మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలి
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలి

తెదేపా సీనియర్‌ నేత యరపతినేని


మాట్లాడుతున్న యరపతినేని శ్రీనివాసరావు

పట్టాభిపురం (గుంటూరు), న్యూస్‌టుడే: ‘ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రెండున్నరేళ్లుగా అందినకాడికి దోచుకున్నారు. ఇప్పటికే రెండున్నర లక్షల కోట్లకు పైగా దిగమింగారు. జగన్‌ మాఫియా పాలన నుంచి విముక్తి కోసం బ్రిటీష్‌ పాలకులను పారదోలిన గాంధీజీ స్ఫూర్తిగా అయిదు కోట్ల మంది ఆంధ్రులు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలి’.. అని తెదేపా సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గుంటూరులో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌ రూ.లక్ష కోట్ల దోపిడీ చేశారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా రూ.18,000 కోట్లు అయితే.. ఆదానీ సంస్థకు కేవలం రూ.645 కోట్లకు విక్రయించారు. రాష్ట్ర సంపదను అయినకాడికి దోచిపెట్టే హక్కు ఎవరు ఇచ్చారు’.. అని ప్రశ్నించారు. ‘పదవిని కాపాడుకునేందుకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని నోరు పారేసుకుంటున్నారు. కుప్పం వరకు ఎందుకు.. వచ్చే ఎన్నికల్లో నీ సంగతి గుడివాడలోనే తేలుస్తాం. మళ్లీ లారీ క్లీనర్‌గా వెళ్లేందుకు సిద్ధంగా ఉండు. మేము అధికారంలోకి వచ్చాక తెదేపా కేంద్ర కార్యాలయంలో మా కార్లు తుడిచే పోస్టు మీకే ఇస్తాం. పేర్ని నాని, అవంతి శ్రీనివాస్‌, అంబటి రాంబాబు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’.. అని హెచ్చరించారు. జగన్‌ రెండున్నరేళ్లలోనే రూ.3,85,000 కోట్లు అప్పు తీసుకువచ్చి ఏం చేశారని యరపతినేని నిలదీశారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.34,000 కోట్లు కేటాయిస్తే దారి మళ్లించారు. ఎస్పీల హక్కులు కాలరాసినందుకు కోర్టులో కేసు వేసి జగన్‌ సంగతి తేలుస్తాం’.. అని హెచ్చరించారు. సమావేశంలో తెదేపా నాయకులు చిట్టాబత్తిన చిట్టిబాబు, యర్రమాల విజయ్‌కిరణ్‌, ఘట్టమనేని నాగేశ్వరరావు, కల్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని