స్నేహపూర్వ పోలీసింగ్‌కు ప్రాధాన్యం: ఎస్పీ
eenadu telugu news
Published : 23/09/2021 02:08 IST

స్నేహపూర్వ పోలీసింగ్‌కు ప్రాధాన్యం: ఎస్పీ


ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: స్నేహపూర్వక పోలీసింగ్‌కు పెద్దపీట వేస్తున్న పరిస్థితుల్లో బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయడం ద్వారా తగు న్యాయం పొందాలని ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ సూచించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన నూజివీడు, నందిగామ ప్రాంతాలకు చెందిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ఓ మహిళ తనకు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైందని, పరస్త్రీ వ్యామోహంలో పడిన భర్త ఆగడాల కారణంగా తనకు గర్భస్రావం అయ్యిందని, అతని నుంచి తగు రక్షణ కల్పించాలని కోరారు. పెనుగంచిప్రోలుకు చెందిన వ్యక్తి తనకు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని సొంత అన్నయ్యే ఆక్రమించుకోవాలని చూస్తూ తనను అంతమొందించాలని చూస్తున్నాడని, తగు చర్యలు తీసుకోవాలని అర్జీ ఇచ్చారు. న్యాయస్థానం ఇంజెక్షన్‌ ఉత్తర్వులు ఇచ్చినా తన పొలం సాగుచేసుకోనీయకుండా సరిహద్దుదారులు ఇబ్బందులు పెడుతున్నారని తిరువూరు ప్రాంతానికి చెందిన మహిళ ఫిర్యాదు చేశారు. వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు సమర్పించిన దాదాపు 20 ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ విచారణ నిర్వహించి చట్టపరిధిలో వారికి న్యాయం చేయాలని సంబంధిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని