిని కమిటీ ఛైర్మన్‌గా, వైస్‌ఛైర్మన్లుగా సభ్యులు ఎన్నుకోవడం ద్వారా పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఏర్పాటవుతుంది. ఎన్నికైన నాటి నుంచి రెండేళ్ల వరకు పదవిలో కొనసాగుతారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని