తండ్రుల అఘాయిత్యాలపై కఠిన చర్యలు
eenadu telugu news
Published : 23/09/2021 03:15 IST

తండ్రుల అఘాయిత్యాలపై కఠిన చర్యలు


ఖైదీలకు చీరలు పంపిణీ చేస్తున్న మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. చిత్రంలో రమాదేవి, డాక్టర్‌ సునీతాదేవి

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : బాలికలపై కొనసాగుతున్న కన్న తండ్రుల అఘాయిత్యాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్‌లోని జిల్లా కారాగారంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళా ఖైదీల సౌకర్యాలు, మెనూ, అల్లికలు, వివిధ వస్త్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వరల్డ్‌ విజన్‌ సంస్థ అధినేత ఎన్‌.జోజిబాబు ఆధ్వర్యంలో ఆమె ఖైదీలకు చీరలు పంపిణీ చేశారు. ఖైదీల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. న్యూట్రిషన్‌ డాక్టర్‌ ఎన్‌.సునీతాదేవి పోషకాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం పద్మ విలేకర్లతో మాట్లాడారు. బాలికలు, మహిళలకు ఇంటి వద్ద కూడా భద్రత లేకుండా పోతోందన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, పోక్సోకు మించిన ప్రత్యేక కఠిన చట్టం తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల మహిళా సమస్యలను కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. అలా కాకుండా అఘాయిత్యాలపై అధికార, విపక్షాలు ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కృషి కారణంగానే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అంతే స్థాయిలో నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. వీటిపై అధ్యయనం చేస్తూ.. నివారణ చర్యలు చేపట్టడంలో ముఖ్యమంత్రి జగన్‌ ముందంజలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా సాధికారత, భద్రత బాగుందన్నారు. బాలిక విద్య పట్ల నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అసంఘటిత రంగంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై విచారణ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ-నారీ వెబినార్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పద్మ తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.రమాదేవి, మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ సూయజ్‌, ఐసీడీఎస్‌ ఏపీడీ జయలక్ష్మి, జైలర్లు జి.రవిబాబు, ఎన్‌.గణేష్‌, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని