సార్‌.. నేను చనిపోతున్నా
eenadu telugu news
Updated : 23/09/2021 12:08 IST

సార్‌.. నేను చనిపోతున్నా

ఎమ్మెల్యే ఉదయభానుకు వెంకటాపురం పంచాయతీ కార్యదర్శి లేఖ

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: మండలంలోని వెంకటాపురం పంచాయతీ కార్యదర్శి పి.స్వాతి తాను చనిపోతున్నానని ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు బుధవారం రాసిన లేఖ కలకలం రేపింది. పెనుగంచిప్రోలు ఎంపీడీవో బి.రాజు, మరో ఇద్దరు తనను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. తన చావుకు వారే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. శనగపాడు పంచాయతీ విధుల నుంచి తనను తప్పించాలని గతంలోనే మిమ్మల్ని కలిసినా ఫలితం లేకపోయిందని, అప్పటి నుంచి ఎంపీడీవో రాజు, సచివాలయ సిబ్బంది తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ ఎంపీడీవో బి. రాజు వివరణ కోరగా... ‘కార్యదర్శి స్వాతి వెంకటాపురంతో పాటు శనగపాడు పంచాయతీలకు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. శనగపాడు కార్యదర్శి విధుల నుంచి తప్పించాలని పలుమార్లు ఆమె కోరారు. కానీ కార్యదర్శుల కొరత వల్ల ఆమెకు రెండు పంచాయతీలు ఉంచాం. ఈ విషయమై రెండు రోజుల కిందట నా కార్యాలయంలో అందరి సమక్షంలో చర్చ జరిగింది. ఆ సమయంలో ఆమె నా పట్ల దురుసుగా మాట్లాడారు’ అని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని