సీఎం పాలనకు ప్రజలు ఏకపక్ష తీర్పు
eenadu telugu news
Published : 21/09/2021 03:50 IST

సీఎం పాలనకు ప్రజలు ఏకపక్ష తీర్పు

కుప్పంలో ప్రజలు చంద్రబాబును పక్కన పెట్టారు

రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు


మాట్లాడుతున్న ఎంపీ వెంకటరమణరావు

నగరంపాలెం (గుంటూరు), న్యూస్‌టుడే: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి జగన్‌ పాలనకు ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. గుంటూరులోని అర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసేందుకు అప్పటి ఎన్నికల కమిషన్‌, చంద్రబాబు కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వారంతా బొక్కబోర్లా పడ్డారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు బహిష్కరించామని చెప్తున్న తెదేపా నాయకులు బీఫారాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కె.ఎ.పాల్‌ పార్టీ కంటే చంద్రబాబు పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా మారిందన్నారు. ముఖ్యంగా తెదేపా అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయన్ను పక్కన పెట్టి వైకాపాకు పట్టం కట్టారన్నారు. దుగ్గిరాలలో ఎందుకు సరైన ఫలితాలు రాలేదో సమీక్షించుకుంటామని, అందుకు కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసి, బహిష్కరించామని చెప్పడం తెదేపాకే చెల్లుతుందన్నారు. చంద్రబాబు అండ్‌కో చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని వివరించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ తెదేపా మునిగిపోయే నావ అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని విమర్శించారు. సమావేశంలో ఎమ్యెల్యేలు మద్దాళి గిరిధర్‌, ముస్తఫా, మేయర్‌ మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌ బాలవజ్రబాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని