నూతన ఆస్పత్రులకుమార్గం సుగమం
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

నూతన ఆస్పత్రులకుమార్గం సుగమం

కృష్ణాలో

ఈనాడు, అమరావతి

క్షేత్ర స్థాయిలో వైద్య, ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు తాజాగా ప్రభుత్వం మండలానికి రెండేసి ప్రాథమిక- వైద్య ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు 19, కృష్ణా జిల్లాకు 8 నూతన పీహెచ్‌సీలను మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 87 పీహెచ్‌సీలు, 17 సీహెచ్‌సీలు, రెండు ప్రాంతీయ వైద్యశాలలు, ఒక జిల్లా ఆసుపత్రి, మరో బోధనాసుపత్రి ద్వారా వైద్యసేవలు అందుతున్నాయి. ఇంకా ఆస్పత్రుల ఆవశ్యకత ఉందని ప్రభుత్వం గుర్తించింది. వీటి ద్వారా సేవలు మెరుగుపడతాయని భావిస్తోంది. గతంలో మండలానికి ఒకటి మాత్రమే ఉండేది. దాని ద్వారా ఆ మండలంలో ఉండే 30-40 వేల జనాభాకు సేవలు అందించటం కష్టమవుతోంది. మండలానికి సుమారు 20-30 కి.మీ దూరం నుంచి పీహెచ్‌సీకి సేవలు అందుకోవడానికి ప్రజలు వస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక రహదారి ప్రమాదాలు గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాల్లోని క్షతగాత్రులకు వైద్యసేవలు లోపిస్తున్నాయని గుర్తించి అత్యధిక పీహెచ్‌సీలను ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఆస్పత్రులు ఎక్కడెక్కడ ఏర్పాటు కానున్నాయో ఇప్పటికే జాబితాను సైతం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాలకు పంపింది. వీటిల్లోనూ ఇద్దరేసి వైద్యుల చొప్పున నియామకాలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. అవసరమైన పారా మెడికల్‌, ఫార్మాసిస్టు అంతా కలిపి 14 మంది సిబ్బంది ఉంటారు. సాధ్యమైనంత త్వరగా ఇవి అందుబాటులోకి తేవాలనే యోచనలో వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఉన్నాయి. అవసరమైతే వీటిని తాత్కాలికంగా ఏర్పాటు చేసి రెండు, మూడు నెలల్లోనే సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంలో యంత్రాంగం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని