‘స్పందన’ అర్జీలు 244
eenadu telugu news
Published : 21/09/2021 03:50 IST

‘స్పందన’ అర్జీలు 244


విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ప్రదర్శన చేస్తున్న జీజీహెచ్‌ పొరుగు సేవల సిబ్బంది

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నూరుశాతం పరిష్కరించాలని జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జేసీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ అర్జీలను నిర్దేశించిన సమయంలోనే పరిష్కరించాలని సూచించారు. సోమవారం 244 అర్జీలు స్పందన కార్యక్రమంలో వచ్చినట్లు తెలిపారు. అనంతరం జేసీలు జి.రాజకుమారి, అనుపమ అంజలి, కె.శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో పి.కొండయ్య, ప్రత్యేక కలెక్టర్‌ వినాయకం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు.

అర్జీ రాయాలా.. రూ.100 ఇచ్చుకో

స్పందన కార్యక్రమంలో అధికారులకు అర్జీ అందించేందుకు వచ్చేవారు కొందరు చదువురాక అక్కడున్న వారిని రాయమని కోరితే రూ.వంద వసూలు చేస్తున్నారని వాపోయారు. గతంలో కలెక్టరేట్‌ లోపల ఇలా రాసేవారిని అధికారులు హెచ్చరించి పంపించివేశారు. ఇప్పుడు శంకరన్‌ హాలులో ‘స్పందన’ కార్యక్రమానికి బయట వైపు కొందరు కుర్చీలు వేసుకుని అర్జీలు రాస్తూ రూ.వంద వసూలు చేస్తున్నారు. సోమవారం పలువురు స్పందన అర్జీ రసీదు పొందే సమయంలో సిబ్బంది దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారు.


కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

పెండింగ్‌ బకాయిలను తక్షణమే చెల్లించాలి

ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పనిచేస్తున్న ఫ్రంట్‌ డెస్క్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ ఆపరేటర్‌, వాటర్‌ వర్క్స్‌, స్టాఫ్‌ నర్స్‌, ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వోలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కార్మికులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టి స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందించారు. ఒప్పంద పద్ధతిలో తీసుకుని, తర్వాత మరికొంత కాలం పాటు కొనసాగించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందన్నారు. మూడు నెలలు అదనంగా పని చేయించుకుని వేతనాలు ఇవ్వకుండా, విధులకు రానవసరం లేదని చెప్పి పంపించేశారని వాపోతున్నారు. తమను విధుల్లో కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి

భవన నిర్మాణ కార్మికులకు, సంక్షేమ బోర్డు నుంచి నిలిపివేసిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టి అనంతరం స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఇసుక పాలసీతో ఇసుక అందుబాటులోకి రాక పనులు కోల్పోయిన కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, పథకాలను కూడా రద్దు చేసి అన్యాయం చేస్తుందన్నారు. కార్మిక సంక్షేమ బోర్డు నుంచి అక్రమంగా తరలించే రూ.850 కోట్లను వెంటనే బోర్డుకు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే విడుదల చేయాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని