షూటింగ్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌నకు జిల్లా బాలుర జట్టు
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

షూటింగ్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌నకు జిల్లా బాలుర జట్టు


షూటింగ్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌నకు ఎంపికైన క్రీడాకారులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా షూటింగ్‌ బాల్‌ సంఘం ఆధ్వర్యంలో గంపలగూడెం మండలం ఊటుకూరి గ్రామంలోని జడ్పీహెచ్‌ స్కూల్‌ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన జిల్లా జూనియర్‌ బాలుర జట్టు ఎంపిక పోటీల్లో పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు తలపడ్డారని ఆ సంఘం కార్యదర్శి ఎం.కిషోర్‌బాబు తెలిపారు. హాజరైన క్రీడాకారులకు నిర్వహించిన ఎంపిక పోటీల నుంచి ప్రతిభగల ఆటగాళ్లను జిల్లా జూనియర్‌ (అండర్‌-19) బాలుర జట్టుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. బాలికలు ఎక్కువ మంది హాజరు కాకపోవడంతో తిరిగి 22వ తేదీన బాలికల జట్టు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన జట్టు ఈ నెల 23 నుంచి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగే రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల షూటింగ్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో తలపడుతుందని వివరించారు.

ఎంపికైంది వీరే..

ఆర్‌.మణికంఠ, వై.సురేష్‌ బాబు, ఎ.రోహిత్‌, పి.మోహిత్‌ నాయుడు, ఎం.లిఖిత్‌ శ్రీఆంజనేయులు, మహమ్మద్‌ అమీర్‌ బాషా, బి.నరేంద్ర సాయి నాయక్‌, బి.ధీరజ్‌, కె.శశాంక్‌, టి.శ్రీహర్ష, కె.పవన్‌కుమార్‌, ఎ.ప్రవీణ్‌.

ఉత్సాహంగా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో ఐజీఎంసీ స్టేడియంలోని టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో మూడు రోజులపాటు జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో క్రీడాకారులు ఉత్సాహంగా తలపడ్డారు. రెండో రోజైన మంగళవారం జరిగిన అండర్‌-12, 14 బాలుర వ్యక్తిగత విభాగాల్లో నగరానికి చెందిన వై.ఇషాన్‌ గెలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో భాగంగా అండర్‌-10 బాలుర విభాగంలో కె.విన్సెంట్‌ (గుంటూరు) 6-3 సెట్ల తేడాతో జి.మోహత్‌ వెంకట్‌ (గుంటూరు)పై గెలుపొందగా.. బాలికల ఫైనల్స్‌లో ఎం.భావనదేవి (ప్రకాశం) 6-2 సెట్ల తేడాతో ఎం.అశ్విని (ప్రకాశం)పై విజయం సాధించింది. అండర్‌-12 బాలుర ఫైనల్స్‌లో వై.ఇషాన్‌ (కృష్ణా) 7-0 సెట్ల తేడాతో ఎ.గౌతమ్‌ (విశాఖపట్నం)పై, అండర్‌-14 బాలుర ఫైనల్స్‌లో వై.ఇషాన్‌ (కృష్ణా) 8-4 సెట్ల తేడాతో ఎం.సుధన్వ్‌ రవినందన్‌ (నెల్లూరు)పై విజయం సాధించగా.. అండర్‌-14 బాలికల ఫైనల్స్‌లో జి.జోషిత (గుంటూరు), 8-3 సెట్ల తేడాతో ఎం.కీర్తన (తూర్పు గోదావరి)పై విజయం సాధించింది. అండర్‌-16 బాలికల ఫైనల్స్‌లో పి.యుతిక (కృష్ణా) 8-2 సెట్ల తేడాతో పి.భవ్య (కృష్ణా)పై గెలుపొందింది.

నేడు రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా, రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో రాష్ట్ర స్థాయి అంతర్‌ జిల్లాల సబ్‌ జూనియర్‌ బాలుర హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తామని జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు పెనుమత్స సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి ఎన్‌.వంశీకృష్ణ ప్రసాద్‌ సంయుక్తంగా తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జట్లు తలపడతాయని పేర్కొన్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన వారికి ఈ నెల 23 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు నగరంలోనే శిక్షణ శిబిరం నిర్వహిస్తామన్నారు.


సెంట్రల్‌ జోన్‌ జట్టు శుభారంభం

జి.సింధుజ (38 పరుగులు; 5/18)

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: సెంట్రల్‌ జోన్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో నార్త్‌ జోన్‌ జట్టుపై విజయం సాధించి శుభారంభం చేసింది. మంగళగిరి ఏసీఏ స్టేడియంలో మూడు రోజులపాటు జరుగుతున్న ఏసీఏ ఇంటర్‌ జోనల్‌ సీనియర్‌ మహిళల క్రికెట్‌ టోర్నీలో భాగంగా మంగళవారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సెంట్రల్‌ జోన్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బరిలోకి దిగిన నార్త్‌ జోన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. జట్టులో ఎం.హారిక యాదవ్‌ (36), వి.స్నేహదీప్తి (32) రాణించారు. ప్రత్యర్థి బౌలర్‌ జి.సింధుజ 18 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు కూల్చింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ జోన్‌ జట్టు 39.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులతో విజయకేతనం ఎగురవేసింది. జట్టులో పీవీ సుధారాణి (45 నాటౌట్‌), భావన (6 నాటౌట్‌), జి.సింధుజ (38) రాణించారు. ప్రత్యర్థి బౌలర్‌ కె.దేవిక 35 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది.

పీవీ సుధారాణి (45 నాటౌట్‌)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని