క్రిస్టినాకే కిరీటం
eenadu telugu news
Published : 23/09/2021 03:15 IST

క్రిస్టినాకే కిరీటం

జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వానికి బి-ఫారం అందజేత

ఈనాడు, అమరావతి

జిల్లాలో జడ్పీటీసీ స్థానాలను అధికార వైకాపా కైవసం చేసుకోవడంతో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌తో పాటు ఇతర పదవులు ఆ పార్టీ అభ్యర్థులే ఎన్నికకానున్నారు. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో కొల్లిపర నుంచి గెలిచిన కత్తెర హెన్రీ క్రిస్టినాను ఎంపిక చేశారు. ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం జిల్లా నేతల సమక్షంలో బీ-ఫారం క్రిస్టినాకు అందజేశారు. ఈనెల 25న జడ్పీలో జరిగే సమావేశంలో క్రిస్టినాను జిల్లా పరిషత్‌ ఛైర్సన్‌గా ఎన్నుకోనున్నారు. జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్ష పదవులను ఓసీ వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పల్నాడు ప్రాంతం నుంచి రెడ్డి సామాజికవర్గానికి, డెల్టా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఉపాధ్యక్ష పదవులు ఇవ్వనున్నారని అధికార పార్టీలో చర్చ నడుస్తోంది. కోఆప్షన్‌ సభ్యులు ఇద్దరిలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఒకరిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మరో పదవిని క్రిస్టియన్‌ మైనార్టీ వర్గాలకు కేటాయించాలని తెరపైకి వచ్చింది.

ఎంపీపీ పదవులకు ఎంపికపై స్పష్టత.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో జిల్లా నేతలు సమావేశమై పదవుల పంపకంపై చర్చించారు. మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు ఒకే సామాజికవర్గానికి రాకుండా జాగ్రత్తలు తీసుకుని అవకాశాలు అందరికీ వచ్చేలా చూడాలని సమావేశంలో ఇన్‌ఛార్జి మంత్రి నేతలకు సూచించారు. జడ్పీటీసీ ఓసీ సామాజిక వర్గానికి ఉన్నట్లయితే అదే మండలంలో ఎంపీపీ పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారికి అప్పగించాలని నిర్ణయించారు. దీంతో కొన్ని మండలాల్లో ఎంపీపీ పదవుల అభ్యర్థులు మారనున్నారు. ఎంపీపీ పదవులపై ఇప్పటికే స్పష్టత రాగా ఏకాభిప్రాయం రానిచోట ఆయా నియోజకవర్గాల నేతలు సర్దుబాటు చేయనున్నారు. మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల పదవులకు శుక్రవారం ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో గురువారమే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇన్‌ఛార్జి మంత్రితో సమావేశమైన వారిలో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు, విప్‌ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు నంబూరి శంకరరావు, మేరుగ నాగార్జున ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని