నోటా @ 12,053
eenadu telugu news
Published : 21/09/2021 04:03 IST

నోటా @ 12,053

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే ‘నోటా’కు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పరిషత్‌ ఎన్నికల ఓట్లను ఆదివారం లెక్కించారు. 45 జడ్పీటీసీ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 188 మంది పోటీ చేశారు. ఆయా జడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులు తమకు నచ్చకపోవడంతో బ్యాలెట్‌ పత్రంలో చివరలో ఉన్న ‘నోటా’కు ఓటు వేశారు. కొల్లిపర జడ్పీటీసీ స్థానంలో అత్యధికంగా 746 ఓట్లు నోటాకు వచ్చాయి. కొల్లూరు జడ్పీటీసీ స్థానంలో 675 ఓట్లు, బాపట్లలో 638, అమరావతిలో 537, భట్టిప్రోలులో 520, నగరంలో 502, తెనాలిలో 489, చేబ్రోలులో 461, చెరుకుపల్లిలో 436, వినుకొండలో 410, రేపల్లెలో 386, నరసరావుపేటలో 370, కాకుమానులో 350, చిలకలూరిపేటలో 337, పిట్టలవానిపాలెంలో 328, అమృతలూరు, తాడికొండ, పెదకాకానిలో 321, కర్లపాలెంలో 316, దుగ్గిరాల, మేడికొండూరుల్లో 306, అచ్చంపేటలో 279, వేమూరులో 273, పొన్నూరులో 271, చుండూరులో 255, రొంపిచర్లలో 245, బొల్లాపల్లిలో 244, క్రోసూరులో 228, నకరికల్లులో 226, వట్టిచెరుకూరు, పెదనందిపాడు జడ్పీటీసీ స్థానాల్లో 206, ఈపూరులో 184, పెదకూరపాడులో 170, దాచేపల్లిలో 160, ప్రత్తిపాడులో 150, ముప్పాళ్లలో 129 ఓట్లు నోటాకు వేశారు. ఇతర మండలాల్లోనూ వంద లోపు నోటాకు ఓట్లు వచ్చాయి. ఫిరంగిపురం, సత్తెనపల్లి, రాజుపాలెం, యడ్లపాడు, మాచవరం మండలాల్లో నోటాకు ఒక్క ఓటూ వేయలేదు. జిల్లాలో నోటాకు మొత్తం 12,053 మంది ఓటు వేసి తమ నిరసనను తెలిపారు. ఎంపీటీసీ స్థానాల్లోనూ నోటాకు ఓట్లు వచ్చాయి.

నరసరావుపేట జడ్పీటీసీగా భారీ ఆధిక్యంతో విజయం

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో వైకాపా హవా కొనసాగింది. 45 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే మొత్తం స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. నరసరావుపేట జడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గర్నెపూడి పులిరాజుపై వైకాపా అభ్యర్థి పదముత్తం చిట్టిబాబు 41,797 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. పులిరాజుకు 1,452 ఓట్లు రాగా వైకాపా అభ్యర్థి చిట్టిబాబుకు 43,269 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష తెదేపా పోటీ చేయకపోవడం, కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రభావం చూపలేకపోవడంతో వైకాపా అభ్యర్థికి భారీ ఆధిక్యం లభించింది.

ప్రచారం చేయకున్నా 12,227 ఓట్లు

జిల్లాపరిషత్తు: తాడికొండ జడ్పీటీసీ స్థానం నుంచి జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ కూచిపూడి విజయ తెదేపా అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరగడంలేదని తెదేపా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో పార్టీ నిర్ణయం మేరకు విజయ ఎన్నికల ప్రచారం చేయలేదు. అయినా ఆమెకు 12,227 ఓట్లు రావడం గమనార్హం. వైకాపా అభ్యర్థి గుడిమెట్ల జ్యోతికి 19,964 ఓట్లు వచ్చిన ఆమె 7,737 ఓట్లతో విజయం సాధించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో తెదేపా నుంచి ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా విజయ తాడికొండ జడ్పీటీసీ స్థానంలో పోటీకి దిగారు. తెదేపా ఎన్నికలను బహిష్కరించడంతో విజయ, పార్టీ నాయకులు ప్రచారం చేయకున్నా భారీగా ఓట్లు రావడం విశేషం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని