తియ్యని మాటలతో వల
eenadu telugu news
Published : 21/09/2021 04:04 IST

తియ్యని మాటలతో వల

మాజీ ప్రియుడ్ని హతమార్చిన వైనం

ఏలూరులో మాయలేడి ముఠా అరెస్టు


స్వాధీనం చేసుకున్న చరవాణులు, నగదు, బంగారు ఆభరణాలు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : తియ్యని మాటలతో తేలికగా డబ్బు సంపాదించవచ్చునని నమ్మించి...అమాయకులను నిండా ముంచడమే కాకుండా తన మాజీ ప్రియుడిని హతమార్చిన ఓ కిలాడీ బృందాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ వివరాలు వెల్లడించారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామ శివారులో ఉంటున్న గుడిపాటి సుష్మా అలియాస్‌ సుష్మాచౌదరి సత్రంపాడులో ఓ బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. ఈమె భర్త నరేంద్రకుమార్‌ గతంలో మృతి చెందారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో ఈమె నేరాలకు పాల్పడింది. వంగాయగూడెంలోని సుబ్రహ్మణ్యం కాలనీకి చెందిన వేముల ఉమామహేశ్వరరావు, జంగారెడ్డిగూడెంలో ఉంటున్న వారిగేటి కుమారి, సత్రంపాడులోని ఎంఆర్‌సీ కాలనీకి చెందిన షేక్‌ నాగూర్‌లను ఓ గ్యాంగ్‌గా ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగిస్తోంది.

మాజీ ప్రియుడిని గుట్టుగా అంతమొందించి.. నిందితురాలు తన మాజీ ప్రియుడిని గుట్టుగా సైనైడ్‌తో అంతమొందించింది. గుంటూరుకు చెందిన కావూరి శశిచౌదరిను ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత శశిచౌదరి ఈమెకు దూరంగా ఉంటూ వచ్చినా...అతనిని అనేక రకాలుగా వలలో వేసుకోవాలని ప్రయత్నించింది. శశిచౌదరి ఈమె వలలో చిక్కకపోవటంతో అతడిని అంతమొందించాలని భావించింది. జూన్‌ 22న గుంటూరు జిల్లా సత్తెనపల్లికి అతన్ని పిలిచి, సాంబ్రాణి పుల్లల బూడిదలో సైనైడ్‌ కలిపిన పొట్లాన్ని ఇచ్చింది. దీనిని నీటిలో కలిపి తాగితే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నమ్మబలికింది. ఈమె మాటలు నమ్మిన అతను అదే రోజు రాత్రి నిద్రించే ముందు ఆమె చెప్పిన విధంగా చేయడంతో అస్వస్థతకు గురై చనిపోయాడు. కరోనాతో అతను మృతి చెందారని కుటుంబ సభ్యులు భావించారు.

అనేక రకాల మోసాలతో... నిందితురాలు తన స్నేహితురాలైన కంటమనేని ధనలక్ష్మి అలియాస్‌ పండుకు ఇటీవల కొంత డబ్బు అప్పుగా ఇచ్చి, ఆమె పొలం కాగితాలను తన పేరు మీద మార్చుకోవటానికి ప్రయత్నం కూడా చేసింది. గుప్త నిధులు, మహిమగల లంకెబిందెలు ఉన్నాయంటూ.. రైస్‌పుల్లింగ్‌ ద్వారా బాగా డబ్బు వస్తుందంటూ అనేక మందిని మోసగించింది. గంజాయి అక్రమ రవాణాకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. అమాయకులను వలలో వేసుకోవడానికి వీడియో కాల్స్‌లో అందంగా కనిపిస్తూ మాట్లాడి, వారిని తమ వద్దకు రప్పించుకోవటం..తర్వాత డబ్బులు గుంజటం వంటి నేరాలకు ఈ ముఠా పాల్పడింది.

దొరికారు ఇలా.. ఈ నెల 2న తమకు పరిచయం ఉన్న వ్యక్తిని వీరు ట్రాప్‌ చేశారు. ఓ మహిళతో అతనికి ఫోను చేయించి, ఇంటికి రమ్మని పిలిపించారు. సంబంధిత మహిళ అతన్ని మభ్యపెట్టి దుస్తులు లేకుండా చేసింది. ఆ తరువాత అక్కడే ఇంటి బయట ఉన్న నలుగురు నిందితులు బాధితుడిని కర్రలతో దాడి చేసి, వీడియోలు తీసి బెదిరించారు. రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రెండు చరవాణులు, బంగారు బ్రాస్‌లెట్‌, బంగారు చైను లాక్కున్నారు. ఆ మరుసటి రోజు రూ.1.50 లక్షలు బాధితుడి నుంచి తీసుకున్నారు. చివరకు బాధితుడు ఈ నెల 13న పోలీసులను ఆశ్రయించటంతో త్రీటౌన్‌ సీఐ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల జాడ తెలుసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 20 గ్రాముల బంగారు నగలు, 8 చరవాణులు, రూ. లక్షా 50 నగదు, ఓ కారు, మెమరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని