ఈ-పర్మిట్‌తోఅక్రమాలకుఅడ్డుకట్ట
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

ఈ-పర్మిట్‌తోఅక్రమాలకుఅడ్డుకట్ట

ఈ నెల 15 నుంచి అమల్లోకి తెచ్చిన మార్కెటింగ్‌ శాఖ

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

 

వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో అక్రమాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ-పర్మిట్‌ విధానాన్ని మార్కెటింగ్‌ శాఖ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విధానాన్ని గతేడాది ప్రారంభించాల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. జిల్లాలో 21 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలున్నాయి. వాటి పరిధిలో 72 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆదాయ పరంగా జిల్లాలో మైలవరం, గొల్లపూడి, కంకిపాడు, నందిగామ మార్కెట్‌ యార్డులే కీలకం. వాటి పరిధిలో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, శనగలు, అపరాలు, మామిడి తదితర పంటల వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయి. జిల్లాలో 21 యార్డుల పరిధిలో ఏటా సగటున రూ.55 కోట్ల వరకు వ్యాపారం సాగుతోంది. 2019- 2020 సంవత్సరంలో రూ.61.06 కోట్ల వ్యాపారం జరిగింది. గత రెండేళ్లుగా కొవిడ్‌, ఇతర కారణాల వల్ల వ్యాపార లావాదేవీలు మందగించడంతో కమిటీల ఆదాయం కూడా తగ్గిపోయింది. వ్యాపారులు కొన్న సరకు విలువలో ఒక శాతం సెస్‌ మార్కెట్‌ యార్డులకు చెల్లించాల్సి ఉంటుంది.

ఆదాయానికి గండి

ఇంత కాలం పంట ఉత్పత్తుల కొనుగోలు అనంతరం రవాణాకు మాన్యువల్‌గా అనుమతి ఇచ్చేవారు. అనుమతి లేకుండా వెళ్లే వాహనాలు చెక్‌ పోస్టుల వద్ద దొరికితే సెస్‌ వసూలు చేయడమో.. లేదంటే జరిమానా విధించడమో చేసేవారు. ఎవరూ పట్టించుకోకపోతే తనిఖీ కేంద్రాలను దాటుకొని వెళ్లిపోయేవి. ఫలితంగా ఆదాయానికి గండి పడేది. నగదు చెల్లింపు సమయంలో అవినీతి, అక్రమాలకు చోటుండేది. అనుమతి పత్రాల కోసం జిల్లాకు చెందిన దాదాపు 900 మందికిపైగా వ్యాపారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. నూతన విధానంతో వారి కష్టాలు తీరనున్నాయి. యార్డులకు సక్రమంగా సెస్‌ రావడంతో పాటు ఈ-పర్మిట్‌ జారీలో పారదర్శకత, నగదు రహిత సేవలతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్ఛు ఈ మేరకు జిల్లాలోని అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఈ - పర్మిట్‌ విధానం పక్కాగా అమలయ్యేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి యార్డుల్లో మాన్యువల్‌ అనుమతుల జారీ ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారి తన మార్కెటింగ్‌ లైసెన్స్‌ సంఖ్య, ఆధార్‌ కార్డు, చరవాణి సంఖ్యతో ఓటీపీ ద్వారా ఈ-పర్మిట్‌ ఐడీ సృష్టించుకోవాలి. లాగిన్‌ పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడ సరకులు కొనుగోలు చేసినా తన లాగిన్‌ నుంచే ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా నగదు చెల్లించి అనుమతి పొంది సరకు తరలించుకోవచ్ఛు


వ్యాపారుల సహకారం అవసరం

ఈ నెల 15 నుంచి జిల్లాలో ఈ - పర్మిట్‌ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానం వల్ల వ్యాపారులకు ఎంతో వెసులుబాటు లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారులకు అనుమతి కష్టాలు తొలగుతాయి. దీనిపై అవగాహన కార్యక్రమాలతో పాటు ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. వ్యాపారుల సహకారం అవసరం.

- దివాకర్‌, ఏడీ మార్కెటింగ్‌ శాఖ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని