13 మంది తహసీల్దార్లకు షోకాజు నోటీసులు
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

13 మంది తహసీల్దార్లకు షోకాజు నోటీసులు

12 మంది వీఆర్‌వోల సస్పెన్షన్‌ 

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఉత్తర్వులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో స్పందన అర్జీలు, రెవెన్యూ సేవలపై అందించిన దరఖాస్తులను పరిష్కరించడంలో అలసత్వం వహించిన 13 మంది తహసీల్దార్లకు షోకాజు నోటీసులు, 12 మంది గ్రామ రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో సచివాలయాల సందర్శనలో రెవెన్యూ సర్వీసుల్లో బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలో పెండింగ్‌, సమస్యల పరిష్కారంలో పనితీరు మెరుగుపర్చుకోవాలని పదే పదే సూచించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిర్ణీత గడువు లోపు సమస్యలు పరిష్కరించడంలో పనితీరులో అట్టడుగున ఉన్నందున అచ్చంపేట మండలంలోని వేల్పూరు, అచ్చంపేట, గుంటూరు పశ్చిమ మండలంలోని పొత్తూరు, కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల-1, ఒప్పిచర్ల-2, గురజాల మండలంలోని గంగవరం, ఈపూరు మండలంలోని వనికుంట, నాదెండ్ల మండలంలోని నాదెండ్ల-1, బొల్లాపల్లి మండలంలోని రెమిడిచర్ల, భట్టిప్రోలు మండలంలోని పెదపులివర్రు, కాకుమాను మండలంలోని గార్లపాడు, పొన్నూరు మండలంలోని పెదపాలెం సచివాలయాల్లోని 12 మంది గ్రామ రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ సేవల్లో అలసత్వం వహించిన కారణంగా గుంటూరు తూర్పు, పశ్చిమ మండలాలు, అచ్చంపేట, సత్తెనపల్లి, రెంటచింతల, కారంపూడి, దాచేపల్లి, నకరికల్లు, ఈపూరు, యడ్లపాడు, బాపట్ల, తెనాలి, పొన్నూరు మండలాల తహసీల్దార్లకు షోకాజు నోటీసులను జారీ చేసినట్లు కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉద్యోగుల్లో ఆందోళన: సేవల విషయంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తహసీల్దార్లకు నోటీసులు జారీ చేయడంతో మిగిలిన తహసీల్దార్లను కలవరపాటుకు గురి చేసింది. సచివాలయాల తనిఖీల సందర్భంలో పలుసార్లు సూచించినప్పటికీ తీరు మారకపోవడమే వీఆర్‌వోలను సస్పెండ్‌ చేయడానికి కారణమని పేర్కొనడంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రొబేషన్‌ పూర్తి చేసుకుని రెగ్యులర్‌ అవుతామనుకుంటున్న సచివాలయ ఉద్యోగులకు పాలనాధికారి ఉత్తర్వులు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని