జడ్పీ అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన..!
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

జడ్పీ అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన..!

ఎమ్మెల్సీ పదవులు వద్దంటున్న దుట్టా, ఉప్పాల

ఇద్దరికీ జడ్పీ పీఠంపైనే గురి

తెరమీదకు మరో బీసీ అభ్యర్థిత్వం

ఈనాడు, అమరావతి

రాజకీయ, సామాజిక సమీకరణాలు.. వర్గ రాజకీయాలు.. ఎమ్మెల్సీ పదవులు.. ఈ అంశాలన్నీ జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వంపై ప్రభావం చూపుతున్నాయి. జిల్లాకు కాబోయే జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఎవరనేదానిపై ఉత్కరఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెరమీదకు ఉప్పాల హారిక పేరు వచ్చింది. కొంత మంది దాదాపు ఖరారైనట్లేనని భావిస్తుండగా మరికొంత మంది ఆఖరి నిమిషం వరకు ఎవరనేది తెలియదని చెబుతున్నారు. మరోవైపు గన్నవరం నియోజకవర్గానికి చెందిన దుట్టా వర్గం జడ్పీ పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఇవ్వాలని కొంత మంది సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం ముగ్గురు అభ్యర్థుల పేర్లు తెర మీదకు వచ్చాయి. దీంతో జడ్పీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వంపై ప్రతిష్ఠంభన నెలకొంది. వైకాపా అధిష్ఠానం, లేదా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ప్రకటించే వరకు అభ్యర్థి ఎవరనేదానిపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం జడ్పీ అభ్యర్థినిగా ప్రచారం జరుగుతున్న ఉప్పాల హారిక తన మామ ఉప్పాల రాంప్రసాద్‌, భర్త ఉప్పాల రమేష్‌లతో కలిసి సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి కొడాలి నాని వారిని తీసుకెళ్లి సీఎంను కలిపించారు. అక్కడ ఎలాంటి భరోసా లభించిందనేది బయటకు రాలేదు.

రికార్డు మారనుందా..!

జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ పీఠం ప్రతిసారి ఒకే సామాజిక వర్గానికి దక్కింది. ఏ పార్టీ గెలిచినా ఒక వర్గానికి చెందిన వారినే ఎంపిక చేశారు. గత ఎన్నికల్లో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా గద్దె అనురాధ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈసారి జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. దీంతో మళ్లీ ఓసీ వర్గానికి కేటాయిస్తారని భావించారు. దీని కోసం పలువురు ప్రయత్నాలు చేశారు. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో వైకాపా తిరుగులేని ఆధిపత్యం సాధించింది. మొత్తం 41 జడ్పీటీసీలకు 40 గెలుచుకుంది. రెండు జడ్పీటీసీలు ఏకగ్రీవం చేసుకుంది. మొత్తం 42 మంది ఉన్నారు. ఈ సారి కైకలూరు, పెడన, గన్నవరం, గుడివాడ నుంచి పోటీచేసిన పలువురు అభ్యర్థులు జడ్పీ పీఠం ఆశించారు. మొదటి నుంచి జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవికి పెడన నియోజకవర్గానికి చెందిన ఉప్పాల హారిక పేరు తెరమీదకు వచ్చింది. పెడన నియోజకవర్గం నుంచి ఉప్పాల రాంప్రసాద్‌ శాసనసభకు పోటీ చేయాల్సి ఉండగా ఆ స్థానం జోగి రమేష్‌కు ఇవ్వడంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ దక్కలేదు. డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. ఆ పదవీ కాలం ముగిసింది. దీంతో తన కుటుంబానికి జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని కోడలు పేరు తెరమీదకు తెచ్చారు. పెడనలో ఉన్న వర్గ విభేదాలతో ఉప్పాల హారిక ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. అక్కడ శాసన సభ్యుడు జోగిరమేష్‌తో విభేదాలు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మంత్రి కొడాలి నాని తన నియోజకవర్గంలో గుడ్లవల్లేరు నుంచి పోటీ చేయించారు. తెదేపా ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇవ్వడం, ఇతర కారణాలు ఏవైనా.. 12,700 ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో ఆమె జడ్పీ పీఠం ఖాయమని భావిస్తున్నారు. అధిష్ఠానం కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నామినేషన్‌ల సమయంలోనే దుట్టా రామచంద్రరావు కుమార్తె దుట్టా సీతారామలక్ష్మి ఉంగుటూరులో ఏకగ్రీవం అయ్యారు. జడ్పీ పీఠం కోసం ఆమె తీవ్ర ప్రయత్నాలతో ఎన్నికను ఏకగ్రీవం చేసుకున్నారు. గన్నవరం నియోజకవర్గ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో దుట్టాకు ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ రాలేదు. ప్రస్తుతం ఆయన తనకు ఎమ్మెల్సీ వద్దని దుట్టా కుటుంబం తిరిగి రాజకీయాల్లో కొనసాగాలంటే.. క్రియాశీలకంగా వ్యవహరించాలంటే జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో దుట్టా కూతురు జడ్పీ అభ్యర్థిత్వం ఖరారైనట్లు తొలిసారి జడ్పీ పీఠంపై ఓ సామాజిక వర్గానికి కేటాయించినట్లు ప్రచారం సాగింది. ఇది సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. ఆ వర్గానికి కొంత మంది మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం నుంచి గెలుపొందిన మహిళ కందుల దుర్గాకుమారి పేరు తెరమీదకు వచ్చింది. జిల్లాలో ఓ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నందున ఆమెకు ఇవ్వాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి. గుడివాడ నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ కావడంతో మంత్రి కొడాలి నాని ఎవరికి సిఫార్సు చేస్తారనే చర్చ ప్రారంభమైంది. పెడన నుంచి ఉప్పాల హారికను తీసుకువచ్చినందున ఆమెను సీఎం దగ్గరకు తీసుకెళ్లారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవులను అటు ఉప్పాల రాంప్రసాద్‌, ఇటు దుట్టా రామచంద్రరావు తిరస్కరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇద్దరు జడ్పీ పీఠం వైపే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మరో బీసీ మహిళకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో నేతలు మాత్రం అంతా సీఎం నిర్ణయమేనని చెబుతున్నారు. ఆయన మదిలో ఎవరు ఉన్నారో తమకు తెలియదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరి చక్రాలు వారు తిప్పుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని