సమయం ముంచుకొస్తోంది..
eenadu telugu news
Updated : 22/09/2021 12:06 IST

సమయం ముంచుకొస్తోంది..

ప్రత్యక్ష, పరోక్ష విధానంలో ఆర్జిత సేవలకు ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే

దసరా ఉత్సవాల సమన్వయ కమిటీ  సమావేశం ఎప్పుడో?

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే దసరా ఉత్సవాలు అక్టోబరు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ మూడో దశ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రెండు వారాల సమయం మాత్రమే ఉంది. జిల్లా కలెక్టర్‌, నగర పోలీసు కమిషనర్‌, దేవాదాయ శాఖ మంత్రి, ఉత్సవాలతో ముడిపడిన అన్ని విభాగాల ముఖ్య అధికారులతో దసరా ఉత్సవాల సమన్వయ కమిటీ సమావేశం నెలరోజులు ముందుగానే నిర్వహిస్తారు. అయితే ఇంత వరకు నిర్వహించలేదు.

ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై తీసుకోవాల్సిన నిర్ణయాలను ఈ సమావేశంలో చర్చించడంతోపాటు ఏర్పాట్లు పూర్తయిన తరువాత వాటిల్లో లోటుపాట్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

* దుర్గాఘాట్‌, కృష్ణవేణి ఘాట్ల వద్ద భక్తులకు జల్లు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. తాత్కాలిక కేశఖండన శాల, ప్రసాదాలు ఎంత మంది భక్తులకు తయారు చేయాలి అన్న అంశాలపై ఆలయ అధికారులు దిగువ స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాల్సి ఉంటుంది.

* హడావుడిగా ఏర్పాట్లు చేస్తే లోపాలు తలెత్తే అవకాశాలు ఉంటాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. చివరి రెండు రోజులు పెద్ద ఎత్తున భవానీ దీక్షాధారులు తరలి వచ్చే అవకాశం ఉంది. వారు ఇరుముడులు సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారా లేదా అన్న అంశంపై కోర్డినేషన్‌ మీటింగ్‌ తరువాత స్పష్టత వస్తుందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

దసరా ఉత్సవాల్లో ఆర్జిత సేవలైన లక్షకుంకుమార్చన, చండీహోమం వంటి పూజలు ప్రత్యక్షంగా నిర్వహించాలా, గతేడాది లాగా పరోక్షంగా నిర్వహించాలా అన్న విషయంపై ఇంతవరకు తుది నిర్ణయాన్ని దేవస్థానం అధికారులు ప్రకటించలేదు. వైదిక కమిటీ మాత్రం పరిమిత సంఖ్యలో ప్రత్యక్ష ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనేందుకు అనుమతించాలని సూచించింది. రెండు షిఫ్టుల్లో లక్ష కుంకుమార్చన పూజను నిర్వహించేందుకు ఆన్‌లైన్లో టిక్కెట్లను సిద్ధం చేశారు. ఒక్కో దశకు 250 మందిని అనుమతించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరోక్ష విధానంలో ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకు ఆన్‌లైన్‌ టిక్కెట్లు అందుబాటులో ఉంచారు.

* లక్ష కుంకుమార్చన టిక్కెట్‌ ధర రూ.3వేలు, చండీహోమం టిక్కెట్‌ ధరను రూ.4 వేలుగా నిర్ణయించారు. మూలానక్షత్రం రోజున లక్ష కుంకుమార్చన టిక్కెట్‌ ధరను రూ.5 వేలుగా ప్రకటించారు. దసరా ఉత్సవాల తొమ్మిది రోజులు పరోక్ష విధానంలో మాత్రమే కుంకుమార్చన, చండీహోమం చేయించుకునేందుకు రూ.20 వేలు టిక్కెట్‌ రుసుంగా నిర్ణయించారు. వీటిపై జిల్లా అధికార యంత్రాంగం చర్చించాల్సిన అవసరం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని