23న ‘విట్‌-ఏపీ’ స్నాతకోత్సవం
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

23న ‘విట్‌-ఏపీ’ స్నాతకోత్సవం


కరదీపికను ప్రదర్శిస్తున్న విట్‌-ఏపీ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. ఎస్‌.వి.కోటారెడ్డి, రిజిస్ట్రార్‌ డా. సి.ఎల్‌.వి.శివకుమార్‌

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ నెల 23న వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌ ఏపీ విశ్వవిద్యాలయం) మొదటి స్నాతకోత్సవం, యూనివర్సిటీ నూతన భవనాలను ప్రారంభించనున్నట్లు ఉపకులపతి డా.ఎస్‌.వి.కోటారెడ్డి, రిజిస్ట్రార్‌ డా.సి.ఎల్‌.వి.శివకుమార్‌ వెల్లడించారు. అమరావతిలోని విశ్వవిద్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా నోబుల్‌ పురస్కార గ్రహీత, బింగ్‌హామ్‌టన్‌ యూనివర్సిటీ (అమెరికా)లో ఎన్‌ఈసీసీఈఎస్‌ విభాగం డైరెక్టర్‌ స్టాన్లీ విటింగ్‌హాం, గౌరవ అతిథిగా మైక్రోసాఫ్ట్‌ ఇండియా డైరెక్టర్‌ మయూరికాసింగ్‌ పాల్గొంటారని తెలిపారు. విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన నాలుగు భవనాలను ఆమె ప్రారంభిస్తారని చెప్పారు. కొవిడ్‌ నేపథ్యంలో విట్‌ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు, కులపతి జి.విశ్వనాథన్‌ ఆధ్వర్యంలో స్నాతకోత్స కార్యక్రమాలు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన కొంత మంది విద్యార్థులకు 2021-22 సంవత్సరానికి రుసుంలు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఇంజినీరింగేతర కోర్సుల్లో జీవీ ప్రతిభా ఉపకారవేతనాలు ఇస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఏ బోర్డు టాపరైనా ఈ ఉపకారవేతనం కింద విట్‌ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉందని తెలిపారు. ప్రతిభా ఉపకారవేతనాలకు అర్హత పొందిన వారికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో అన్ని సంవత్సరాలకు శత శాతం ఫీజు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. రాజేశ్వరి అమ్మల్‌ ప్రతిభా ఉపకారవేతనం పొందడానికి అభ్యర్థి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా జిల్లా టాపరై ఉండాలని, దీని ద్వారా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో అన్ని సంవత్సరాలకు ట్యూషన్‌ ఫీజులో 50 శాతం రాయతీ లభిస్తుందన్నారు. జిల్లా టాపర్‌ విద్యార్థిని అయితే ఆమెకు 75 శాతం ఉపకారవేతనం ఇస్తున్నట్లు తెలిపారు. వారికి వసతిగృహ సౌకర్యంతో పాటు, గుంటూరు, విజయవాడ, తెనాలి ప్రాంతాల్లో నివసించే విద్యార్థులైతే ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 300లకు పైగా యూనివర్సిటీలతో విట్‌కు అవగాహన ఒప్పందాలు ఉన్నాయని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని