ప్రణాళికతో పనిచేస్తేనే ఫలితాలు
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

ప్రణాళికతో పనిచేస్తేనే ఫలితాలు

కలెక్టర్‌ జె. నివాస్‌


సమావేశంలో కలెక్టర్‌ నివాస్‌, జేసీలు శ్రీవాస్‌ అజయ్‌, మోహన్‌కుమార్‌

కృష్ణలంక, న్యూస్‌టుడే: ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఫలితాలు సాధించవచ్చనే విషయాన్ని ప్రత్యక్షంగా అధికారులు నిరూపించారని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పూర్తయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌లో ప్రణాళికాబద్ధంగా పనిచేసినందు వల్లే అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రక్రియను పూర్తి చేయగలిగినట్లు చెప్పారు. అదే విధంగా గృహ నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, ఉపాధిహామీ నిర్మాణాలు కూడా ఇదే లక్ష్యంతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. లబ్ధిదారులను చైతన్య పరచడం, గృహ నిర్మాణాలకు సామాగ్రిని అందించి అనుసంధానం చేయడంలో మండల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితికి మించి ఎటువంటి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకూడదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌ బీమా పథకం కింద చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని త్వరితగతిన అందించాలన్నారు. జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 26,756 దరఖాస్తులు రాగా వాటిలో 7,610 దరఖాస్తులు మాత్రమే పరిశీలించినట్లు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు చొరవచూపి మిగిలిన దరఖాస్తులు పరిశీలించాలన్నారు. రైతు భరోసా, వాహనమిత్ర, వైఎస్సార్‌ చేయూత, కాపునేస్తం, మత్స్యకార భరోసా తదితర పథకాల లబ్ధిదారులకు సంబంధించి డిజిటల్‌ పేమెంట్‌ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జేసీ (గృహ నిర్మాణం) శ్రీవాస్‌ అజయ్‌కుమార్‌, జేసీ మోహన్‌కుమార్‌(ఆసరా), హౌసింగ్‌ పీడీ రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎలుకల నిర్మూలనతో మంచి దిగుబడి..

కృష్ణలంక, న్యూస్‌టుడే: రైతులందరూ సామూహికంగా ఒకేసారి ఎలుకల మందును ఉపయోగించి పంటను కాపాడుకోవడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎలుకల నివారణకు సంబంధించిన పోస్టర్లు, ప్రతులను జేసీ మాధవీలత, సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌లతో కలిసి ఆవిష్కరించారు. జిల్లాలో వరి ఎక్కువగా సాగుచేస్తున్నారని, ఈక్రమంలో పంటపై ఎలుకల ప్రభావం ఉంటుందన్నారు. వాటిని నిర్మూలించడం ద్వారా ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవచ్చని, వ్యవసాయ శాఖ ద్వారా 100శాతం రాయితీపై రైతులకు బోమోడయలిన్‌ మందును అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు.

వారానికి 500 ఇళ్ల నిర్మాణానికి సామగ్రి అందజేత

కృష్ణలంక, న్యూస్‌టుడే: మండలంలో వారానికి కనీసం 500 ఇళ్ల నిర్మాణాలకు సామాగ్రిని అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టడంతోపాటు మరో 500 ఇళ్లు బేస్‌మెంట్‌ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌ నివాస్‌ మండల అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల పథకంపై కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాలకు చెందిన అధికారులతో మంగళవారం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామ, వార్డు వాలంటీర్‌ తన పరిధిలో వారానికి కనీసం 2 ఇళ్ల నిర్మాణ పనులు బేస్‌మెంట్‌ స్థాయికి చేరేలా చూడాలన్నారు. సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ 5 ఇళ్లకు, గృహనిర్మాణ శాఖ ఏఈలు రోజుకు 25 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమై బేస్‌మెంట్‌ స్థాయికి చేరేలా చూడాలన్నారు. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయని సిబ్బందిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు కలెక్టర్‌ హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని