సాగు తగ్గిస్తూ నాణ్యమైన పంట ఉత్పత్తికి ప్రోత్సాహం
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

సాగు తగ్గిస్తూ నాణ్యమైన పంట ఉత్పత్తికి ప్రోత్సాహం

పొగాకు బోర్డు అధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబు

అమృత ఉత్సవ్‌ బ్యానర్‌ చూపుతున్న రఘునాథబాబు, ఈడీ శ్రీధర్‌బాబు

గుంటూరు(జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: పొగాకు వాడకాన్ని నిషేధిస్తామని డబ్ల్యూటీవో ఒప్పందంపై మన దేశం సంతకం చేసిన దృష్ట్యా క్రమంగా పొగాకు పంట సాగును తగ్గిస్తూ నాణ్యమైన పంట ఉత్పత్తిని సేద్యం చేసే రైతులకు ప్రోత్సాహం అందజేస్తున్నామని భారత పొగాకు బోర్డు ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు తెలిపారు. గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబుతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 400 బిలియన్‌ డాలర్ల విదేశీ ఎగుమతులు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పొగాకు రంగం 30 శాతం ఎగుమతులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈనెల 24 నుంచి కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ప్రారంబించనున్నట్లు చెప్పారు. పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 2020-21 సీజన్‌కు సంబంధించి పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ ఈనెల 16న ముగిసిందన్నారు. నాణ్యమైన రకం కిలోకి అత్యధిక ధర రూ.193 లభించగా మధ్యస్థ రకానికి రూ.147.15, తక్కువ రకానికి రూ.79.61 ధర లభించిందని తెలిపారు. 112.74 మిలియన్‌ కిలోల పొగాకును రైతుల నుంచి వ్యాపారులతో కొనుగోలు చేయించామన్నారు. కిలోకి సగటు ధర రూ.147.30 లభించిందన్నారు. 75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత మహోత్సవ్‌లో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు వాణిజ్య ఉత్సవ్‌ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో రెండు రోజుల వాణిజ్య ఉత్సవ్‌ని ప్రారంభించడంతో పొగాకు బోర్డు తరఫున పాల్గొని పొగాకు రంగం ద్వారా విదేశీ ఎగుమతులకు నిబంధనలు సరళతరం చేయనున్నట్లు చెప్పామన్నారు. ప్రకృతి సేద్యం చేసే ప్రగతిశీల రైతులకు రూ.5 వేల నగదు, రూ.పది వేలు ఎరువులకు కలిపి రూ.15 వేలు ప్రోత్సాహం అందజేస్తున్నామని వివరించారు. ఆజాది కా అమృత ఉత్సవ్‌ కార్యక్రమం బ్యానర్‌ను రఘునాథబాబు ఆవిష్కరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని