పట్టించుకునేవారేరీ?
eenadu telugu news
Published : 21/09/2021 03:50 IST

పట్టించుకునేవారేరీ?

నియంత్రికల చోరీలపై చర్యలు శూన్యం

పునరుద్ధరణలో సీపీడీసీఎల్‌ తీవ్ర జాప్యం

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే


మల్లవల్లిలో ఎండిపోతున్న ఆయిల్‌పామ్‌ తోట

కృష్ణా, గుంటూరు జిల్లాలో విద్యుత్తు సరఫరా నిర్వహణ, పర్యవేక్షణ చేసే సీపీడీసీఎల్‌ పరిధిలో వ్యవసాయ బోర్లకు సంబంధించిన నియంత్రికలు చోరీకి గురైతే రైతుల పరిస్థితి క్షేత్ర స్థాయిలో దయనీయంగా ఉంటోంది. ఆరుగాలం శ్రమించి సేద్యం చేసే అన్నదాతలు, పంట పొలాలకు నీరందించేందుకు మెట్ట ప్రాంతాల్లో పూర్తిగా బోర్లపై ఆధారపడతారు. వీటికి విద్యుత్తు సరఫరా చేసే నియంత్రికలు చోరీకి గురికావడం కొన్నేళ్లుగా పరిపాటిగా మారింది. రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే కొత్త నియంత్రికలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంటోంది.

ఏర్పాటు ఇలా..: గతంలో రెండు, మూడు బోర్లకు కలిపి ఒకచోట నియంత్రిక ఏర్పాటు చేసేవారు. హెచ్‌వీడీఎస్‌ సిస్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి బోరుకు, మోటారు సామర్థ్యం ప్రాతిపదికగా ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

బాపులపాడుకు చెందిన శ్రీనివాసరావు అనే రైతు వ్యవసాయ బోరుకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన 16 కె.వి. నియంత్రికను ఏడు నెలల కిందట దుండగులు అపహరించుకుపోయారు. అప్పట్నుంచి ఆయన పంట పొలాలకు నీరు లేకుండా పోయింది.

రాత్రి వేళ రైతుల కాపలా.. : ఏడాది కాలంగా కృష్ణా జిల్లాలో నూజివీడు, ముసునూరు, బాపులపాడు, ఆగిరిపల్లి, ఉంగుటూరు మండలాల పరిధిలో నియంత్రికల చోరీలు విపరీతంగా చోటుచేసుకున్నాయి. బాపులపాడు మండలం మల్లవల్లి, నూజివీడు మండలం మీర్జాపురం గ్రామాల్లో ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో చోరీలు జరగడంతో రైతులంతా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, రాత్రి వేళ పొలాల్లో గస్తీ కాసే పరిస్థితి ఉత్పన్నమైంది.

అమలుకాని నిబంధన..: విద్యుత్తు వినియోగదారుడు ఎలాంటి బకాయిలు లేకుండా ఉంటే, అతనికి అవసరమైన సరఫరాను అందించాల్సిన బాధ్యత పంపిణీ సంస్థలపై ఉంది. కానీ వ్యవసాయ విద్యుత్తు విషయంలో ఈ నిబంధన సక్రమంగా అమలు కావడం లేదు. చోరీకి గురైన నియంత్రికల స్థానే కొత్తవి ఏర్పాటు చేసే విషయంలో నెలకొంటున్న జాప్యమే ఇందుకు ఉదాహరణ. నియంత్రిక పోయిన విషయంపై పోలీసు స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలోనే ఒకట్రెండు నెలలు ఆలస్యమవుతోంది. కేసు నమోదు చేస్తే రికవరీ చూపాల్సి వస్తుందనే కారణంతో పోలీసులు ఈ కేసులు నమోదు చేయడం లేదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైతేనే రైతుకు కొత్త నియంత్రిక మంజూరు చేయాలనే నిబంధన దృష్ట్యా వారాల తరబడి పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఆ తర్వాత నియంత్రిక ఏర్పాటు కోసం ఏఈ, ఏడీఈ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనివార్యమైపోయింది.


ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ అవడంతో ఖాళీగా కన్పిస్తున్న దిమ్మె

మల్లవల్లికు చెందిన ప్రసాద్‌కు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ తోట ఉంది. దీనికి నీటి వసతి కల్పించే బోరుకు విద్యుత్తు సరఫరా అయ్యేలా అమర్చిన 25 కె.వి. నియంత్రికను గతేడాది అక్టోబరులో దొంగలు ధ్వంసం చేసి, రాగి తీగ చోరీ చేశారు. దీనిస్థానే కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అతీగతీ లేదు.

పంటల సంగతేంటి?: నియంత్రికలు పోతే, కొత్తవి ఏర్పాటు చేయడానికి ఎంత కాలం పడుతుంది, పంట పరిస్థితి ఏమిటి అన్న విషయం ఎవరికీ పట్టడం లేదు. అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలకు ఆగమేఘాల మీద నియంత్రికలు ఏర్పాటు చేసే విద్యుత్తు పంపిణీ సంస్థలు.. వ్యవసాయ బోర్ల విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ శివప్రసాదరెడ్డి వద్ద ప్రస్తావించగా.. నిబంధనల ప్రకారం నియంత్రికలను పునరుద్ధరిస్తున్నామన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు, సాంకేతిక అనుమతుల మంజూరు వంటి ప్రక్రియను అనుసరించే ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. విద్యుత్తు చట్టంలోని సెక్షన్‌ 136 ప్రకారం రైతులే నియంత్రికల భద్రత చూడాల్సి ఉందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని