కుల ధ్రువీకరణ పత్రం జారీలో తాత్సారం
eenadu telugu news
Published : 23/09/2021 03:15 IST

కుల ధ్రువీకరణ పత్రం జారీలో తాత్సారం

భగ్గుమంటున్న తెదేపా వర్గాలు


తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వేచి ఉన్న తెదేపా మండల అధ్యక్షుడు వెంకట్రావు, చిలువూరు ముస్లిం సోదరులు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: మండలంలోని చిలువూరు-1 నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచిన షేక్‌ జబీన్‌కు మండల రెవెన్యూ కార్యాలయ అధికారులు కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని తెదేపా వర్గాలు మండిపడ్డాయి. మూడు రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా తహసీల్దార్‌ కావాలని మోకాలడ్డుతున్నారంటూ తెదేపా నాయకులు బుధవారం విమర్శించారు. తమ పార్టీ నుంచి ఎంపీపీ అభ్యర్థిగా గెలుపొందే అవకాశం ఉన్న చిలువూరు-1 ఎంపీటీసీ సభ్యురాలు షేక్‌ జబీన్‌కు కుల ధ్రువీకరణ పత్రం కావాలని సోమవారం దరఖాస్తు చేసినట్లు ఆమె బాబాయి జలాలుద్దీన్‌ తెలిపారు. వీఆర్వో, ఆర్‌ఐ సంతకాలు చేసి తహసీల్దార్‌కు పంపారని, ఆమె సంతకం చేయకుండా ఇంకా సమయం కావాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళ ఎంపీపీ కావడం ఇష్టం లేకనే కొందరు కుల ధ్రువీకరణ పత్రం రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెదేపా మండల అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి దుగ్గిరాలపైనే ఉందన్నారు. ఇక్కడ తమ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నా, వైకాపా జెండా ఎగుర వేస్తామని ఎమ్మెల్యే ఆర్కే అనడం వెనక ఉద్దేశం తమకు అర్థమవుతోందన్నారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన తహసీల్దారు తిరిగి బయటకు వెళ్లారని, సాయంత్రం 5 గంటలైనా రాలేదన్నారు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌ వస్తోందని, ఇదేం పద్ధతని ఆయన ప్రశ్నించారు.

వీలైనంత త్వరలో ఇస్తాం: దీనిపై తహసీల్దారు మల్లేశ్వరి మాట్లాడుతూ కుల ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేస్తే, నిబంధనల ప్రకారం ఇవ్వడానికి 30 రోజులు సమయం ఉంటుందన్నారు. ఎల్లుండే పదవీ స్వీకారం చేయాలి కదా అని ప్రశ్నిస్తే, అందుకే వీలైనంత త్వరలో ఇస్తామన్నారు. ఎన్నికల విషయం కాబట్టి జాగ్రత్తగా విచారణ చేయాల్సి ఉంటుందని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని