సమస్యలపై సత్వరమే స్పందించండి
eenadu telugu news
Published : 21/09/2021 03:50 IST

సమస్యలపై సత్వరమే స్పందించండి

స్పందనలో సబ్‌ కలెక్టర్‌


పూజిత ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటున్న సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ చంద్‌

కృష్ణలంక, న్యూస్‌టుడే: స్పందనలో అందిన వినతుల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు సత్వరం స్పందించాల్సిందిగా సబ్‌ కలెక్టర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ అన్నారు. సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం 69 అర్జీలు అందినట్లు తెలిపారు. వీటిలో రెవెన్యూ 23, పురపాలక 15, పోలీస్‌శాఖ 3, సెర్ప్‌ 11, పంచాయితీరాజ్‌ 9, ఇతర శాఖలకు చెందిన 8 మొత్తం 69 అందినట్లు తెలిపారు. నడిచేందుకు వీలుకాని పరిస్థితుల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతురాలైన విజయవాడకు చెందిన తిరుమలకొండ పూజితకు సబ్‌కలెక్టర్‌.. వీల్‌ఛైర్‌ అందించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి ఎస్‌.శ్రీనివాసరెడ్డి, పలు శాఖల డివిజనల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బీమా పరిహారం కోరుతూ..

కానూరుకు చెందిన పి.చంద్రకళ తన భర్త మేలో కొవిడ్‌తో మరణించారని, ఎటువంటి ఆధారం లేని తనకు పింఛన్‌ను మంజూరు చేయాలని కోరారు. వైఎస్సార్‌ బీమాలో తన భర్త నమోదైనందున బీమా మొత్తం వచ్చేలా చూడాల్సిందిగా కోరారు. దీనిపై సబ్‌ కలెక్టర్‌ స్పందిస్తూ సత్వర చర్యలు చేపట్టాల్సిందిగా పెనమలూరు ఎంపీడీవోను ఆదేశించారు.

ఆర్థిక సాయం చేయరూ..

ఈడ్పుగల్లుకు చెందిన పగుట్ల వెంకట మహాలక్ష్మి.. తన భర్త కొవిడ్‌తో మరణించినందున ఎటువంటి ఆధారం లేని తనకు ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా కోరారు. విజయవాడకు చెందిన డ్రైవర్‌ అనిశెట్టి మల్లేశ్వరరావు, బుద్ధవరపు పద్మలు తమకు రైస్‌ కార్డులు మంజూరు చేయాలని ఆర్జీలు అందజేశారు.

పింఛను మంజూరుకు వినతి

విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన 75 ఏళ్ల మల్లెల అనసూయమ్మ తనకు పక్షవాతం వచ్చిన కారణంగా వేలిముద్రలు, ఐరిస్‌ నమోదు కాకపోవడంతో ఆధార్‌ కార్డు మంజూరు కావడం లేదని, సమస్యపట్ల స్పందించి తనకు పింఛన్‌ను మంజూరు చేయించాల్సిందిగా కోరారు. సబ్‌ కలెక్టర్‌ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా నగరపాలకసంస్థ యూసీడీ పిడీకి సూచించారు.

పొలం వివాదంపై..

ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన ఓ రైతు తన పొలం సమస్యను పరిష్కరించాల్సిందిగా వినతి పత్రాన్ని అందించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు చేపట్టడంతో పాటు నివేదికను సమర్పించాల్సిందిగా సబ్‌ కలెక్టర్‌ తహసీల్దార్‌ను ఆదేశించారు.


పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో..


ఫిర్యాదుదారుల సమస్యలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వింటున్న అడ్మిన్‌ డీసీపీ మేరీ ప్రశాంతి

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 73 ఫిర్యాదులు వచ్చాయి. అడ్మిన్‌ డీసీపీ డి.మేరీ ప్రశాంతి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే సంబందిత పోలీస్‌స్టేషన్ల అధికారులతో మాట్లాడి, పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చిన 73 ఫిర్యాదుల్లో అత్యధికంగా 19.. కుటుంబ కలహాలకు సంబంధించినవే ఉన్నాయి. నగదు లావాదేవీలు 17, సివిల్‌ 13, మోసాలు 7, అద్దె వివాదాలు 4, తప్పిపోయిన వ్యక్తి ఆచూకీపై 1, ఇతర ఫిర్యాదులు 12 వచ్చాయి. వీటిని పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు అడ్మిన్‌ డీసీపీ ఆదేశాలు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని