కష్టాల కాన్పు..కాస్త సర్దుకో పాన్పు
eenadu telugu news
Published : 23/09/2021 03:15 IST

కష్టాల కాన్పు..కాస్త సర్దుకో పాన్పు

పునాదులకే పరిమితమైన నిర్మాణ పనులు
మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణంపై సందిగ్ధత
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే

పునర్జన్మ వంటి ప్రసూతి వేదనను తట్టుకుని బిడ్డలకు జన్మనిచ్చే మాతృమూర్తులకు సర్వజనాసుపత్రిలో యాతన తప్పడం లేదు. పడకలు సరిపడా లేక.. ఒకే మంచంపై ఇద్దరేసి బాలింతలు సర్దుకుని గడపాల్సిన దయనీయస్థితి. పడకకు ఓవైపు బాలింత, శిశువు ఉంటే.. వారి కాలు వైపున మరో బాలింత సేదతీర్సాలిన పరిస్థితి. కనీసం కదలడానికీ చోటులేక నరకం అనుభవిస్తున్నారు. శస్త్రచికిత్సల ద్వారా కాన్పులు జరిగిన వారైతే పసికందులు సహా ఒకే పడక పైన ఇద్దరు ఇమడలేక పడే వేదన వర్ణనాతీతం. నవ మాసాలుగా కడుపులో మోస్తున్న తన కలల ప్రతిరూపం ఈ లోకంలోకి వస్తూనే బాధలు పడాల్సి వచ్చిందని ఆ మాతృ హృదయం అంతులేని ఆవేదనతో తల్లడిల్లిపోతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవానికి సుమారు రూ.40 వేలు ఖర్చవుతున్నట్లు పలువురు తెలుపుతున్నారు. అంతమొత్తం భరించలేక సదుపాయాలు లేకపోయినా జీజీహెచ్‌కు రావాల్సి వస్తుందని వారు వివరిస్తున్నారు.

ఆగిపోయిన నిర్మాణ పనులు

సమస్య ఏమిటంటే..
సర్వజనాసుపత్రిలో బాలింతలకు 65 పడకలను మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ విభాగంలో ఎప్పుడు చూసినా 95 మందికి పైగానే ఉంటున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవార్గల్లో ప్రసూతి సేవలు అందుబాటులో ఉన్నా.. ఇక్కడికే పంపేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రి అయినందున వచ్చిన గర్భిణులను వెనక్కి పంపేందుకు వీలు లేదు. దీంతో వారందరినీ చేర్చుకుని కాన్పు అనంతరం ఒకే మంచంపై ఇద్దరేసి సర్దుబాటు చేస్తున్నారు.
పనులెందుకు ఆగిపోయాయంటే..
మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణ పనులకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని గుత్తేదారు పలుసార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయినప్పటికీ అతడికి చెల్లించకపోవడంతో పనులను నిలిపివేసినట్లు సమాచారం. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జింకాన ప్రతినిధులు ప్రభుత్వం తన వాటా కింద కేటాయించిన నిధులకు అవసరమైన పనులు వెంటనే పూర్తి చేసి తమకు అప్పగిస్తే.. మిగిలిన పనులను తాము చేస్తామని ఇక్కడ చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యులు(జింకాన) ప్రభుత్వానికి పలుసార్లు లేఖలు రాయడమే గాకుండా, వ్యక్తిగతంగా కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. తమ సభ్యుల వద్ద సేకరించిన రూ.30 కోట్ల మొత్తం ఇప్పటికే జింకాన వద్ద ఉందన్నారు. అందువల్ల ఆ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందన్నారు. అందువల్ల వీలైనంత త్వరగా ఆ భవనం పనులు పూర్తిచేసి తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  
ఎమ్మెల్యే ఏమంటున్నారు
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఇప్పటికే కనీసం 10 సార్లు మాతా శిశు సంరక్షణ భవనం నిర్మాణం పనులు ప్రారంభించాలని అధికారులకు, మంత్రులకు లేఖలు రాశారు. తన నియోజకవర్గ పరిధిలోని పెద్దాసుపత్రిలో గర్భిణులు పడుతున్న ఇబ్బందులను ఆయన లేఖలో వివరించారు. అయినప్పటికీ స్పందన కనిపించకపోవడం గమనార్హం.
సూపరింటెండెంట్‌ ఏం చేశారు
సూపరింటెండెంట్‌గా ప్రభావతి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. మాతాశిశు సంరక్షణ కేంద్రం పనులు ప్రారంభించాలని ఇప్పటికే పలుసార్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు లేఖలు రాశారు. అయినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు.

రూ.65 కోట్లు మంజూరైనా..
గుంటూరు సర్వజనాసుపత్రి(జీజీహెచ్‌)లో మాతాశిశు సంరక్షణ కేంద్రం మొత్తం రూ.65 కోట్ల వ్యయంతో జి+5 బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తంలో రూ.65 కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.20 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు, మిగిలిన రూ.30 కోట్లు జింకాన భరించేవిధంగా ఎంవోయూ కుదుర్చుకున్నారు.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ రూ.24.50 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి 2019, ఫిబ్రవరిలో గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలి దశలో సెల్లార్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి అంతస్తు పనులు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా సుమారు రూ.5.5 కోట్ల వ్యయంతో కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. అనంతరం కరోనా నేపథ్యంలో పనులు నిలిపివేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు పనులు మొదలుపెట్టలేదు.. ఈ నిర్మాణ పనులు ఎంత వేగంగా జరిగితే గర్భిణులకు అంత మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అందువల్ల ఆగిపోయిన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా అధికారులు చూడాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం సెల్లార్‌+జి+1 పనులను పూర్తి చేసిన అనంతరం మిగిలిన అంతస్తులను రూ.30 కోట్ల వ్యయంతో ఇక్కడ చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యులు(జింకాన) నిర్మించేవిధంగా ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని