తెలుగు భాషకు సొబగులద్దిన మహాకవి
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

తెలుగు భాషకు సొబగులద్దిన మహాకవి


జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్‌

నగరంపాలెం, న్యూస్‌టుడే: ఆధునిక తెలుగు భాషకు కొత్త నూడికారాన్ని చుట్టి ప్రజల భాషగా, కవిత్వంగా మార్చిన మహాకవి గుర్రం జాషువా కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని మహాకవి జాషువా కళాపీఠం వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాషువా జయంతి వారోత్సవాల్లో భాగంగా నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ‘జాషువా పాటకు పట్టాభిషేకం’ అనే అంశంపై బుధవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ నాటి సమాజంలో ఉన్న సామాజిక, సాంస్కృతిక అసమానతలపై తన పద్య, గద్య కవితల ద్వారా ఎలుగెత్తి చాటారని కొనియాడారు. జాషువా సాహిత్యంపై దేశ, విదేశీ కవులు పరిశోధనలు చేయడం ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తుందన్నారు. నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాకు జాషువా జిల్లాగా నామకరణం చేయాలన్నారు. గుంటూరులోని ఆయన ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గ్రంథాలయంగా మార్చాలని, ఆయన సమాధిని స్మారక కట్టడంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ జాషువా కలలుగన్న అసమానతలు లేని పరిపాలన సీఎం జగన్‌ చేయడంతో ప్రజలందరూ హర్షిస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వహించిన హైకోర్టు న్యాయవాది గడ్డం ఎలిషా మాట్లాడుతూ జయంతి వారోత్సవాల్లో భాగంగా జాషువా కూడలి వద్ద రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సాహిత్య సదస్సుల్లో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారన్నారు. సాహిత్య అభిమానులు, కవులు, కళాకారులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు, మస్తాన్‌వలి, జోసఫ్‌, జాన్‌బాబు, బాబురావు, బెనర్జీ, మోహన్‌రావు, సత్యరాజ్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని