దసరా.. దారెటు..!
eenadu telugu news
Updated : 23/09/2021 04:19 IST

దసరా.. దారెటు..!

ఇంద్రకీలాద్రి వేడుకల్లో భక్తుల నియంత్రణే కీలకం

దర్శనాలు, టిక్కెట్లు, అన్నదానంపై దృష్టి పెట్టాలి

ఈనాడు, అమరావతి- న్యూస్‌టుడే, ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలు ఈసారి ఎలా ఉంటాయనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఏటా దసరా వేడుకలకు కనీసం నెల రోజుల ముందు సన్నాహక సమావేశం నిర్వహించేవారు. వేడుక ఎలా నిర్వహించాలి? ఏఏ ఏర్పాట్లు చేయాలి? భక్తులకు అందించే సేవలు.. ఇలా అన్నింటిపైనా స్పష్టంగా నెల రోజులకు ముందే నిర్ణయం తీసుకునేవారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని దసరా సన్నద్ధతపై చర్చించేవారు. ఈసారి సమన్వయ సమావేశం

గురువారం జరగబోతోంది. అక్టోబరు 7 నుంచి ఆరంభమయ్యే దసరా వేడుకలకు ఇంకా పది రోజుల సమయమే ఉంది. గతంలో నెల రోజుల ముందు ఒక సమావేశం పెట్టి తర్వాత దసరా సమీపించిన సమయంలో మరోసారి సమీక్షించేవారు. అంతకుముందు జరిగిన సమావేశంలో నిర్ణయించిన మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయో లేదో కలెక్టర్‌ సమీక్షించేవారు. ప్రస్తుతం అంత సమయం లేదు. కీలకమైన నిర్ణయాలన్నింటినీ ఈ సమావేశంలోనే తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం ఇంకా ఉండడంతో పాటు ఇప్పుడే మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. పండుగల విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కాణిపాకం వంటి దేవాలయాల్లో ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

గత ఏడాది అదుపు చేయలేక..

గత ఏడాది ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామని, ఆన్‌లైన్‌లో ముందుగా జారీ చేసే టిక్కెట్లు ఉన్న వారిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు. కానీ.. ఉత్సవాలు ఆరంభమయ్యాక ఈ ఆన్‌లైన్‌ టిక్కెట్లు పక్కకుపోయాయి. అప్పటికప్పుడు క్యూలైన్లలో భక్తులకు టిక్కెట్లు విక్రయించి వచ్చిన వారిని వచ్చినట్టే అనుమతించేశారు. దాంతో ఇంద్రకీలాద్రిపై భక్తజనం కిక్కిరిసిపోయారు. రోజుకు పది వేల మందికి మించి అనుమతించబోమంటూ చెప్పిన మాటలన్నీ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.

ప్రధాన అంశాలు...

భక్తుల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక పూజలను ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టడమే ఉత్తమ మార్గం. గతేడాది ఈ విషయంలో విజయవంతమయ్యారు. కానీ దసరా తర్వాత ప్రత్యేక పూజల భక్తులకు పంపించాల్సిన అమ్మవారి కుంకుమ, ప్రసాదాల విషయంలో జాప్యం జరిగింది. ఈ ఏడాది దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఇస్తారా? కౌంటర్లలో ఇస్తారా అనేది ఈ రోజు సమావేశంలో స్పష్టంగా నిర్ణయించాలి. ప్రసాదాల విక్రయాలు, అన్న ప్రసాద పంపిణీ ఉంటుందో లేదో కూడా ఇప్పుడే ఓ స్పష్టతకు రావాలి. ముందునుంచే భక్తులకు వీటిపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈసారి ఈవో కూడా కొత్తగా రావడం, చాలా మంది సీనియర్‌ ఉద్యోగులు బదిలీలపై ఇక్కడి నుంచి ఇతర ఆలయాలకు వెళ్లడం వంటివి జరిగాయి. వీటి ప్రభావం ఉత్సవాల నిర్వహణపై కచ్చితంగా పడుతుంది. ప్రసాదాల తయారీ, విక్రయాలు, దర్శనం, రవాణా, సమాచార కేంద్రాల ఏర్పాటు వంటి వాటిపై సమావేశంలో దృష్టి సారించాల్సి ఉంటుంది.

ప్రొటోకాల్‌ దర్శనాలతో తలనొప్ఫి.

దసరా వేడుకల్లో సాధారణ భక్తులకు సవాలక్ష నిబంధనలు పెట్టి.. వారిని ముప్పుతిప్పలు పెట్టే అధికారులు.. ప్రొటోకాల్‌, వీఐపీ, సిఫార్సుల దర్శనాల విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరిస్తుంటారు. అందుకే ఏటా దసరా వేడుకల్లో ఈ ప్రత్యేక దర్శనాల వల్ల.. విధుల్లో ఉండే పోలీసులు, దేవస్థానం సిబ్బందికి అనేక తలనొప్పులు వస్తుంటాయి. వీరిని అదుపు చేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఇప్పటికే ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో పాటు ఈసారి పరిషత్‌ ఎన్నికలు కూడా పూర్తయి కొత్తగా ప్రజాప్రతినిధులు వచ్చారు. విజయవాడలోని కార్పొరేటర్ల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులందరి తరఫున నిత్యం వందల మంది ప్రత్యేక దర్శనాలకు వస్తుంటారు. వీరితో పాటు పాలక మండలి సభ్యులు కొంత మంది నిత్యం వందల మందిని దర్శనాలకు తీసుకొస్తూ ఉంటారు. అధికారులు చెప్పినా వినిపించుకోరు. విధుల్లో ఉండే సిబ్బందితో గొడవలకు దిగుతుంటారు. అందుకే.. ఈ వీఐపీ, సిఫార్సుల దర్శనాలకు గతంలో మాదిరిగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా సమయాలను ప్రకటిస్తే తప్ప అదుపు చేయడం కష్టం. ఆ సమయంలోనే రావాలని, మిగతా వేళల్లో వచ్చి సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగించొద్దంటూ ముందుగానే ప్రకటనలు ఇస్తే చాలావరకూ వీరిని నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని