ఎగరని డ్రోన్‌
eenadu telugu news
Updated : 23/09/2021 04:12 IST

ఎగరని డ్రోన్‌

నత్తనడకన సమగ్ర భూసర్వే

ఈనాడు, అమరావతి

ఆగిరిపల్లి మండలం మల్లేశ్వరంలో రోవర్‌తో సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది

ల్లేశ్వరం గ్రామంలో సర్వే సిబ్బంది ప్రభుత్వ భూములు, గ్రామ సరిహద్దులు గుర్తించారు. డ్రోన్‌ సర్వే పూర్తి చేసి సర్వే ఆఫ్‌ ఇండియాకు పంపించారు. అక్కడి నుంచి ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌ షీట్లు వచ్చాయి. వాటి ఆధారంగా క్షేత్ర స్థాయిలో సర్వే జరగాల్సి ఉంది. భూ యజమానులకు నోటీసులు అందించి, ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కరించి తుది రికార్డు రూపొందించనున్నారు.
దీనికి ఇప్పటికే 3 నెలలకు పైగా సమయం పట్టింది. ఇలాంటి గ్రామాలు జిల్లాలో పది ఉన్నాయి. ఇవికాకుండా క్లస్టర్‌ డివిజన్‌లో 50 గ్రామాలను ఎంపిక చేశారు. వీటిలో ఇంకా డ్రోన్‌ చిత్రాలనే తీయలేదు.

- ఇదీ జిల్లాలో సర్వే తీరు

భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా జిల్లాలో చేపట్టిన సర్వే తీవ్ర జాప్యం జరుగుతోంది. మరోవైపు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఏడాదిన్నరలో మొత్తం సర్వే పూర్తి చేసి రైతులకు హక్కులు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఆరు నెలల్లో తొలి దశలో జిల్లాలోని మూడో వంతు గ్రామాలను పూర్తి చేయాల్సి ఉండగా ఇంతవరకు క్లస్టర్‌ గ్రామాల్లోనూ సర్వే ప్రాథమిక దశ దాటలేదు. జిల్లాలో సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ భూసర్వే జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి వైఎస్సార్‌ జగనన్న భూరక్ష-శాశ్వత భూహక్కు అనే పేరును ఖరారు చేసిన విషయం విదితమే. 

లక్ష్యం: మొత్తం 53 మండలాల్లో 1005 గ్రామాలు ఉన్నాయి. తొలి దశలో 332 గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. ఒక దశకు ఆరు నెలల సమయం. ఇప్పటికి 9నెలలు గడిచినా ఇంకా చిత్రాలను కూడా సేకరించలేదు. జిల్లాకు ఒక్క డ్రోన్‌ మాత్రమే కేటాయించారు. దీంతో ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.

ఏం చేయాలి: డ్రోన్‌ విధానంలో ముందుగా ఆ గ్రామ సరిహద్దులను నిర్ణయిస్తారు. తర్వాత సర్వే ఆఫ్‌ ఇండియా తీసిన సరిహద్దులతో సరిపోల్చుతారు. తర్వాత డ్రోన్‌ ద్వారా గ్రామం చిత్రాలను సేకరిస్తారు. వీటిలో సరిహద్దులపై కచ్చితత్వం ఉంటుంది. వీటిలోనూ వ్యత్యాసం ఉంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరిస్తారు. ఒక గ్రామానికి సర్వేయరు, వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఏ ఒక బృందంగా ఉండి సర్వే చేయాల్సి ఉంటుంది. ముందుగా రైతులకు నోటీసులు జారీ చేయాలి. చిత్రాలు తీసిన తర్వాత వచ్చిన లెక్కలతో వివరాలను వారికి అందజేయాల్సి ఉంటుంది. చివరికి తుది సర్వే ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యంతరాలను మొదట మండల సర్వేయరు, తహసీల్దారు, తర్వాత ఆర్‌డీఓ, జిల్లా సంయుక్త కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరిస్తారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలు కల్పించారు.

ఎక్కడెక్కడ...

* జిల్లాలో ముందుగా రెవెన్యూ డివిజనులో ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. నాలుగు గ్రామాల్లో సర్వే జరుగుతోంది. పోట్లపాలెం, మీరాకుగూడెం, మర్రిబందం, షేర్‌మ్మిద్‌పేటలో సర్వే జరుపుతున్నారు. వీటితో పాటు మరో ఆరు గ్రామాలు ప్రయోగాత్మకంగా తీసుకున్నారు. ఆగిరిపల్లి, ఉంగుటూరు, గన్నవరం, గుడ్లవల్లేరు, బంటుమిల్లి, పెడన మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు.

* ఒక డివిజన్‌లో క్లస్టర్‌గా మార్చి 50 గ్రామాలను ఎంపిక చేశారు. గుడివాడ డివిజన్‌లో గుడ్లవల్లేరు, పామర్రు మండలాల్లో మొత్తం 25 చొప్పున 50 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో సీజీపీ (గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్‌) మాత్రమే నిర్వహించారు. వీటిని సర్వే శాఖ సర్వే ఆఫ్‌ ఇండియాకు పంపించారు.

* మచిలీపట్నం డివిజన్‌లో 12 మండలాల్లో 212 గ్రామాలకు తొలి దశలో 71 గ్రామాలను ఎంపిక చేశారు. 5 గ్రామాల సరిహద్దులను గుర్తించారు. నూజివీడు డివిజన్‌లో 14 మండలాల్లో 280 గ్రామాలకు 93 గ్రామాలను ఎంపిక చేశారు. 19 గ్రామాల సరిహద్దులు పూర్తి చేశారు. గుడివాడ డివిజన్‌లో 9 మండలాలకు 221 గ్రామాల్లో 74 ఎంపిక చేశారు. 20 గ్రామాల్లో మార్కింగ్‌ పూర్తి అయింది. విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 18 మండలాల్లో 292 గ్రామాలకు తొలి దశలో 94 ఎంపిక చేశారు. 18 గ్రామాల్లో డీమార్కింగ్‌ పూర్తికాగా 2 గ్రామాల్లో డ్రోన్‌ చిత్రాలను సేకరించారు.

* మొత్తం సర్వే సిబ్బంది 768 మంది ఉండాల్సి ఉంది. ప్రస్తుతం సిబ్బంది ఉన్నా డ్రోన్‌లు లేకపోవడంతో చిత్రాలు సేకరించలేని పరిస్థితి ఉంది. గ్రామ సరిహద్దులు మార్కింగ్‌ చేయడంలో నిమగ్నమయ్యారు. 2022 జూన్‌ నాటికి జిల్లాలో అన్ని గ్రామాలు సర్వే పూర్తి కావాల్సి ఉంది. ఇలా జరిగితే మాత్రం పూర్తి చేసే అవకాశం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.


జిల్లాలో గతంలో 20 గ్రామాలకే డ్రోన్‌ ఎగురవేశారు. 332 గ్రామాలకు 62 గ్రామాల సరిహద్దులు గుర్తించారు. వాటిలో 40 గ్రామాలకు సర్వే ఆఫ్‌ ఇండియా చిత్రాలతో సరిపోల్చారు. వ్యత్యాసాలను గుర్తించారు. తాజాగా మళ్లీ మారిన విధానం ప్రకారం క్లస్టర్‌ గ్రామాల చిత్రాలను తీయాల్సి ఉంది. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. వాటి చిత్రాలను తీయాల్సి ఉంది.


వేగవంతం చేస్తున్నాం

- కె.మాధవీలత, జేసీ (రెవెన్యూ)

జిల్లాలో సమగ్ర భూసర్వే త్వరితగతిన పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం జిల్లాలో రెవెన్యూ డివిజన్‌కు ఒక మండలంతో పాటు మరో ఆరు గ్రామాలను కలిపి మొత్తం 10 గ్రామాలను పైలట్‌ కింద తీసుకున్నాం. వీటిలో త్వరితగతిన సిబ్బంది సర్వే చేస్తున్నారు. క్లస్టర్‌ గ్రామాలుగా 50 ఎంపిక చేశాం. ఇక్కడ గ్రామ పటాలను రూపొందిస్తున్నారు. డ్రోన్‌ ఇతర సాంకేతిక సమస్యలు పరిష్కరించాం. సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి లాప్‌ట్యాప్‌లు అందించాం. పురోగతిని సమీక్షిస్తున్నాం. అభ్యంతరాలు వచ్చిన చోట స్థానికంగానే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం.

నోటీసులు ఇస్తున్నారు..

- సుబ్బారావు, సర్పంచి, బూతుమిల్లిపాడు

బూతుమిల్లిపాడు గ్రామంలో జులై నుంచి సర్వే చేస్తున్నారు. రైతులందరికీ నోటీసులు జారీ చేశారు. మొత్తం 216 ఎకరాలు ఉంది. 30 కుటుంబాల వరకు రైతు కమతాలు ఉన్నాయి. పెద్దగా వ్యత్యాసాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇంకా డ్రోన్‌ ద్వారా చిత్రాలు తీయలేదు. ప్రతి రోజూ ముగ్గురు సిబ్బంది వస్తున్నారు. సర్వే చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని