స్టేషన్లలో సామాన్యులను పట్టించుకోవడం లేదు
eenadu telugu news
Updated : 23/09/2021 12:04 IST

స్టేషన్లలో సామాన్యులను పట్టించుకోవడం లేదు

‘డయల్‌ యువర్‌ ఎస్పీ’లో ఫిర్యాదుదారుల ఆవేదన


ఫిర్యాదులు నమోదు చేసుకుంటున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : స్టేషన్లలో పోలీసులు సామాన్యులను పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు బుధవారం ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమంలో రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ వద్ద వాపోయారు. తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని నెలలు తరబడి స్టేషన్‌ల చుట్టూ తిరగాలంటే కూలిపనులు చేసుకునే వారికి ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని వేడుకున్నారు. స్పందించిన ఎస్పీ సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. బుధవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమానికి పలువురు ఫిర్యాదులు చేశారు. వాటి పరిష్కారానికి ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

*● తెనాలికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ గత ఏడాది ఎన్‌జీవో కల్యాణ మండపంలోని వేడుకకు వెళితే తన బ్యాగ్‌ చోరీ అయ్యింది. అందులో రూ.9 లక్షల విలువ చేసే బంగారు వస్తువులు, చరవాణి ఉందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. ఎస్పీ వెంటనే సీఐతో మాట్లాడి త్వరగా దొంగను పట్టుకోవాలని ఆదేశించారు.

* హైదరాబాద్‌ నుంచి ఓ యువతి మాట్లాడుతూ తన తల్లి జంపనిలో ఇల్లు కట్టుకుంటోందని, మేస్త్రి నిర్మాణం మొత్తం చేసేలా ఒప్పందం చేసుకొని, నగదు అంతా తీసుకొని మధ్యలో పని ఆపేశాడన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో కూలి పెరిగిందని, ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ వృద్ధురాలైన తన తల్లిని ఇబ్బంది పెడుతున్నాడన్నారు. ఈవిషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. డీఎస్పీ, సీఐ, ఎస్సైల వద్దకు వెళ్లినా స్పందించ లేదు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశిస్తామన్నారు.

* అమృతలూరుకు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఆగస్టు 29న తన భార్యను సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్‌ తీసుకు వెళ్లాడని తెలిపాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై ఎస్పీ సదరు పోలీసులను విచారిస్తే 15 రోజులు వెతికి ఆమెను తీసుకు వచ్చామని, అయితే తన ఇష్టపూర్వకంగా వెళ్లానని చెబుతున్నట్లు తెలిపారు. బాధితుడు మాట్లాడుతూ తన భార్యను 15 రోజులపాటు కానిస్టేబుల్‌ తీసుకువెళ్లి సన్నిహితంగా ఉంటే అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సామాన్యుడికి న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఎస్పీ స్పందిస్తూ ఆమెను వెతికి తీసుకు రావడానికి ఆలస్యమైనందుకు పోలీసుల తరఫున తాను క్షమాపణలు చెపుతున్నానన్నారు. కానిస్టేబుల్‌పై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

* కొల్లూరుకు చెందిన వ్యక్తి మాట్లాడుతూ గత నెల 23న తన ద్విచక్రవాహనం చోరీకి గురైతే కేసు నమోదు చేయ లేదన్నాడు. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వాహనం వెతకాలని ఎస్పీ ఆదేశించారు.

* నకరికల్లు మండలానికి చెందిన ఓ యువతి మాట్లాడుతూ అయిదు నెలల కిందట వివాహ నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదంటున్నారని వాపోయింది. స్పందించిన ఎస్పీ అక్కడ ఎస్సైని న్యాయపరమైన సలహా తీసుకొని చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామన్నారు.

* తుళ్లూరుకు చెందిన ఓ వివాహిత మాట్లాడుతూ తన భర్తను అత్తింటి వాళ్లు దాచి పెట్టారని, ఏడాదిగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని తెలిపింది. ఎస్పీ ఆ ఫిర్యాదుపై వెంటనే ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని అక్కడి పోలీసులను ఆదేశించారు.

* ప్రకాశం జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌ మాట్లాడుతూ సత్తెనపల్లి వద్ద ఇసుక లోడింగ్‌ వచ్చినప్పుడు తనపై దాడిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. వెంటనే చర్యలకు ఆదేశిస్తానని ఎస్పీ బదులిచ్చారు.

*● పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరుకు చెందిన ఓ వివాహిత మాట్లాడుతూ తన భర్తపై 2015లో ఫిర్యాదు చేస్తే, అతనిపై 2019లో భరణం ఇవ్వడం లేదని వారెంట్‌ పంపిస్తే పోలీసులు అతనికి సహకరిస్తూ ఆ వారెంట్‌ను జారీ చేయడం లేదన్నారు. ఎస్పీ వెంటనే వారెంట్‌ జారీకి ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని